శారదా పీఠం వార్షికోత్సవాల సందర్భంగా బుధవారం సీఎం జగన్ విశాఖలో పర్యటించారు. తన పర్యటన సందర్భంగా విశాఖ విమానాశ్రయం దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు నిలిపివేశారని, ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారని పోలీసులను నిలదీశారు. ప్రజలకు అసౌకర్యం కల్గినందుకు చింతిస్తున్నానన్న జగన్.. దీనిపై విచారణ జరపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించారు.
కాగా బుధవారం సీఎం జగన్ రాక సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయడంతో పలువురు ప్రయాణికులు వాహనాలు దిగి లగేజీ పట్టుకుని పరిగెత్తుకుంటూ విమానాశ్రయానికి వెళ్లారు. సుమారు మూడు గంటల పాటు పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఏడీ జంక్షన్ నుంచి పెందుర్తి, కంచరపాలెం, గాజువాక, ఆర్టీసీ కాంప్లెక్స్ మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని స్థానికులు వాపోయారు.