Suryaa.co.in

National

ఆరెస్సెస్ ఆఫీసుపై డ్రోన్లు నిషేధం

– ఉగ్రవాదుల రెక్కీ ఫలితమేనా?

నాగ్‌పూర్ నగరంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం, ఇతర ముఖ్యమైన కార్యాలయాలపై డ్రోన్‌లు ఎగురవేయడంపై నిషేధం విధించారు. ఈ మేరకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 144 ప్రకారం నాగపూర్ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అశ్వతీ దోర్జే ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నిషేధాన్ని మంగళవారం మార్చి 31 వరకు పొడిగించినట్లు అధికారి తెలిపారు. నాగ్‌పూర్‌లోని మహల్ ప్రాంతంలో సంఘ్ బిల్డింగ్ రోడ్‌లో ఉన్న డాక్టర్ హెడ్గేవార్ భవన్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై డ్రోన్‌లు, రిమోట్ కంట్రోల్డ్, ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్‌లు, పారా-గ్లైడర్‌లు, ఏరో మోడల్‌లు, పారాచూట్ సంబంధిత కార్యకలాపాలు 3 కిలోమీటర్ల పరిధిలో అనుమతించమని పోలీసులు పేర్కొన్నారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, హెడ్‌క్వార్టర్ మెయింటెనెన్స్ కమాండ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వాయుసేన నగర్, మహల్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి 2 కిలోమీటర్ల పరిధిలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, స్పెషల్ బ్రాంచ్ రాతపూర్వక అనుమతితో డ్రోన్లను ఎగురవేయవచ్చు.

నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేస్తామని నాగపూర్ డీసీపీ హెచ్చరించారు. నాగపూర్ లోని కొన్ని సున్నితమైన ప్రదేశాలపై పాకిస్థాన్ కు చెందిన జైష్-ఎ-మహ్మద్ (జెఈఎం) ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారని సమాచారం అందడంతో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు, ఆ చుట్టుపక్కల నాగ్‌పూర్ పోలీసులు నెలరోజుల నుండి భద్రతను పెంచారు,

ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం సమీపంలో డ్రోన్‌లు ఎగరడం, ఫోటోలు తీయడం వంటివి కూడా నగర పోలీసులు నిషేధించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు సీనియర్ పోలీసు అధికారులతో గత నెల మొదటివారంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయాన్ని నగర పోలీస్ కమీషనర్ అమితేష్ కుమార్ సందర్శించారు.

ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం, రేషింబాగ్‌లోని హెడ్గేవార్ భవన్‌లో జైష్ కార్యకర్త ఈ ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించినట్లు సమాచారం అందడంతో భద్రతను పెంచినట్లు ఆయన తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం (నగరం తూర్పు ప్రాంతంలో (మహల్‌లో), రేషింబాగ్‌లోని (నాగ్‌పూర్‌లోని ఆగ్నేయ భాగంలో) స్మృతి భవన్‌లో నిరంతరం పూర్తి స్థాయి భద్రతను కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.

“ఈ ఉగ్రవాదులు ఒక నెల క్రితం శ్రీనగర్ నుండి నాగ్‌పూర్‌కు వచ్చారు. కొన్ని రోజులు నగరంలో ఉన్నారు” అని ఒక సీనియర్ పోలీసు అధికారి ధృవీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, ఉగ్రవాదుల ఆచూకీ కోసం నాగ్‌పూర్ క్రైమ్ బ్రాంచ్ బృందాన్ని ఏర్పాటు చేసింది.

జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల అరెస్టయిన ఓ వ్యక్తిని విచారించిన సందర్భంగా ఉగ్రవాద ప్రణాళిక గురించిన సమాచారం బయటపడిందని ఆ అధికారి తెలిపారు. జైష్ కార్యకర్తలు జూలై 2021లో నాగ్‌పూర్‌ని సందర్శించారని, రెండు రోజులు నాగ్‌పూర్‌లో ఉన్నారని తేలింది.

రద్దీగా ఉండే ప్రదేశాలు, మార్కెట్‌లు, అలాగే ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, భద్రతా బలగాల ప్రాంగణాలపై దాడి చేయడం లేదా పేలుళ్లను ప్రేరేపించడం వంటి తీవ్రవాద ప్రణాళికలను భద్రతా ఏజెన్సీలు అందుకున్న ఇన్‌పుట్‌లు సూచిస్తున్నాయి.

ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఏళ్ల తరబడి ఉగ్రవాదుల రాడార్‌లో ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 2006లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడానికి ముందు నాగ్‌పూర్‌లో ఎకె-47, హ్యాండ్ గ్రెనేడ్‌లతో కూడిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.

మహల్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం, డాక్టర్ హెడ్గేవార్ స్మృతి భవన్, రేషింబాగ్ చుట్టూ ఫోటోగ్రఫీ, డ్రోన్‌ల వినియోగాన్ని నగర పోలీసులు నిషేధించారని కుమార్ చెప్పారు. 2-కిమీ పరిధిలో ఏదైనా డ్రోన్ దొరికితే దానిని పోలీసులు ధ్వంసం చేస్తారు లేదా స్వాధీనం చేసుకుంటారు. “నో-డ్రోన్” జోన్‌లో డ్రోన్‌లను ఉపయోగించడం చట్టపరమైన చర్యను కూడా ఆహ్వానించవచ్చని ఆయన హెచ్చరించారు.

LEAVE A RESPONSE