– ప్రజల బలహీనతను ఆసరా చేసుకొని దోపిడీ చేస్తుంటే.. చూస్తూ ఊరుకోమంటారా?
– సినిమా అందుబాటులో ఉండాలే కానీ, సామాన్యుడికి అందనిదిలా ఉండకూడదు
– సినిమా టికెట్ ధరలు తగ్గిస్తే.. ప్రేక్షకులకు మేలు చేయడమే, అవమానించడం కాదు
– అశోక్ గజపతిరాజును అవమానించారనడం శుద్ధ అబద్ధం.. చట్టాన్ని ధిక్కరిస్తే చట్టం ముందు అంతా సమానులే
– అశోక్ గజపతిరాజు చేసింది ముమ్మాటికీ తప్పే.. చంద్రబాబు మాటలను వెనక్కి తీసుకోవాలి
– రామతీర్థం శిలాఫలకం మీద ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు పేరు లేదనడం శుద్ధ అబద్ధం
– రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
సినిమా టికెట్లు విక్రయంలో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎవరికైనా, ఏమైనా ఇబ్బందులు ఉంటే, వారు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసుకోవాలి. అలా కాకుండా, మా ఇష్టారాజ్యంగా చేసుకుంటామంటే కుదరదు. ఎంఆర్పీ అనేది ఈరోజు ప్రతి వస్తువుకీ ఉంటుంది. ఎంఆర్పీ లేకుండా భారతదేశంలో ఏ వస్తువు అయినా అమ్ముతున్నామా..? దేనికైనా ఎంఆర్పీ అన్నది ఉండాలి, అలాంటిది సినిమా టికెట్లకు ఉండకూడదా..? ఇదెక్కడి న్యాయం…?
సినిమా పరిశ్రమకు సంబంధించో, లేదా ఎగ్జిబిటర్లకు సంబంధించో ఏదైనా సమస్య ఉంటే దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే, పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వం కూడా సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. సామాన్యుడికి సినిమా ఒక ఎంటర్ టైన్ మెంటు. అది అందుబాటులో ఉండేలా ఉండాలి కానీ, అందనిదిగా ఉండకూడదు. ఓ సినిమా హీరో మాట్లాడినట్టు అది ప్రేక్షకులను అవమానించే కార్యక్రమం కాదు.. ప్రేక్షకులకు మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చలన చిత్ర పరిశ్రమ ఎందుకు ఒత్తిడిలో ఉంటుంది. అంటే, సినిమావాళ్ళు చెప్పినట్టు, టికెట్ ధర రూ. 500 వసూలు చేస్తే, వారిపై ఒత్తిడి ఉండదా..? ఇంత ధర పెట్టి ప్రజలు సినిమాలు చూడలేరు. ప్రజలకు సినిమా ఒక ఎంటర్ టైన్ మెంటు, ఒక బలహీనత. అందుకే ప్రజలకు మేలు చేసే నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటే.. అది మీకు ఒత్తిడిలా కనిపిస్తుందా..? సినిమా థియేటర్ల యాజమాన్యాలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే.. న్యాయాన్యాయాలను పరిశీలించి వాటి గురించి ఏం చేయాలా అన్నది ప్రభుత్వం ఆలోచిస్తుంది.
రాష్ట్రంలో సినిమా థియేటర్లలో ఉన్న సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించి, ఆ సినిమా హాళ్ళకు టికెట్ ధరలను జిల్లా అధికారులు నిర్ణయిస్తారు. అలాకాకుండా, మీ ఇష్టం వచ్చినట్లు రెండు రెట్లు, మూడు రెట్లు అధికంగా టికెట్ ధరలు పెంచి, బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్ముకుంటామంటే కుదరదు. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.
