– అమరావతి బహుజన జెఎసి బాలకోటయ్య హితవు
ప్రజా రాజధాని అమరావతికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అమరావతిపై అసెంబ్లీలో చర్చ చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయడాన్ని అమరావతి బహుజన జేఏసీ తప్పుబట్టింది. ఈమేరకు జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య తుళ్ళూరు, వెలగపూడి, మందడం దీక్ష శిబిరాలను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చర్చ చేయాల్సింది న్యాయస్థానం తీర్పుపై కాదని, ముఖ్యమంత్రి రాజీనామాపై అని స్పష్టం చేశారు.
ఉన్నత న్యాయస్థానాలు కీలకమైన తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో ఆయా సందర్భాలలో ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారని, మెడికల్ సీట్ల వ్యవహారంలో హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారని గుర్తుచేశారు. అలాంటి ప్రజాస్వామిక సత్ సంప్రదాయాలు పాటించాలని ఆయన తెలిపారు. లేకుంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సూచించారు.
న్యాయస్థానాల తీర్పును కూడా చిలువలు, పలువలు చేసి ప్రజల్లో వ్యవస్థల పట్ల అపనమ్మకం కలిగేలా మంత్రులు మాట్లాడటం నీచమైన రాజకీయం గా ఆయన అభివర్ణించారు. హైకోర్టు ధర్మాసనం రాజధాని మార్పు పై రాష్ట్ర శాసనసభకు హక్కు లేదని చెప్పింది కానీ, శాసనాలు చేయొద్దని కానీ,చట్టాలు రూపొందించొద్దని కానీ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. రాజధాని కి లక్ష కోట్లు కావాలనే సజ్జల మాట పూర్తిగా సత్యదూరం అని తెలిపారు.సుప్రీంకోర్టుకు వెళ్ళినా రాష్ట్ర ప్రభుత్వానికి భంగపాటు తప్పదని ప్రజల హర్షాతిరేకాల మధ్య ఆయన ప్రకటించారు.ఈ సందర్భంగా మహిళల పోరాట దీక్షకు సంఘీభావంగా మహిళా జెఎసి గద్దె ప్రభావతిని ఆయన పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు.