Suryaa.co.in

Editorial

సమాజ్‌వాదీ పార్టీని సమాధి చేసిన మజ్లిస్

– 100 నియోజకవర్గాల్లో సగటున 20 వేల ఓట్లు చీల్చిన మజ్లిస్
– ఓట్ల చీలికతో నెగ్గిన బీజేపీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

– బీహార్‌లో విపక్షాల ఓట్లు చీల్చి, బీజేపీ మిత్రపక్షానికి మేలు చేసేందుకే మజ్లిస్ పోటీ చేస్తోంది
– ఉత్తరప్రదేశ్‌లో ముస్లింల ఓట్లు చీల్చి, సమాజ్‌వాదీ విజయానికి గండి కొట్టేందుకే మజ్లిస్ బీజేపీకి బీ టీముగా మారింది
ఇప్పటివరకూ మజ్లిస్‌పై వచ్చిన విమర్శలివి. కానీ వాటిని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. బీజేపీ ఓటమే తమ లక్ష్యమని చెప్పారు.

సీన్ కట్ చేస్తే..
ఉత్తరప్రదేశ్‌లో మజ్లిస్ వంద అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. ఒక రాజకీయ పార్టీగా దాని హక్కును ఎవరూ ఆక్షేపించలేరు. ఏ పార్టీ ఎక్కడయినా పోటీ చేయవచ్చు. ముస్లింల ప్రాబల్యం ఉన్న ఆ వంద నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచే అవకాశమే లేదు.
అయితే యుపీ ఎన్నికల్లో వంద స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్‌కు ఎక్కడా డిపాజిట్ రాలేదు. కాకపోతే, సగటున ఆ పార్టీకి ఒక్కో నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు 20 వేలు మాత్రమే.
మరయితే ఇక మజ్లిస్ ప్రభావం ఏముంది అని ప్రశ్నించవచ్చు. నిజమే దాని ప్రభావం ఈ ఎన్నికల్లో లేకపోవచ్చు.
కానీ సమాజ్‌వాదీ పార్టీ పుట్టి మునగడానికి, ముంచడానికి మజ్లిస్ పోటీ కారణమయింది.

అదెలాగంటే..
100 స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్‌కు మొత్తం వచ్చిన ఓట్లు 22 లక్షల 30 వేలు. అంటే ఒక్కో నియోజకవర్గంలో, సగటున ఆ పార్టీకి 20 వేల ఓట్లు పోలయ్యాయన్నమాట. అంటే ఆ వంద స్థానాల్లో బీజేపీ గెలవడానికి, మజ్లిస్ పోటీ పనికివచ్చిందన్నమాట.

ఇంకొంచెం వివరాల్లోకి వెళదాం..
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ 82 నియోజకవర్గాల్లో కేవలం 500 ఓట్ల తేడాతో ఓడిపోయింది. 81 స్థానాల్లో 1000 ఓట్ల లోపు తేడాతో ఓడిపోయింది.
ఇక మజ్లిస్ కథ ముగిసిన నేపథ్యంలో.. గుజరాత్‌లో మజ్లిస్ పాత్ర ఆప్ పోషించేందుకు సిద్ధమవుతోందట. అర్ధం కాలేదా? వచ్చే ఎన్నికల్లో గుజరాత్‌లో ఆప్ పోటీ చేయనుందన్నమాట. ఇదీ సంగతి!

LEAVE A RESPONSE