Suryaa.co.in

Andhra Pradesh

కన్నెగంటి హనుమంతు పల్నాడు జిల్లాగా పేరు మార్చాలి

నూతనంగా గుంటూరు జిల్లాలో ప్రతిపాదించిన“పల్నాడు జిల్లా” ను “కన్నెగంటి హనుమంతు పల్నాడు జిల్లా” గా మార్పుచేయాలని పల్నాడు మేధావుల వేదిక విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు జిల్లా కలెక్టర్ కు వేదిక అధ్యక్షుడు కోదూరు సాంబశివరావు, కార్యదర్శి యతిరాజు రాంమోహనరావు వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్రప్రభుత్వం గుంటూరు జిల్లాలో నూతనంగా నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని చేసిన ప్రకటన పట్ల పల్నాడు మేథావుల వేదిక హర్షం వ్యక్తం చేసింది. మనదేశం “ఆజాదీ కి అమృత్ మహోత్సవం” జరుపుకుంటున్న తరుణంలో ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కన్నెగంటి హనుమంతు పేరును చేర్చుతూ మార్చాలని వారు సూచించారు.

కన్నెగంటి పోరాటాన్ని పలువురు ప్రముఖులు సైతం పలు సందర్భాలలో కొనియాడారని, వారిలో కవికోకిల గుర్రం జాషువా, మాజీ ముఖ్యమంత్రి కాసు ప్రహ్మానందరెడ్డి వంటి ఎంతోమంది ఉన్నారని వారు గుర్తు చేశారు.

కన్నెగంటి పరాక్రమాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఆ మహావీరుడు దేశం కోసం ప్రాణాలు అర్పించి 100 సంమవత్సరాలు పూర్తి అయ్యాయి.కావున నూతనంగా ఏర్పడబోయే “పల్నాడు జిల్లా” ను “కన్నెగంటి హనుమంతు పల్నాడుజిల్లా” గా నామకరణం చేయడం అంతటి స్వాతంత్య్ర సమరయోధునికి, నిష్కళంక దేశభక్తునికి, వీర విప్లవ వేగుచుక్కకు మనం ఇవ్వగల నిజమైన నివాళి కాగలదని పల్నాడు మేధావుల వేదిక తెలిపింది.

ఈ విషయాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రతిపాదిత “పల్నాడు జిల్లా”కు ముందు కన్నెగంటి హనుమంతు పేరును చేర్చి “కన్నెగంటి హనుమంతు పల్నాడు జిల్లా”గా మార్చే విధంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించవలసినదిగా వారు జిల్లా కలెక్టర్ ను కోరారు.

LEAVE A RESPONSE