ఆంధ్రప్రదేశ్) పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు.. సోమవారం తెల్లవారు జామున గుండెపోటు రావడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గౌతమ్‌రెడ్డిని ఐసీయూలో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తుండగా కన్నుమూశారు. వారం రోజుల దుబాయ్ పర్యటన ముగించుకొని.. నిన్ననే హైదరాబాద్ తిరిగి వచ్చారు గౌతమ్‌రెడ్డి.. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గౌతమ్‌రెడ్డి 2019 ఎన్నికల్లో వైసీపీ తరుఫున గెలుపొందారు. ఆయన ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
గౌతమ్ రెడ్డి మరణ వార్త విన్న అభిమానులు, వివిధ పార్టీల నాయకులు అపోలో ఆసుపత్రికి తరలివస్తున్నారు. ప్రస్తుతం మేకపాటి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎంతో ఆరోగ్యంగా ఉండే గౌతమ్ రెడ్డి ఇలా ఉన్నట్టుండి చనిపోవడం అందరికీ షాకింగా మారింది. గౌతమ్ రెడ్డి ఎంతో ఆరోగ్యంగా ఉంటారనీ. కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారనీ. హోటల్లో కూడా జిమ్ ఫెసిలిటీ చూసుకుంటారనీ చెబుతుంటారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. జిల్లాలో ఎక్కడా ఎవరితోనూ వివాదాల్లేకుండా ఉంటారనీ. ఆయనెంతో మృధుస్వభావిగా చెబుతున్నారు ఆయన బంధు మిత్రులు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు మేకపాటి గౌతం రెడ్డి మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి కనీసం కోపతాపాలు ప్రదర్శించని వ్యక్తిగా పేరుందని చెప్పుకొస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యేలన్న ధోరణిలో ఎక్కడా తేడా చూపేవారు కాదనీ. మేకపాటి గౌతమ్ రెడ్డి అందరితోనూ అంతగా కలిసిపోతారనీ అంటున్నారు.