సినిమా థియేటర్లపై దాడులు ఎందుకు చేస్తాం. వారు దోపిడీ చేస్తుంటే.. చూస్తూ ఊరుకోమంటారా..? ప్రభుత్వ విధాన నిర్ణయం ప్రకారం, ప్రజల మేలు కోరి, వారికి సౌలభ్యంగా ఉండే విధంగా టికెట్ ధరలు నిర్ణయించే విధానాన్ని తెచ్చింది. దాని ప్రకారమే ముందుకు వెళతాం. ఒకవైపు సినీ పరిశ్రమకు, సినీ కార్మికులకు ఇబ్బంది జరగకూడదు, మరోవైపు సినీ అభిమానులకు కూడా ఇబ్బంది కలగకూడదనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అశోక్ గజపతిరాజు చేసింది ముమ్మాటికీ తప్పే.. చంద్రబాబు మాటలను వెనక్కి తీసుకోవాలి
అశోక్ గజపతిరాజుపై ప్రభుత్వం టార్గెట్ చేస్తుందన్నది పూర్తిగా అవాస్తవం, అబద్ధం. ఆయన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం మాకేంటి..? రామతీర్థం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న శంఖుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మేము ఏమన్నా గోతిలో పడేయమని చెప్పామా.. శంఖుస్థాపన కార్యక్రమాన్ని, ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమం చేస్తున్న అధికారుల్ని అడ్డుకోమని మేం ఏమైనా చెప్పామా..? మంత్రుల్ని, ప్రజా ప్రతినిధుల్ని, అధికారుల్ని అవమానించమని, నోటికొచ్చినట్టు తిట్టమని మేం చెప్పామా..?
రామతీర్థంలో కొండపైన ఉన్న శ్రీరాములవారి ఆలయాన్ని రూ. 3 కోట్లతో అభివృద్ధి చేయడానికి జిల్లా ఇంఛార్జి మంత్రి వస్తే.. జిల్లాకు చెందిన మంత్రులుగా మేమంతా వెళితే.. అశోక్ గజపతిరాజు అక్కడ ఎలా ప్రవర్తించారు. ఆయన చేసింది ముమ్మాటికీ తప్పు. ఆలయ ధర్మకర్తగా, ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజుకు కూడా ఆలయ ప్రధాన అర్చకులు, ఈవో వెళ్ళి ముందుగానే ఆహ్వానం పలికారు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, గంట ముందో, అరగంట ముందో ఆహ్వానం పలికాం అన్నది శుద్ధ అబద్ధం. ఆయన్ను సగౌరవంగా ఆహ్వానించాం. ఆఖరికి ఆహ్వానించడానికి వెళ్ళి అధికారులపై కూడా ఆయన నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. ఒకవేళ ఆయన ఆ కార్యక్రమానికి రాను, శిలాఫలకం మీద నా పేరు వేయొద్దు అని అక్కడే చెప్పినట్లయితే బాగుండేది. అలా చెప్పకుండా, పేరు వేస్తే తప్పు, వేయకపోతే తప్పు అనేలా ఆయన అధికారులతో వ్యవహరించారు.
ఒకటికి పదిసార్లు చెబుతున్నాను… రామతీర్థం శిలాఫలకం మీద అశోక్ గజపతిరాజు పేరు వేయలేదేమో చెప్పమనండి. ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం ధర్మకర్త పేరు ఎక్కడ ఉండాలో అక్కడే ఆయన పేరు ఉంది. పేరు లేదనడం అవాస్తవం. ప్రభుత్వం ప్రొటోకాల్ ప్రకారం చేస్తున్న కార్యక్రమాన్ని ఆటంక పరిచి, మంత్రులు, అధికారులందర్నీ ఆయన దుర్భాషలాడారు. దీనికి పత్రికా సోదరులు అంతా సాక్ష్యులు. బోర్డులో పేరు లేదనడం కేవలం రాజకీయం చేయడమే.
అశోక్ గజపతిరాజును ఎవరు అవమానించారు. మా కంటే గంట ముందుగానే ఆయన అక్కడకు వెళ్ళి, శిలాఫలకాన్ని అక్కడ ఉన్న గుంటలో పడేయటానికి ప్రయత్నించారు. అది చూసి, మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, సర్పంచ్ లు అడ్డుకున్నారు. అడ్డుకుంటే ఆయనే వారిని నెట్టిపడేశారు. ఆ తర్వాత దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడకు వెళితే.. ఆయన మీద కూడా అశోక్ గజపతిరాజు దుర్భాషలాడారు. ఆయనకు నేను.. నాకు ఆయన అసలు ఎదురుపడలేదు. నిన్న జరిగింది ఇదీ. దేవుడి కార్యక్రమాన్ని సర్కస్ కంపెనీ అని మాట్లాడింది ఆయన కాదా.. ఇందుకు మీడియా వాళ్ళే సాక్ష్యం. ఏదోరకంగా గిల్లికజ్జాలు పెట్టుకుని, అల్లరి చేయాలని చూసింది అశోక్ గజపతిరాజే. ఆయన చేష్టలు చిన్న పిల్లల చేష్టల్లా ఉన్నాయి. ఆయన ఎక్కడా హూందాగా ప్రవర్తించేలా లేదు.
