– నద్దాజీనా? మజాకానా
– ససేమిరా అని, తర్వాత సరేనన్న కేసీఆర్ సర్కార్
– పంతం నెగ్గించుకున్న కమలదళపతి నద్దా
– మరి కాంగ్రెస్‌కూ అవే నిబంధనలు వర్తించవా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు నటించిన ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా చూశారా? అందులో ఆయన, ముందు భార్య చెప్పినదేమీ ఒప్పుకోడు. కానీ వెంటనే మళ్లీ ‘అయితే ఓకే’ అంటుంటాడు. సీన్ కట్ చేస్తే.. తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ పొలిటికల్ సినిమా ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’లో కూడా సేమ్ టు సేమ్ సీన్లు రిపీటయ్యాయి. ఈ సన్నివేశంలో లక్ష్మణరావు పాత్రను కేసీఆర్ సర్కారు పోషించగా, ఆయన భార్య పాత్రను బీజేపీ జాతీయ దళపతి నద్దా పోషించారు.
అదెలాగంటే … కరీంనగర్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపించారు. కారణం ఆయన కోవిడ్ నిబంధనలు అతిక్రమించి సొంత క్యాంపు ఆఫీసులోనే ఆందోళనకు ఉపక్రమించడమే. దానితో పోలీసులు సంజయ్ క్యాంపు ఆఫీసుపై మెరుపుదాడి చేసి, కార్యకర్తలను లాఠీలకు పనిచెప్పి చెల్లాచెదురు చేసి, సంజయన్నను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు అగ్గిరాముళ్లయి, కరీంనగర్ బాట పట్టారు. అయితే వారినెవరినీ అక్కడకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. సరే.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లాంటి కొద్దిమంది జైలుకు వెళ్లి సంజయన్నకు మై హూనా’, ‘హమ్ సబ్ ఏక్‌హై’, ’జై జై మాతా భారత్‌మాతా’అని నినదించి ధెర్యం చెప్పారనుకోండి. అది వేరే విషయం.
అటు మంగళవారం పార్టీపరంగా నిరసన ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ నిర్ణయించింది. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ వరకూ ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చింది. సంజయన్న అక్రమ అరెస్టు యవ్వారం తెలుసుకున్న ఆలిండియా కమలదళపతి నద్దా ఈ విషయం తెలిసి యమా సీరియసయ్యారు. కేసీఆర్ సర్కారు సంగతేందో చూద్దామనుకుని హైదరాబాద్ బయల్దేరారు. కానీ తెలంగాణ సర్కారు మాత్రం, నద్దా పర్యటనకు అనుమతి లేదని అంతే సీరియస్‌గా కొండవలస లక్ష్మణరావు మాదిరిగానే చెప్పేసింది. అయినా సరే శంషాబాద్‌లో వచ్చిన నద్దాజీని ఓ పోలీసు ఆఫీసర్ కలసి, మీరు పాల్గొనబోయే ర్యాలీకి అనుమతి లేదని, కరోనా నిబంధనలున్నాయంటూ కరోనా జీఓ అందించి.. సినిమాలో కొండవలస లక్ష్మణరావు మాదిరిగానే.. ‘నేనొప్పుకోను’ అన్నారు.
అయితే ‘నా ప్రజాస్వామ్య హక్కును ఎవరూ కాలరాయలేర’ని నద్దాజీ స్పష్టం చేశారు. దానితో ‘అయితే ఓకే’ అని సర్కారు కూడా వెనక్కితగ్గి.. ర్యాలీలో పాల్గొనకుండా, గాంధీ విగ్రహానికి దండమాత్రం వేసి వెళ్లాలని
షరతు పెట్టారు. అందుకు.. ‘ఓకే దాన్దేముంది. అలాగే చేద్దాం’ అని నేరుగా సికింద్రాబాద్ ఎంజీరోడ్డులోని గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి, అక్కడ నుంచి పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్ నిర్వహించారు. అయితే.. అటు సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద మాత్రం కమలదళాలు ‘కోవిడ్ నిబంధనలు అనుసరించి’ పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు.
కమల దళపతి నద్దాజీ విషయంలో సడలించిన ఆంక్షలు, తెలంగాణ కాంగ్రెస్ దళపతి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతల విషయంలో ఎందుకు అమలుకావన్నది కాంగీయుల ప్రశ్న. తెలంగాణలో కాంగ్రెస్ నిర్వహించే ఏ ఆందోళన కార్యక్రమాన్నయినా అడ్డుకుని, ఆరోజు రేవంత్‌రెడ్డి ఇంటి కెళ్లి ఆయనను గృహనిర్బంధం చేసే పోలీసులు.. కమలదళాలను మాత్రం ఎలా కరుణించారన్నది కాంగీయుల ప్రశ్న. రేవంత్రెడ్డంటే తెలంగాణకు మాత్రమే పార్టీ అధ్యక్షుడు. అందులోనూ ప్రతిపక్షపార్టీకి చెందిన వాడాయె. మరి నద్దాజీ అంటే దేశాన్నేలే పార్టీకి సదర్సాబ్. తేడా లేదూ?!