-ఝలక్ ఇవ్వాల్సిన జాక్ కే జగనన్న రివర్స్ ఝలక్
-ఊహూ అనాల్సిన ఉద్యోగ నేతలు ఉ..ఉ అన్నారే
-నేతల లొంగుబాటు కథ సుఖాంతం
-ఇంతోటి దానికి బెజవాడ దాకా వచ్చుడెందుకు?
-ఉద్యోగ నేతలపై ఉడుకుతున్న ఉద్యోగులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
కట్టప్పలు ఒక్క బాహుబలి సినిమాల్లోనే ఉండరు. బెజవాడలో నేతల రూపంలో కూడా ఉంటారని శనివారం రాత్రే తమకు తెలిసిందన్నది ఉద్యోగుల ఉవాచ. అలాగే ఆత్మహత్యలు ఒక్క రాజకీయాల్లోనే కాదు, ఉద్యమాల్లో కూడా ఉంటాయని శనివారం అర్ధరాత్రికి గానీ అర్ధం కాలేదన్నది, వారికి అర్ధమయిన జ్ఞానోదయం.
ఆంధ్రా ఉద్యోగులు తమ 71 దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం జగనన్న సర్కార్ పై జంగ్ ప్రకటించారు. 12 సార్లు సకల శాఖ మంత్రి సజ్జలన్నతో చర్చించినా ఏమీ ఫాయిదా లేదని, లోపల చర్చలేమీ జరగవని, చాయ్ బిస్కెట్లు ఇవ్వడమే తప్ప లోపల అంతా డ్రామా అని బొప్పరాజన్న, శీనన్న కూడా మీడియాకు చెప్పారు. తమను అవమానిస్తున్నారని, మాటలతో బెదిరిస్తున్నారని ఉద్యోగ నేతలు తెగ ఆపసోపాలు పడుతూ చెప్పారు. ఉద్యోగులయితే సజ్జలన్న మీద పాటలు కూడా కట్టారు. అందుకే ఇకపై సీఎం జగనన్నతో తప్ప, ఇంకెవరితోనూ మాట్లాడే ముచ్చట లేదని తెగేసి చెప్పారు. దానితో తమ నేతలు ఉత్తరకుమారులు కాకుండా, ఉత్తమకుమారులని ఉద్యోగులు భావించారు.
ఆ తర్వాత నాలుగు లక్షల మంది ఉద్యోగులు.. ముసుగులేసుకుని కొందరు, వికలాంగుల వేషాలు వేసుకుని మరికొందరు, విచిత్రవేషధారణలతో ఇంకొందరు మొత్తానికి బెజవాడ చేరి, బీఆర్డీఎస్ రోడ్డును
ముంచెత్తారు. ఇంకేముంది? సర్కారు దిగివచ్చి సమస్యలు పరిష్కరిస్తుందనుకున్నారు. బొప్పరాజన్న, సూర్యనారాయణన్న, శీనన్న, వెంకట్రామిరెడ్డన్న తక్కుంగల నేతాశ్రీలంతా మంత్రుల కమిటీపై శివాలెత్తుతారని, చర్చల్లో పచ్చి కాఫీ టీలు కూడా తాగకుండా బెట్టుగా ఉంటారని, చర్చలు కుదరకపోతే సమ్మె తప్పదని హెచ్చరిస్తారని, భేటీలో భూకంపం పుట్టిస్తారని పిచ్చి ఉద్యోగమారాజులు ఊహించారు.
కానీ తస్సాదియ్యా తుస్సుమందన్నట్లు.. ఉద్యోగ నేతాశ్రీలు సర్కారు నుంచి తమ అన్ని సమస్యలకు నిర్దిష్ట హామీ పొందకుండానే, అంతకుముందు రంకలేసినట్లు కనీసం లిఖితపూర్వక హామీ తీసుకోకుండానే.. అసలు చివరాఖరకు సీఎం జగనన్నను కలవకుండానే, సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు. అది జరిగిన కొద్ది నిమిషాలకే సోషల్ మీడియాలో కట్టప్ప గ్రాఫిక్స్ వెల్లువెత్తాయి. వీటికి ఉద్యోగులే డిజైనర్లు కావటం విశేషం.