చంద్రబాబు పెద్ద పుడింగిలా మంత్రులు జులుం చేశారని, అవమానించారని మాట్లాడుతున్నాడు. అశోక్ గజపతిరాజు అక్కడకు వచ్చినప్పుడు అసలు మంత్రులు అక్కడ ఉన్నారా… అది చంద్రబాబు తెలుసుకోవాలి కదా..! మంత్రులు దాడి చేశారని చంద్రబాబు మాట్లాడటం శోచనీయం. మాట్లాడే ముందు, అక్కడ జరిగిన పూర్వాపరాలు ఏమిటో తెలుసుకుని మాట్లాడాలి. బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న వ్యక్తులు బాధ్యతారహితంగా మాట్లాడటం సమంజసం కాదు.
చంద్రబాబు తన మాటలను వెనక్కి తీసుకోవాలి. మీ మనుషులే పెద్దవాళ్ళు అనుకోవడం పొరపాటు. బండ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి అని గుర్తుంచుకోండి. చంద్రబాబు మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మంత్రులు జులం చేశారని, దాడి చేశారని మాట్లాడటం శోచనీయం.
నిన్న అశోక్ గజపతిరాజు బాధ్యత లేకుండా, చాలా అసభ్యంగా ప్రవర్తించారు. నా 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలా చూడలేదు. ఆయన చేసింది చాలా తప్పు. అది ఆక్షేపణీయం. దేవుని కార్యక్రమంలో ఇటువంటివి మర్యాద లేని పనులు చేయడం మంచిది కాదు.
శిలాఫలకం గురించి పదే పదే మాట్లాడుతున్నవారు.. మిగతా దేవాలయాల్లో, సింహాచలంగానీ, అమ్మవారి దేవస్థానంగానీ, తిరుపతి దేవస్థానంగానీ.. అక్కడకు వెళ్ళి ఒక్కసారి గతంలో ఉన్న శిలాఫలకాలు చూడండి. గతంలో చంద్రబాబు నాయుడు కూడా అధికారంలో ఉన్నారు కదా.. ఆయన హయాంలో ధర్మకర్తలకు ప్రొటోకాల్ లో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. చంద్రబాబు మాటలు చూసి ప్రజలు నవ్విపోతారు అని కూడా లేకుండా మాట్లాడుతున్నారు.
రాజరిక కుటుంబం, తాము పెద్దవాళ్ళం అనుకున్నప్పుడు అంతే హూందాగా ఉండాలి. ఇదేనా రాజుల పెంపకం, ఇదేనా రాజరికపు సంప్రదాయం. ఇదేనా సభ్యత, సంస్కారం అని నేను మాట్లాడాను. నేను మాట్లాడిన మాటలను ఎక్కడా వెనక్కి తీసుకోవడం లేదు. రాజరికంలో ఉన్న కుటుంబం ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. నా ఇష్టప్రకారం ఉంటానంటే ఎలా.. చట్టం ఒప్పుకుంటుందా..?
అధికారంలో ఉన్నాం.. మంత్రులుగా పని చేశాం అంటే ఎలా కుదురుతుంది, చట్టాలు మీకు సపరేటుగా ఉంటాయా…? పదవులు చేయడం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంటుంది. నేనూ పదేళ్ళు మంత్రిగా పని చేశాను. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఉండే హక్కులు వారికి ఉంటాయి. అలాఅని అహంభావపూరితంగా వ్యవహరిస్తే.. ప్రభుత్వ నిబంధనలు చూస్తూ ఊరుకోవు.
ఈ సీజన్ లో ప్రతి గింజా, ప్రతి కేజీ ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ బీకే ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. మిల్లర్లకు కూడా ఖరాఖండిగా చెప్పాం. ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయానికి అనుగుణంగా అందరూ పనిచేయాలి. ఏ రైతు కూడా ధాన్యం అమ్ముకోవాలని వస్తే.. కొనాల్సిందే, తీసుకోం అనే పరిస్థితే ఉత్పన్నం కాకూడదు. రైతుకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రైతులకు మద్దతు ధర ఇవ్వాల్సిందే.