Suryaa.co.in

Editorial

పోలీసులపై పేర్ని నానికి కోపమొచ్చింది…

-కారు తీయమంటారా.. హమ్మా.. ఎంత ధైర్యం మీకు?
-డీఐజీ, ఎస్పీ డిజిగ్నేషన్ తనకంటే తక్కువేనన్న మంత్రి పేర్ని
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాదా మరి? అహ.. రాదా అంట?! తాను ఒక క్యాబినెట్ మినిష్టరు. అంతేనా.. ఒక జిల్లాకు ఇన్చార్జి మంత్రి. మరి అంతలావు మంత్రినయిన ఆయన కారునే పోలీసులొచ్చి పులుసులో ముక్కను తీసేసినట్లు ‘ ఆ కారు తీసి అవతల పెట్టమని’ అదిలిస్తే.. ఎంతలావు మంత్రికయినా ఎక్కడ కాలాలో అక్కడే కాలుతుంది కదా? యస్. ఇప్పుడు మన ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నానికీ అక్కడే కాలింది.

సీఎం జగన్, కేంద్రజలవనరుల శాఖ మంతి షెకావత్ శుక్రవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చారు. కాబట్టి సహజంగానే జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్ని నాని, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు కార్లలో వచ్చారు. మరి వారికి పార్కింగ్ కావాలి కదా? మామూలుగా అయితే అలాంటి

వారికోసం పార్కింగ్ వేరేచోట ఏర్పాటుచేస్తుంటారు. కానీ మంత్రిగారు కదా? అందుకే ఎక్కడయినా పెట్టుకోవచ్చన్న భావనతో మంత్రిగారి డ్రైవరు, కారును ఏకంగా ఐపిఎస్ అధికారులు పార్కింగ్ చేసిన చోట ఉంచారు.

మరి అలా చేస్తే కింద స్థాయి పోలీసులకు కోపం వస్తుంది కదా? రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి కార్లయినా సరే.. అసలు వాళ్లు ఎంతలావు పెద్దోళ్లయినా సరే.. వాళ్ల కార్లు తమ సార్ల కార్ల పార్కింగ్ దగ్గర పెట్టుకోకూడదన్నది పోలీసుల మెదళ్లలో దశాబ్దాలుగా ఫిక్సయిన ఫిలాసఫీ.

పోలవరంలో కూడా సరిగ్గా అదే జరిగింది. అక్కడ నుంచి మంత్రి గారి కారు తీసేయమని పోలీసు ఆఫీసర్ ఒకాయన ఆర్డరేశారు. ఈ విషయం తెలిసిన మంత్రి పేర్ని నాని అక్కడికొచ్చి.. తానేమిటో, తన డిజిగ్నేషనేమిటో, డిజిగ్నేషన్‌లో ఎవరెక్కువో సదరు పోలీసు అధికారికి చెప్పుకోవలసి వచ్చింది. ‘ ఎవరయ్యా రండి. కారు తీయమన్నోడెవరో రండి. ఎవరి డిజిగ్నేషనేంటో తెలీదు. ఈ కార్లన్నీ ఎవరివి? తమాషాలు చేస్తున్నారా? నేను ఇన్చార్జి మినిష్టర్‌ను. ఇవాళ్టితో పండగయిపోదు. ఒకడు చెప్పేదేందోయ్. ఇక్కడ డీఐజీ, ఎస్పీ కార్లు ఎందుకున్నాయ్? నాకంటే డిజిగ్నేషన్ తక్కువ ఆళ్లు. రమ్మను. మర్యాదగుండదు’ అంటూ పేర్ని వారు అక్కడికొచ్చిన పోలీసాయనపై ఫైరయ్యారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పాపం.. పవన్ కల్యాణ్ మీద, చంద్రబాబు మీద ఎప్పుడంటే అప్పుడు విరుచుకుపడే పేర్ని నాని శక్తిని, పోలీసులు ఇంకా గుర్తించనట్లున్నారు!

LEAVE A RESPONSE