– జగన్ సంక్షేమ కార్యక్రమాలపై నారావారిపల్లెలోనే చర్చిద్దాం రండి బాబూ..?
– బాబు హయాంలో చేసిన అప్పులకు ఇప్పుడు ప్రతి నెలా రూ. 3 వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నాం
– బాబు హయాంలో 39 లక్షల పెన్షన్లు ఇస్తే.. మా హయాంలో 61 లక్షలు ఇస్తున్నాం
– ధైర్యం ఉంటే.. వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీచేస్తానని చంద్రబాబు ప్రకటించగలడా?
– ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి
శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
చంద్రబాబు నాయుడు తన సహజ శైలిలో మీడియాతో మాట్లాడటం చూశాం. దేశంలోనే నా అంత అనుభవం ఉన్న నాయకుడు లేడనే వ్యక్తి.. ప్రెస్‌మీట్ పెట్టేటప్పుడు ఏదైనా మెసేజ్ ఇవ్వడం సాధారణంగా జరుగుతుంది. కానీ పచ్చ మీడియా రోజూ ఎలా జగన్‌గారి ఇమేజ్ తగ్గించాలని చూస్తుందో.. దానికి అదనంగా చంద్రబాబు నేనున్నానంటూ బురద చల్లే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కూడా మాట్లాడారు. బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా అని మాట్లాడారు. మేము కూడా అలా మాట్లాడవచ్చు. కానీ మాకు సంస్కారం అనేది ఉంది. గౌరవ ముఖ్యమంత్రిగారు ఎప్పుడు కూడా ఇటువంటి మాటలు మాట్లాడేవారిని లెక్కలోకి తీసుకోరు. ఢిల్లీ పర్యటన విజయవంతం అవుతుందని, ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు, నిధులు గురించి చర్చించడం చూసి ఓర్వలేక చంద్రబాబు ఏదోదో మాట్లాడేశారు.
చంద్రబాబు చెప్పినట్లు అమరావతి అనేది లేదు. కేవలం అది భ్రమరావతి మాత్రమే. గ్రాఫిక్స్ లో చూపించినట్టు అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జ్‌లు లేవు, కనీసం డ్రైనేజ్, తాగునీరు సదుపాయాలు లేవు, ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఇస్తామన్న క్వార్టర్స్‌కు అతిగతీ లేదు.పదివేల కోట్లు ఖర్చు పెట్టామని చంద్రబాబు చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ప్రెస్‌మీట్‌లో చాలెంజ్‌లు చేస్తూ ఏవో మాట్లాడారు? ఒక్క బిల్డింగ్ కాలేదు. రూ.10వేల కోట్లు తో ఒక్కటీ పూర్తి కాలేదు. ఏ ఒక్కటీ పూర్తి చేయకపోగా మాయమాటలు చెబుతున్నారు. కనీసం సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయాడు.ఆఖరికి, ఆయన ఉండే అక్రమ నిర్మాణంలో ఇంటి డ్రైనేజ్ నీరు బయటకు పోకుండా కృష్ణానదిలోకి పోయేలా నాలా ఉంది.
పదివేల కోట్లను వృధా చేసిన మీరు .. అక్కడ కనీసం టీ హోటల్ కూడా ఏర్పడలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే ఎస్టాబ్లిష్ అయిన సిటీలో అయిదువేల కోట్లు పెట్టిఉంటే బ్రహ్మాండమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో .. హైదరాబాద్‌కు దీటుగా విశాఖపట్నం ఈపాటికి తయారైపోయి ఉండేది.మిగతా అయిదు వేల కోట్లలో…
రెండు, మూడు వేల కోట్లతో లెజిల్లేచర్ కేపిటిల్ అనుకున్న ప్రాంతంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ చక్కగా నిర్మించవచ్చు. మిగిలిన డబ్బుతో హైకోర్టు సహా, అన్నింటిని పూర్తి చేసి ఉండవచ్చు. దాదాపుగా 90శాతంతో మూడు రాజధానులను పూర్తి చేసే అవకాశాన్ని చేజార్చి, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసి, మళ్లీ రాష్ట్రానికి రాజధాని లేదంటూ మా మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఆ పరిస్థితిని తీసుకువచ్చింది మీరే. రాజధాని పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన మీకు… మా ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత, హక్కు లేదు.
