Suryaa.co.in

Andhra Pradesh

37 బల్క్ మిల్క్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, జనవరి 5: కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో 37 బల్క్ మిల్క్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ గోర్జి సూర్యనారాయణ కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్ఛాన్ని అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న పలు కార్యక్రమాలపై డ్వామా పీడీ గోర్జి సూర్యనారాయణతో సమీక్షించారు.

ఈ సందర్భంగా గోర్జి సూర్యనారాయణ మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గానికి 38 సచివాలయాలు, 38 రైతుభరోసా కేంద్రాలు, 27 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, 37 బల్క్ మిల్క్ యూనిట్లు మంజూరయ్యాయని, వీటి నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కు సంబంధించి 55 యూనిట్ల బ్రాండింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. 62 కిలోమీటర్ల మేర మొక్కలు నాటడం జరిగిందన్నారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. దీనిలో భాగంగానే కృష్ణాజిల్లాలోని 264 గ్రామాల్లో ఏపీ పాల వెల్లువ ద్వారా పాల సేకరణ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కృష్ణాజిల్లాలో 51 కేంద్రాల్లో పాల సేకరణ ప్రారంభమైందని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు మెండా చంద్రపాల్, మొండ్రు వెంకటేశ్వరరావు, యార్లగడ్డ బసవయ్య, మాదాసు వెంకట లక్ష్మీకుమారి, అల్లం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE