– పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి
అమరావతి : అప్పులు చేయడంలో సీఎం జగన్, ప్రభుత్వ ఆస్తులు అమ్మడంలో ప్రధాని మోదీ పోటీ పడడం శోచనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మోదీ దేశాన్ని అప్పుల కుప్ప చేయగా, జగన్ రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని ఆరోపించారు. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాల కాలంలో నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధాన మంత్రుల పాలనలో కేంద్రం చేసిన అప్పు రూ. 46 లక్షల కోట్లు అని అన్నారు.
2014 నుంచి 2021 వరకు ఏడేళ్ల కాలంలో మోదీ పాలనలో కేంద్రం చేసిన అప్పు రూ.74 లక్షల కోట్లు అన్నారు. పాడి ఆవు లాంటి ఎల్‌ఐసిలో 20 శాతం వాటా అమ్మాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించడం శోచనీయమన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప అయిందని తులసి రెడ్డి విమర్శించారు. 1956 నుంచి 2014 వరకు 58 ఏళ్ల కాలంలో నీలం సంజీవరెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో చేసిన అప్పులు రూ. లక్ష కోట్లు మాత్రమేనన్నారు. జగన్ పాలనలో ప్రతి యేడాది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు రూ. లక్ష కోట్లని, శక్తికి మించిన అప్పు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మడం, ప్రజలపై పన్నుల భారం వేయడం, ధరలు పెంచడం జగన్ పాలనలో నిత్య కృత్యాలయ్యాయని తులసి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.