అభివృద్ధి చేసినవారిని మేము ఎక్కడా కించపరచం, గౌరవిస్తాం. కానీ కార్పొరేట్ పొలిటీషియన్‌గా మీరు వ్యవహరిస్తున్నారు. న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో వందలకోట్లు చందాలు పోగేశారు. మాట్లాడితే త్యాగధనులు అంటున్నారే…అమరావతి రైతు అయినా, శ్రీశైలం దగ్గర ఉన్న రైతు అయినా రైతే. ఎవరైనా రైతును గౌరవించాల్సిందే. రోడ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం వేలవేల ఎకరాలు ఇచ్చిన రైతులు త్యాగధనులు కారా? వాళ్లు రైతులు కారా అని అడుగుతున్నాం.
కేవలం మీకు కావాల్సిన వ్యక్తులు, మీ బినామీలు మాత్రమే రైతులా? పాదయాత్ర సందర్భంగా పదికోట్లు, ఇరవైకోట్లు చందాలు ఎక్కడ నుంచి వచ్చాయని అడుతున్నాం. కార్పొరేట్ పాలిటిక్స్ ద్వారా తప్పు చేశామని మీరు సిగ్గుపడకుండా ఎదురుదాడి విధానానికి పోతున్నారు.
పాడుపడిన వెంచర్ అనుకునే.. మీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ … శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో పశువులను తెచ్చి కట్టేశారు. ఆయనకు తెలిసే ఆ పని చేసి ఉంటారేమో. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాల్సిన మీరు ఎందుకు ఇంత ప్రజా ధనాన్ని వృధా చేశారని అడుగుతున్నాం. మీ అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారు. విజన్ ఉన్న నాయకుడిని అని చెప్పుకునే మీరు .. ఆ విజన్ ఎక్కడుందో చెప్పాలి?
రాయలసీమలో వెనుకబాటు తనం కనపడలేదా? ఉత్తరాంధ్రలలో వెనుకబాటుతనం కనిపించదా? సీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఏం పాపం చేశారని అడుగుతున్నాం. ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆ ప్రాంత ప్రజల మనోభావాలు గౌరవించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలను సమాన అభివృద్ధి చేస్తామంటుంటే ఎందుకంత కరుడుగట్టిన వ్యతిరేకతతో మాట్లాడుతున్నారు.
– మూడు రాజధానులకు మీ మనసు ఎందుకు అంగీకరించడం లేదు? న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో తిరుపతిలో జరిగిన సభలో అమరావతికి అందరూ మద్దతు తెలిపారంటూ ఎలా చెప్పారు? మీ బాధ ఏంటి చంద్రబాబు ? విశాఖ ఎందుకు అభివృద్ధి కాకుడదు.
అభివృద్ధి పేరుతో ఏమీ లేనిదానికి ఖర్చుపెట్టిన రూ.10వేల కోట్లు కృష్ణానదిలో పడేసినట్లు చేశారే తప్ప, దానిలో సగం డబ్బుతో ఒక నగరాన్ని ఎంత అభివృద్ధి చేసి ఉండవచ్చు, సంపదను సృష్టించవచ్చు కూడా. కానీ మీ అయిదేళ్ల పాలనలో ఎందులో సక్సెస్ అయ్యారు? ఎందులో రాష్ట్రానికి మేలు చేశారో చెప్పాలి? మీకున్న వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ ఇతరులపై బురద చల్లడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు.
అమరావతి, పోలవరం, పరిశ్రమల గురించి మీరు మాట్లాడారు కాబట్టే ఈవన్నీ చెప్పాల్సి వస్తోంది. వీటిపై ఎక్కడైనా చర్చకు మేము సిద్ధమని చెబుతున్నాం. ఏ అంశం పైనా అయినా మాట్లాడేందుకు మేము రెడీగానే ఉన్నాం.
