అమరావతి: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. తిరువళ్వార్ సూక్తులతో బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టిన మంత్రి బుగ్గన.. బడ్జెట్ వివరాలను సభకు వివరించారు. మధ్యమధ్యలో గురజాడ అప్పారావు, శ్రీశ్రీ కవితలను చదివి వినిపించారు.
విపత్తును ఎదుర్కొన్నప్పుడే మన సామర్థ్యం తెలుస్తుందన్న మంత్రి బుగ్గన.. నీతి ఆయోగ్ విడుదల చేసిన పలు నివేదికల్లో ఏపీకి దక్కిన ఘనత గురించి వివరించారు. సంక్షేమ పథకాల సమర్థవంతంగా అమలు
చేయడం.. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రెండింతలు కేటాయింపులు పెంచినట్లు తెలిపారు.కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొంటూ.. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం సమర్థవంతంగా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించిందని మంత్రి బుగ్గన గుర్తు చేశారు.
ఇక 2022-23 వార్షిక బడ్జెట్ రూ. 2,56,256 కోట్లు గా పేర్కొన్న మంత్రి బుగ్గన.. రెవెన్యూ వ్యవయం రూ. 2, 08, 261 కోట్లు, మూల ధన వ్యవయం రూ. 47, 996 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 17, 036 కోట్లు, ద్రవ్య లోటు రూ. 48, 724 కోట్లు, జీఎస్‌డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతంగా బడ్జెట్‌లో పొందుపర్చారు.
ఏపీ బడ్జెట్‌లో పలు ముఖ్యమైన కేటాయింపులు
వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు
వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,900 కోట్లు కేటాయింపు
పాల ఉత్పత్తి, పశుసంవర్ధక శాఖ, మత్యశాఖకు రూ.1568 కోట్లు
ఉన్నత విద్యకు రూ. 2,014 కోట్లు కేటాయింపు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ. 10, 201 కోట్లు కేటాయింపు
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రెండింతలు కేటాయింపులు పెంపు
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రూ. 20,962 కోట్లు
వ్యవసాయం మార్కెటింగ్, సహకారశాఖకు రూ. 11,387 కోట్లు
పలు విభాగాల కేటాయింపులు
వ్యవసాయం: రూ. 11,387.69 కోట్లు.
పశుసంవర్ధకం: రూ. 1568.83 కోట్లు.
బీసీ సంక్షేమం: రూ. 20,962.06 కోట్లు
పర్యావరణ, అటవీ: రూ. 685.36 కోట్లు.
ఉన్నత విద్య: రూ. 2,014.30 కోట్లు.
విద్యుత్: రూ. 10,281.04 కోట్లు.
సెకండరీ ఎడ్యుకేషన్: రూ. 27,706.66 కోట్లు.
ఎకానమికల్ బ్యాక్ వర్డ్: రూ. 10,201.60 కోట్లు.
సివిల్ సప్లైస్: రూ. 3,719.24 కోట్లు.
ఫైనాన్స్: రూ. 58,583.61 కోట్లు
జీఏడీ: రూ. 998.55 కోట్లు.
సచివాలయ వ్యవస్థ: రూ. 3,396.25 కోట్లు