– చిత్తూరు నగరంలో వందల సంఖ్యలో భారీ ర్యాలీ
– భారీ పోలీస్ బందోబస్తు నడుమ నిర్వహించిన ముస్లిం మహిళల ర్యాలీ
చిత్తూరు: కర్ణాటక రాష్ట్రంలో మొదలైన హిజాబ్ వివాదం, మెల్లగా దేశవిదేశాల వరకు తాకింది. దేశవ్యాప్తంగా హిజాబ్ మా హక్కు అంటూ ముస్లిం మహిళలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. శనివారం చిత్తూరు నగరంలోని శేషాపీరన్ మసీదు నుండి జాతిపిత గాంధీ విగ్రహ కూడలి వరకు ముస్లిం మహిళలు భారీ సంఖ్యలో హిజాబ్ ధరించి శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో కులమతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గ నాయకులు హాజరయ్యారు.
చిత్తూరు నగరంలోని అన్ని మసీదు కమిటీవారు ఏకమై ముస్లిం మహిళల ర్యాలీ నిర్వహించడానికి సహకరించారు. శేషాపీరన్ మసీదు నుండి జాతిపిత గాంధీ విగ్రహ కూడలి వరకు జరిగిన ర్యాలీ కు చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ అధికారులు. ముస్లిం మహిళలు హిజాబ్ మా హక్కు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో గాంధీ విగ్రహ కూడలిలో సభను ఉద్దేశించి ముస్లిం మత బోధకులు జిలాని మాట్లాడుతూ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కు కలిగి ఉందని. అన్ని వర్గాల ప్రజలు కలసి మెలసి ఉన్నారని, భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క పౌరులు వారి మతాన్ని గౌరవిస్తూ, వారి మతాచారాల ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ వారికి ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా ఇస్లాం మతం ప్రకారం హిజాబ్ ధరించే హక్కు ప్రతి ముస్లిం మహిళకు ఉందని అన్నారు.
ముస్లిం నాయకులు అఫ్జల్ ఖాన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఉన్నారని. కొన్ని దుష్ట శక్తులు వారి పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి వివాదాలు లేవనెత్తారఅని, అదే విధంగా కొన్ని రాష్ట్రాలలో జరుగునున్న ఎన్నికల నేపథ్యంలో కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయం కోసం హిజాబ్ ను పాఠశాలల్లో, కళాశాలల్లో ధరించడం అనుమతించకూడదని లేవనెత్తడం హీనమైన చర్య అని గుర్తు చేశారు. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాం మతం ఇచ్చిన ఒక గొప్ప వరం అని అన్నారు. అంతేకాకుండా కొంతమంది సామాజిక మాధ్యమాలలో కులమతాలను రెచ్చగొట్టేవిధంగా హిజాబ్ వివాదాన్ని పెంచుతూ పోస్ట్ చేయడం, వాటిని కొందరు ముస్లింలు జవాబులు ఇవ్వడం మంచి విషయం కాదని, ఇలాంటి పోస్ట్లు చేస్తున్న, చేయిస్తున్న వ్యక్తుల కదలికలపై ఇప్పటికే పోలీసు శాఖ దృష్టి సారించిందని అన్నారు.
జిల్లాలోని పాఠశాల, కళాశాల లో ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ వేసుకొని వస్తే అనుమతించాలని, ఎవరైనా అడ్డుకుంటే చట్టరీత్యా చర్యలు చేపట్టాలని, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం పొందాలని అన్నారు. కొందరు మహిళలు మాట్లాడుతూ హిజాబ్ ధరించడం మా హక్కు అని, వాటిని అడ్డుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదని అన్నారు. అవసరమైతే మా హక్కును పొందేందుకు రోడ్డెక్కి న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
అనంతరం అన్ని మసీదు కమిటీ వారి తరఫున వినతి పత్రాన్ని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి, చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి లకు గాంధీ విగ్రహ కూడలిలో అందించారు. వారిద్దరూ మాట్లాడుతూ కమిటీ వారు ఇచ్చిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపుతామని హామీ ఇచ్చారు. ఈ ర్యాలీ లో మక్కా మసీద్ అధ్యక్షులు నజీబ్, జామియా మసీద్ సెక్రెటరీ ఫాహిం భాష, మత గురువులు ఫ్రిదోజ్, ఇమ్రాన్, అబ్దుల్ షుకూర్, సమిఉల్ల, మైనార్టీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.