పరిశ్రమల విషయానికి వస్తే మీ హయాంలో రూ.16లక్షల కోట్ల ఎంవోయూలు చేశామని చెబుతున్నారే… మీరు చేసిన ఎంవోయులు ఏంటిని అడుగుతున్నాం. విశాఖలో సమ్మిట్ పేరుతో దాదాపుగా వందకోట్లు బిల్లులు చేసి, ఈవెంట్ మేనేజ్‌మెంట్ తరహాలో చేశారు. పెట్టుబడులు పెడుతున్నారంటూ ఫోటోలు దిగి ప్రజలను తప్పదోవ పట్టించినందుకా మిమ్మల్ని క్షమించాలి? అదేనా మీ విజన్?
రాష్ట్ర విభజన జరిగాక మీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు వచ్చింది కేవలం రూ.20వేల కోట్లు మాత్రమే. కరోనా లాంటి మహమ్మారి వేధిస్తున్నా కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రూ.40వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఈ పరిశ్రమలకు సంబంధించిన వివరాలు కావాలంటే లిస్ట్ పంపిస్తాం, పరిశీలించుకోండి. శ్రీసిటీ, కడపలో మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్ లు మీకళ్లకు కనిపించడం లేదా? లేకుంటే కళ్లకు గంతలు కట్టుకున్నారా? రాష్ట్రంలో పరిశ్రమలు లేవంటూ అసత్య ప్రచారాలు చేయడమే మీ పనా? క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాస్తవాలు అర్థం అవుతాయి.
పెట్టుబడుల పేరుతో సమావేశాలు పెట్టి వందలకోట్లు దోచుకున్న నీచస్థితికి మీరు ఆరోజు దిగజరారు. ఆర్భాటాలు, ప్రచారాలు లేకుండా మీకులాగా డప్పు కొట్టుకోకుండా మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. మీకులా డ్రామా చేయడం చేతకాదు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కాంట్రాక్టుల పేరుతో ఏరకంగా అవినీతి చేశారో అందరికి తెలిసిన విషయమే.
రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేదని మాట్లాడే మీరు… గతంలో మీ హయాంలో ఎంత ప్రోగ్రెస్ ఉంది, ఇప్పుడు మా హయాంలో ఎంత ప్రొగ్రెస్ ఉందో ఒకసారి వెళ్లి చూస్తే మీకు తెలుస్తుంది.
మీ డబ్బుల కక్కుర్తి వల్లే పోలవరం డయాఫ్రామ్ వాల్ కుంగిపోయింది. దాన్ని రీడిజైన్ చేయడం, అక్కడ పరిస్థితుల్ని చక్కదిద్దుకోవడంతో పాటు, మార్పు చేసిన డిజైన్లకు త్వరలో సీడబ్ల్యూసీ అనుమతి రాబోతున్న నేపథ్యంలో కొద్దిగా ఆలస‍్యం అయ్యివుండచ్చు. అది కూడా మీరు చేసిన తప్పిదాల వల్లే. ఏడేనిమిదివేల కోట్లు వ్యయం పెరిగిందని చెబుతున్న మీకు… మా ప్రభుత్వం ప్రతి విషయంలోనూ జవాబుదారీతనంగా ఉంటుందని తెలుసు. అయినా మీరు వృధాగా ప్రెస్‌మీట్లు పెట్టి నిందించడం సరికాదు.
మీ హయాంలో ఏం చేశారో… మేము ఏం చేశామో ప్రాజెక్ట్ గురించి తేల్చుకునేందుకు పోలవరం వెళదాం…
అమరావతిని మీరే నాశనం చేశారు. ముందస్తు వ్యూహంతో, ఖర్చుపెట్టిన డబ్బుతో మహా నగరాన్నే ఎంత బాగా తీర్చిదిద్దవచ్చు. మీ స్వార్థం కోసం, మీ అనుచరులు, బినామీల కోసం రాష్ట్రాన్ని నాశనం చేసి, ఇవాళ ఏదో జరిగిపోయిందంటూ మాపైన ఎదురు దాడి చేస్తున్నారు. ఎదురుదాడి చేస్తున్నది మీరా? మేమా? మీరు మాట్లాడిన ప్రతి అంశంపై మేము సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ఉండాలంటే.. నేను ఫలానా అభివృద్ధి-సంక్షేమం చేశాను అని చెప్పుకునేలా ఉండాలే కానీ, చేయాలనుకున్నాను, కలగన్నాను, భ్రమింపచేశాను.. అనేలా మాటలు మాట్లాడటం కాదు. మీ గత చరిత్ర చూస్తే హైదరాబాద్‌ను మీరే నిర్మించామని చెబుతున్నారు.
