– నిధులు కేటాయించకుండా వికలాంగుల బాగు ఎలా సాధ్యం?
రాష్ట్ర ప్రభుత్వం 2022- 23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మోసం చేసిందని,తక్షణమే బడ్జెట్ను సవరించి వికలాంగుల సంక్షేమానికి 5 శాతం నిధులు కేటాయించాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
బడ్జెట్లో 5 శాతం ప్రకారం 12 వేల కోట్లు వికలాంగుల సంక్షేమానికి కేటాయించాలి. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాలను ప్రకారం రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. వీరి సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి బడ్జెట్ కేటాయింపులు నిదర్శనం.
అనేక కులాల వారికి బడ్జెట్లో నిధులు కేటాయించిన ప్రభుత్వం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన సమాజంలో వివక్షకు గురవుతున్న వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించాలనే ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం దురదృష్టకరం.వికలాంగుల వివాహ ప్రోత్సాహానికి ఎందుకు నిధులు కేటాయించలేదు.
స్వయం ఉపాధి పథకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగ వికలాంగులు ఎదురు చూస్తుంటే ..నిధులు ఎందుకు కేటాయించలేదు? పరికరాల కోసం అనేకమంది ఎదురుచూస్తుంటే బడ్జెట్లో నిధులు కేటాయించక పోవడం ద్వారా పరికరాల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను పరిశీలిస్తే కాంట్రాక్టర్లు, కమీషన్ల కోసమే బడ్జెట్ ఉందనిపిస్తుంది.