అయితే ఇన్ని రోజులు తెలుగు టీవీ సీరియల్ జీడిపాకంలా ఉద్యమాన్ని సాగదీసిన నేతాశ్రీలు, చర్చలకు వెళ్లి జీడిపప్పులు, టీ కాఫీలు తాగడం తప్ప సాధించిందేమిటన్నది ఉద్యోగుల ప్రశ్న. ఏమీ సాధించకుండానే.. ఇన్ని రోజులు అరిగిపోయిన గ్రామ ఫోను రికార్డులా చేసిన డిమాండ్ల అస్త్రాలను, ఎవరికోసం తాడేపల్లిలో ఉన్న జమ్మిచెట్టుమీదెక్కించారు? ఎవరి కళ్లలో ఆనందం చూడ్డానికి అస్త్రసన్యాసం చేశారన్నది ఉద్యోగుల ప్రశ్న.
సరే.. శనివారం రాత్రి బొప్పరాజన్న మాటల్లో చెప్పాలంటే ఏమీ జరగని చర్చల గురించి’ ఎలాగూ అధికార పార్టీ మీడియాతోపాటు.. సర్కారు ఇచ్చే ప్రకటనల కోసం మొహం వాచి, చకోరపక్షుల్లా ఎదురుచూసే మీడియా ఎలాగూ… ‘కథ సుఖాంతం’, ‘చర్చలు సక్సెస్’, సమ్మె విరమణ’,* మెట్టుదిగిన ఉద్యోగ నేతలు’, ‘ఉద్యోగులపై సర్కారు కరుణ’, ‘ఉద్యోగుల హర్షం’, ‘జగనన్నకు ఉద్యోగుల పాలాభిషేకం’ వంటి కథనాలు, ప్రత్యేక కథనాలు వెల్లువెత్తడం సహజమన్నది మెడమీద తల ఉన్న ఎవరికయినా తెలుసు.
ఎందుకంటే ఈ వారం రోజుల్లో సర్కారీ మీడియాలో వస్తున్న కథనాలు, ఉద్యమ తీవ్రత తగ్గించేందుకు అల్లుతున్న ప్రత్యేక కథనాలు చూస్తే.. ఆదివారం మీడియాలో సమ్మె విరమణ వార్తలు ఎలా ఉంటాయో ఉహించడానికి మేధావులే కానక్కర్లేదు. లక్షలాదిమంది ఉద్యోగులు బెజవాడకు చేరిన రోజున.. తెలుగు టీవీ చానెళ్లు, కొన్ని పత్రికలు మరుసటి రోజు ఇచ్చిన నామమాత్రపు కవరేజీ చాలు. ఆంధ్రదేశంలో మీడియా సర్కారుకు ఎన్ని డిగ్రీల్లో సాగలబడిందో చెప్పడానికి!
ఈ ప్రశ్నకు బదులేది?
సరే.. ఈ లొంగుబాట్లు ఏ ప్రభుత్వంలోనయినా ఉండేవే కాబట్టి, కట్టప్పలు ప్రతి పాలకుల వెనుకే కనిపిస్తుంటారు కాబట్టి ఈ ‘కట్టప్పల గోల’ కాసేపలా పక్కన పెడదాం. అసలు సర్కారుకు ఉద్యోగ నేతలు చేసిన డిమాండ్లేమిటి? అందుకు సర్కారు అంగీకరించిందేమిటి? ఈ మొత్తం లొంగుబాటు వృత్తాంతంలో గెలిచిందెవరు? ఓడిందెవరని ఓసారి చూద్దాం.