ఐటీ అభివృద్ధి విషయానికి వస్తే.. మీ హయాంలో, ఐటీ బూమ్ లో.. మీరు కాకుండా మీ బామ్మర్ది బాలకృష్ణ సీఎంగా ఉన్నా అదే జరిగేది. ఆ సమయంలో ఐటీ బూమ్ కారణంగా అనేక నగరాలు అభివృద్ధి చెందాయి. బెంగళూరు అంతకన్నా ఎక్కువగానే అభివృద్ధి చెందింది. మరి ఎస్‌ఎం కృష్ణ తానే అన్ని చేశానని చెప్పుకోలేదే? దానికి మీరేదో సక్సెస్‌ఫుల్ మేన్‌గా క్రియేట్ చేసుకుంటున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరించి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చింది మీరు కాదా?
అయిదేళ్లు మీ పాలనలో అమరావతి కి రూ.10వేల కోట్లు ఏం చేశారు? సంపదను కొల్లగొట్టింది చంద్రబాబే. ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలు ఆడుతూ వైయస్సార్ సీపీపై విమర్శలు చేస్తున్నారు. ఇక రెవెన్యూ లోటు గురించి చెప్పే మీరు… మీ హయాంలో చేసిన అప్పులకు ఈరోజుకూ మా ప్రభుత్వం ప్రతినెలా రూ.3వేల కోట్లు వడ్డీ చెల్లిస్తోంది.
-సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఆయనను చూసి మేము అమలు చేస్తున్నామని చెబుతున్నారు. ఎన్నికలు వచ్చే ముందు ప్రజలను ఆకట్టుకోవడానికి పథకాల పేరుతో మాయ చేసింది మీరు.
మా ముఖ్యమంత్రి చెప్పినట్లుగానే 2019 జనవరి వరకూ మీ హయాంలో ఇచ్చింది కేవలం 39లక్షల పెన్షన్లు మాత్రమే. అందుకు ఖర్చుపెట్టింది రూ.400కోట్లు మాత్రమే. అదే మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పెన్షన్లకు ఖర్చుపెట్టేది నెలకు రూ.1500 కోట్లు. 61లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం.
ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడుతున్నారే? పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు ఎవరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దా? మరి మీ మనవడు ఏ మీడియంలో చదువుతున్నాడు? అమెరికాలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా? అక్కడ అందరికీ ఉద్యోగాలు ఉన్నాయా? అని చంద్రబాబు మాట్లాడుతున్న లాజిక్ వెనుక అర్థమేంటో ఆయనే చెప్పాలి. అమెరికా తలసరి ఆదాయం, మన దేశ తలసరి ఆదాయం గురించి చెప్పగలుగుతారా? ఇంగ్లీష్ మీడియం గురించి మీ బాధ, కడుపుమంట ఎందుకో చెప్పాలి.
14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మీరు ప్రజల్లో ఇది చేశాను అని గుర్తింపు పొందారా? బ్రాండ్ ఇమేజ్‌కి వస్తే ఎన్టీఆర్ గురించి మాట్లాడితే రూ.2 కిలో బియ్యం, మద్యపాన నిషేధం, మండల వ్యవస్థ అని చెప్పవచ్చు. రాజశేఖర్ రెడ్డి పేరుతో చెప్పాలంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం గురించి చెప్పుకోవచ్చు. ఇక వైఎస్ జగన్ పాలనలో అమ్మ ఒడి, చేయుత, పెన్షన్లు, ఆసరా, నాడు-నేడు కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. మరి మీ 14ఏళ్ల పాలనలో మీ బ్రాండ్ అంటూ ఒకటి అయినా ఉందా అని అడుగుతున్నాం? ఇది చేశామని ఒక్కటి కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్న మీది ఒక పార్టీ, మీరు ఒక నాయకుడు.
