– ఈనెల 28వతేదీన పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష
– తెలుగు మహిళ అధ్యక్షురాలు
మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం, మద్యపాన నిషేదంపై మాట తప్పడం, డ్వాక్రా సంఘాల నిర్వీర్యం, నిత్యావసర ధరల పెరుగుదల వంటి అంశాలను నిరసిస్తూ తెలుగు మహిళ ఆధ్వర్యంలో నారీ సంకల్పదీక్ష (మహిళాద్రోహి జగన్ రెడ్డి పాలనకు చరమగీతం) పేరుతో 28.01.2022వ తేదీ శుక్రవారం రోజున మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమానికి 13 జిల్లాల నుంచి తెలుగు మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాల కారణంగా సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబమైన తెలుగునేల మౌనంగా రోధిస్తోంది. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇటు మహిళలను కించపరుస్తూ, అటు సభ్యసంస్కారాలను మరిచి క్యాసీనోలు నిర్వహించడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి పుణ్యమా అని రాష్ట్రాన్ని క్యాసీనోలు, పబ్ లు, జూదాలకు వేదిక స్థాయికి దిగజార్చారు. ప్రతి ఒక్క మహిళ సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి కల్పించారు. జగన్మోహన్ రెడ్డి అసమర్థత కారణంగా రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయి.
ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందనే ధైర్యం లేదు. మోసకారి సంక్షేమంతో మహిళ ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేశారు. మహిళలు తమ కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో వారి ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు గారు డ్వాక్రా సంఘాలకు శ్రీకారం చుడితే జగన్ రెడ్డీ వాటినీ కూకటివేళ్లతో పెకలించేశాడు. పెరిగిన మద్యం రేట్లు, గంజాయి, హెరాయిన్ వల్ల గృహహింస పెరిగింది. మద్య నిషేదం చేస్తానని హామీ ఇచ్చి మహిళలతో ఓట్లేయించుకుని నేడు నాశిరకం మద్యాన్ని ఏరులై పారిస్తూ మహిళల తాళిబొట్లు తెంచుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసి సామాన్యులు బతకలేని పరిస్థితులు తీసుకొచ్చారు.
మహిళల ఆత్మగౌరవానికి అడుగడుగునా భంగం కలిగిస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలనకు నిరసిస్తూ తెలుగు మహిళ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షను జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళపై ఉంది. పేరుపేరునా అందరూ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము.