-ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని, వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము
తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఎన్నో ఆశలతో, ఎందరో యువకులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయక సాధించుకున్నారు. ఖాళీగా ఉన్న లక్ష తొంబది వేల ప్రభుత్వ ఉద్యోగాలతో తమకు బంగారు భవిష్యత్తు కోసం కలలు గన్న యువత కలలను ఆశలను టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఉద్యోగాలను భర్తీ చేయకుండా వారి భవిష్యత్తును అందకారంలోకి నెట్టి వారి ఆశలను తుంగలో తొక్కింది. దాంతో ఎంతో మంది నిరుద్యోగులు నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీ ఏమైంది? మీ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వస్తే చాలా? ఉద్యోగాలపై ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఉద్యమంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? ఏడున్నరేళ్లుగా ఏం చేశారు? “నీళ్లు నిధులు నియామకాలు” తెలంగాణ ఏర్పాటుకు మూలం ఇవే, ఉద్యమానికి ఊపిరి
పోసింది ఇవే, వీటి పేరుతో అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ఈ మూడింటినీ గాలిలో వదిలేశారు. వైద్యవిద్య, ఆర్టీసి, సచివాలయం, డైరెక్టరేట్ లు, వ్యవసాయం, విద్యుత్ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ఎప్పుడు చేస్తారు? కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ప్రశ్నలకు ఏం జవాబిస్తారు?
లక్షా 91వేల 126 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని వేతన సవరణ సంఘం చెప్పింది. రాష్ట్రంలో మంజూరైన మొత్తం ఉద్యోగాలు 4,91,304. అందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 3,00,178. ఖాళీగా ఉన్న పోస్టులు 1,91,126. ఇవి మేం చెప్పేవి కాదు. సిఆర్ బిస్వాల్ నేతృత్వంలోని పిఆర్ సి నివేదిక చెప్పింది. 39% పోస్టులు ఖాళీ. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మినహాయించినా ఇంకా ఖాళీ పోస్టులు 90 వేలు చిల్లర ఉన్నాయి.
రాష్ట్రంలో ప్రతి 1000మందికి 8.5% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 14మంది ఉండాలి. ఖాళీలు ఎక్కువ ఉండబట్టే పరిపాలన పూర్తిగా పడకేసింది. 2014లో నిరుద్యోగం రేటు 2.7% ఉంటే 2019నాటికి 10%కు పెరిగింది, ఈ రెండున్నరేళ్లలో ఇంకో 3% పెరిగింది. ఏడున్నరేళ్లలో నిరుద్యోగం ఐదారు రెట్లు పెరగడం ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇదేనా ఉద్యమంలో చెప్పింది?
గొర్రెలు, మేకలు, బర్రెలు పెంపకమా? మీరు తెచ్చిన ఉద్యోగాలు? నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాల భర్తీ లేదు. రూ 3016 భృతి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు, ఒక బడ్జెట్ లో రూ 1810 కోట్లు పెట్టామన్నారు. తర్వాత బడ్జెట్ లో ఆ ఊసేలేదు.. పైసా ఖర్చు పెట్టారా?
నిరుద్యోగ ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే
ఉద్యోగ నోటిఫికేషన్లు లేవన్న మనస్తాపంతో రైలు కిందపడి నిరుద్యోగి ఆత్మహత్య. మహబూబాబాద్ జిల్లా బయ్యారంకు చెందిన ముత్యాల సాగర్(24) రెండున్నరేళ్లుగా ప్రైవేటు సంస్థలో శిక్షణ-అతని మొబైల్ వాట్సప్ స్టేటస్ లో “నోటిఫికేషన్లు లేక పిచ్చి లేస్తోంది, కేసిఆర్ కరోనా కారణం” గా పేర్కొనడం సిగ్గుచేటు. నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వేన్ గ్రామానికి చెందిన కురుమూర్తి (26) పీజీ చదివినా ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య.
జాబు రావడం లేదని మహిళ ఆత్మహత్య – నిర్మల్ జిల్లా, నిర్మల్ టౌన్లో సంతోష్ శ్రీలత (30) పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నా ఉద్యోగం కోసం నోటిఫికేషన్లు రావడం లేదని ఆత్మహత్య. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి అనేక మంది నిరుద్యోగులు బలి అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్లలో 50మందిపైగా
ప్రాణార్పణం. ప్రైవేట్ టీచర్ దంపతులు వనం రవికుమార్, అక్కమ్మ బలవన్మరణాలు-వనపర్తి
జిల్లా తాడిపత్రికి చెందిన కొండల్, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవిపాడుకి చెందిన సానిక నాగేశ్వరరావు (15.7.2021) ఆత్మహత్య. గత రెండు నెలల్లో నిరుద్యోగుల ఆత్మహత్యలు..కరీంనగర్ లో ఎండి షఫీ (బిటెక్).. మహబూబ్ నగర్ లో శ్రీకృష్ణ(24).. జగిత్యాలలో చిత్ర లవకుమార్ (27).. సిరిసిల్లలో కల్లూరి వెంకటేశం…నిజామాబాద్ లో నేతికుంట చందు(30).. 2016-19 మధ్య 165మంది నిరుద్యోగులు
ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర కార్మిక శాఖమంత్రి రామేశ్వర్ చెప్పారు.
డిమాండ్లు –
• ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలను ఆదుకోవాలి.
• ప్రభుత్వ శాఖలన్నింటిలో ఉన్న మొత్తం ఖాళీ పోస్టులపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల
చేయాలి. ఖాళీగా ఉన్న 1,91,126 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి.
• ఖాళీ పోస్టులన్నింటినీ, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించి 6 నెలల్లోపు పూర్తి చేయాలి.
• వయోపరిమితి సడలింపు జీవోను పొడిగించాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరి టీఎస్ పీఎస్సీ కూడా ఎప్పటికప్పుడు ఖాళీలను గుర్తించి ప్రతినెలా జాబ్ కేలెండర్ ను విడుదల
చేయాలి. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే రూపొందించాలి.
• టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలి.
• కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలి.అని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
(పి.సాయిబాబా) పార్లమెంట్ అధ్యక్షులు
(శ్రీపతి సతీష్) రాష్ట్ర బిసి అధ్యక్షులు
(నల్లెల్ల కిషోర్) కార్యనిర్వహక అధ్యక్షులు
(పి.బాలరాజ్ గౌడ్) ప్రధాన కార్యదర్శి
(నగు నగేష్) రాష్ట్ర కార్యదర్శి
(పెదొజు రవీంద్రాచారి) రాష్ట్ర కార్య.ని. కార్యదర్శి
(వల్లారపు శ్రీనివాస్) ఇస్ చార్జ్