నవరత్నాల మీద విమర్శలు చేస్తున్నారే.. మా ప్రభుత్వం 31 నెలల్లో డీబీటీ ద్వారా ప్రజలకు ఇచ్చింది రూ. లక్షా ఇరవైవేల కోట్లు. దాదాపు రూ.50వేల కోట్లు నాన్ డీబీటీ ద్వారా ప్రజలు లబ్ధి పొందారు. ప్రభుత్వం దేనికి ఖర్చు పెడుతుందనేది లెక్కలతో సహా చూపించగలుగుతాం. అదే మీరు మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారంటే సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు.
ఈ రెండున్నరేళ్లలో నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ఎంత డబ్బు ప్రజలకు చేరాయో.. మీ సొంతూరు నారావారిపల్లెలోనే తేల్చుకుందాం. వాటివల్ల ప్రజలకు ఉపయోగపడిందా లేదా అని మాట్లాడదాం…చర్చిద్దాం. మార్పు అనేది ప్రజల జీవన విధానంలో రావాలి. రోడ్లు బాగోలేకపోవచ్చు. రహదారులు కూడా ముఖ్యమే. వాటిని త్వరలోనే వేస్తాం. దానికన్నా పేదవాడి ప్రాణాలు ముఖ్యం కాదా?
జగనన్న ఇస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా మా జీవనశైలి మెరుగుపడిందని లక్షల మంది అక్కచెల్లెమ్మలు చెప్పడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. తాము కూడా నెలకు ఎంతోకొంత సంపాదించుకుంటున్నామని మహిళలు ధైర్యంగా చెప్పడం అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం. ప్రజలు ఆర్థికంగా స్వశక్తితో ఎదిగే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అది మీకు కనిపించడం లేదా చంద్రబాబు?
ప్రభుత్వంపై అవగాహన లేకుండా మాట్లాడటంతో పాటు, మీ నాయకులతో నోటికొచ్చినట్లు మాట్లాడిస్తున్నారు. జగన్ గారు రాజకీయంగా ఎదుగుతున్నారనే బాధ, ఈర్ష్యతో మీరు ద్వేషం పెంచుకున్నారు. సీఎంగా పనిచేసిన మీరు అక్రమ కట్టడాలు కూల్చివేశారంటూ మాట్లాడుతున్నారే.
… బాధ్యతగా వ‍్యవహరించాల్సిన మీరే ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు.
ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారే… హోదాను మీ ప్యాకేజీ కోసం చంపేసి… అర్థరాత్రి 12 గంటలకు రాష్ట్ర భవిష్యత్‌ను నాశనం చేసిన మీరు మాపై ఎదురుదాడి చేస్తారా? ఎన్నికల ఫలితాలు వెలువడ్డ సమయంలోనే.. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మన మద్దతు కావాల్సి వస్తే హోదాపై నిలదీసి ఉండేవాళ్లమని జగన్ ఢిల్లీ నడివీధుల్లో చేసిన వ్యాఖ్యలు అక్కడ పెద్దలనే షేక్ చేశాయి. మా ముఖ్యమంత్రి భయపడే వ్యక్తి కాదు. మీ మాదిరిగా రెండు నాల్కలు ధోరణి ఉన్నవారు కాదు.
దొంగలా దొరికి ‘వాట్ ఐయామ్ సేయింగ్’ అంటూ వచ్చిరాని ఇంగ్లీష్‌లో ఏదోదో మాట్లాడి అర్థరాత్రి ఇక్కడకు పారిపోయి వచ్చారు.
తాజాగా ‘హిందుస్థాన్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్లీ ఇప్పుడూ అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు మీకు రెండు నాల్కలు కాదు, లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. మీకు ధైర్యం ఉంటే బీజేపీ, కాంగ్రెస్, జనసేన, ఎవరితో పొత్తు అవసరం లేదు, సింగిల్‌గా పోటీ చేస్తానని చెప్పగలరా?