మూడు షరులతులకు అంగీకరిస్తేనే చర్చలకు వస్తామని చెప్పిన బిల్డప్పు బాబాయ్లు , బేషరుతుగా మళ్లీ ఏ ముఖం పెట్టుకుని చర్చలకు వెళ్లారు? కొత్త పీఆర్సీ జీఓలు రద్దు చేయాలని ఘీంకరించిన నేతలు, వాటి రద్దు కోసం పట్టుపట్టకుండానే సమ్మె ఎలా విరమించారు? అశుతోష్ మిశ్రా నివేదిక బహిరంగ పరచాలని గళమెత్తిన నేతాశ్రీలు, అది ఇస్తే తప్ప చర్చలకు వచ్చేది లేదని స్పష్టం చేయకుండా, నవరంధ్రాలూ ఎందుకు మూసుకున్నట్లు? పాత జీతాలు యధావిధిగా అమలుచేయాలని గాండ్రించిన బాబాలు , ఆ మాట మర్చిపోయి సమ్మెనెలా విరమించినట్లు? 27 శాతం ఫిట్మెంట్ కావల్సిందేనని భీషణ ప్రతిన చేసిన నేతాశ్రీలు, 23 శాతానికే గంగిరెద్దుల్లా తలూపి ఒప్పుకుని, ఉత్తరకుమారుల అవతారమెత్తడానికి కారణమేమిటి? చీకటి జీఓలు రద్దు చేయాలని గర్జించిన ఉత్తరకుమారులు, అదే చీకట్లో జరిగిన చర్చల్లో సర్కారు నుంచి ఏం హామీ లభించిందని సమ్మె విరమించారు? సీపీఎస్ రద్దుపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని నినదించిన ఈ వీరులు, మరి ఆ మేరకు హామీ పొందకుండానే ఎందుకు సమ్మె విరమించినట్లు?
అంతేనా..కాంట్రాక్టు ఉద్యోగుల రైగ్యులరైజేషన్, పేస్కేలు మార్పు, జీపీఎఫ్, ఏపీజీఎస్ఈ, బకాయిలు ఇప్పించడం, రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ 20 లక్షలకు పెంచడం, హెల్త్ కార్డుల అమలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమానపనికి సమానవేతనం, పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ కొనసాగించటం, హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఉన్న సౌకర్యాలు యథావిధిగా కొనసాగించడం, వైద్య ఆరోగ్య శాఖలో జీఓ నెంబర్ 27 రద్దు, గురుకులాలు, మినీ గురుకులాలో కాంట్రాక్టు ఉద్యోగుల రైగ్యులరైజేషన్ వంటి 71 డిమాండ్లను పరిష్కరించకుండా, కనీసం వాటిపై లిఖితపూర్వక హామీ పొందకుండానే బిల్డప్పుల బాబాయిలు ఎందుకు సమ్మె విరమణ ప్రకటన చేసినట్టన్నది ఉద్యోగుల ప్రశ్న. శుక్రవారం రాత్రికి శనివారం రాత్రికి వచ్చిన మార్పేమటన్నది వారి సందేహం.
అసలు ఉద్యోగుల ఉద్యమం, చర్చల యవ్వారాన్ని ఇంతకాలం సాగదీసి… సజ్జలు, రాగులు, పేలాలు, మిరియాల బదులు ఏసీబీ బాసును అప్పుడే కమిటీలో వేసినట్లయితే, ఈ పులుసులో ముక్కల కామెడీ కథకు అప్పుడే తెరపడి ఉండేది. కాగల కార్యం అ.నీ.శాబాసులే కానిచ్చేవారన్నది బుద్ధిజీవుల ఉవాచ. ఈ చిన్న కిటుకు పాలక ప్రభువులకు ఎందుకు తట్టలేదో మరి?
ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావు మాస్టారు చెప్పినట్లు.. ఒకేసారి ఇంతమంది సామూహిక ఆత్మహత్య చేసుకోవడం ప్రపంచంలో ఒక రికార్డు. ‘కొలికపూడి కామెంట్స్’
పేరుతో ఆయన సంధిస్తున్న వ్యంగ్యాస్త్రాలు సాధారణ చదువరులకే చెర్నాకోల్ మాదిరిగా తగులుతుంటే, బిల్డప్పుల బాబాయిల చర్మాలకు మాత్రం అవి తగలకపోవడం వింతే మరి!