రాజకీయ నాయకుడివి అయితే, పొత్తులు లేకుండా ప్రజల్లోకి వెళతాను అని చెప్పగలరా? మీ పైన మీకే నమ్మకంలేదు. ఇక మీరు ఏమి పార్టీ నడుపుతారు.
జగన్ కి తన పాలన పై తనకు నమ్మకం ఉంది. ఆయనకు మంచిపేరు వస్తుందనే మీరంతా కుట్రలతో ఇలాంటి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. వ్యవసాయ, విద్యుత్, ధాన్యం, విత్తనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మీ హయాంలో అలాగే పెట్టేశారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన దాదాపు రూ.80వేల కోట్లు పెండింగ్‌లో పెడితే అవి మేము తీర్చుతున్నాం.
మా ప్రభుత్వానికి ఏ పార్టీ నాయకుడి విగ్రహాలపై ద్వేషం ఉండదు. అలా చేసింది మీరే.. విగ్రహాలే కాదు…దేవుడి గర్భగుడిలో విగ్రహాలను కూడా కూల్చేసిన వ్యక్తి మీరు. ఓ తాగుబోతు వ్యక్తి చేసిన పనికి… వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. డీజీపీ, పోలీస్ వ్యవస్థపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తప్పు చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటే అది మీకు తప్పా? మీ పాలనలో రాజకీయ పార్టీ కోసం అధికారులు పనిచేసేలా దిగజార్చావు. ఐపీఎస్, ఐఏఎస్‌లను దిగజార్చింది మీరు. మా పార్టీ వాళ్లు తప్పుచేస్తే వదిలేయాలంటూ నిసిగ్గుగా మాట్లాడిన మీరు వ్యవస్థల గురించి మాట్లాడతావరా?
కులాలు, మతాలను విడదీసే ప్రయత్నం చేస్తుంది ఎవరు? ఇప్పటికైనా చంద్రబాబు సంస్కారంగా వ్యవహరిస్తే బాగుంటుంది. కాని, రెచ్చగొట్టేవిధంగా ఈ రాష్ట్రంలో మీ స్థాయి నుంచి, కిందస్థాయి వరకూ మనుషుల మధ్య విభజన సృష్టించే ప్రయత్నం మంచి పద్ధతి కాదు. మనుషులను గౌరవించాలే గానీ, ద్వేషించకూడదు. ప్రభుత్వం పేదవారి మీదే కాదు, ఏ వర్గంపైనా కక్షకట్టదు. మీరేమీ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దు. వ్యవస్థలను మీరు నాశనం చేస్తే వాటిని జగన్ మోహన్ రెడ్డి సరిదిద్దుతున్నారు. ముఖ్యమంత్రి ఒక బాధ్యతగా ఏదైనా చేస్తే మీ కార్పొరేట్ శక్తులన్నీ దాడి చేస్తాయి. అది విద్య, అయినా సినిమా టికెట్లు అయినా సరే. వ్యవస్థలను మార్చాలనే జగన్‌గారు ప్రయత్నిస్తున్నారు. ఒక వర్గంపై కక్ష పెట్టుకునే వ్యక్తి కాదు. సామాన్యులకు వినోదాన్ని అందుబాటులో ఉంచాలని అంటే కార్పొరేట్ శక్తులతో దాడి చేయించడమా?
జగన్ మోహన్ రెడ్డి పేదల మనసులు గెలిచిన వ్యక్తి. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిపైన ఆయనకు అవగాహన ఉంది. ఇప్పటివరకూ జరిగిన మా పాలనపై సవాల్ అన్నారు అందుకు మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. అది ఏప్రాంతం అయినా సరే. ఇప్పటికైనా ఎదురుదాడి ప్రయత్నాలు మానుకుని, ప్రభుత్వానికి సలహాలు ఇస్తే ప్రతిపక్ష నాయకుడిగా అయినా మీకు గౌరవం ఉంటుంది.