– సిగ్గులేకుండా కేంద్రంపైనే విమర్శలా?
– డీపీఆర్ సమర్పించకుండా కాళేశ్వరానికి జాతీయ హోదా ఎట్లా సాధ్యం?
– టీఆర్ఎస్ నేతల మాటలు చూసి జనం నవ్వుకుంటున్నరు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
స్మార్ట్ సిటీ పేరుతో కేంద్రం ఇచ్చిన నిధులతో కరీంనగర్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించిన టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా మళ్లీ కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని విమర్శలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
టీఆర్ఎస్ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్ లో నిన్న ప్రారంభోత్సవం చేసిన నిధులు ఎక్కడి నుండి వచ్చాయో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు కరీంనగర్ లో బండి సంజయ్ కార్యకర్తలు, నాయకుల మధ్య హోలీ సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సంజయ్ బదులిచ్చారు. అందులోని ముఖ్యాంశాలు…
నిన్న టీఆర్ఎస్ నాయకులు సభలో ఏది మాట్లాడినా నడుస్తుందనుకుని సిగ్గులేకుండా వ్యవహరించారు. స్మార్ట్ సిటీ కోసం కేంద్రం ఇచ్చిన నిధులతో నిన్న ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. పైగా కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నరు.
వేములవాడ రాజన్న ఆలయానికి ‘ప్రసాదం’ స్కీం కింద ప్రతిపాదనలు పంపితే కేంద్రం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ప్రతిపాదనలు పంపలేదు. ఈ విషయంపై ఎన్నిసార్లు మొత్తుకున్నా స్పందన లేదు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జాతీయ రహదారి రోడ్ల నిర్మాణానికి సీఆర్ఐఎఫ్ కింద రూ.205 కోట్లు తెచ్చిన. అట్లాగే ప్రధానమంత్రి సడక్ యోజన, ఈజీఎస్ కింద వేలాది కోట్లు తెస్తున్నం. ఎల్కతుర్తి-సిద్దిపేట రోడ్డు నిర్మాణానికి ఈ మధ్య పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చిన.
అయినా నేను ఏమీ చేయలేదని టీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్దాలు చెబుతూ డ్రమ్ములో రాళ్లేసి సౌండ్ చేసినట్లు ఒర్లుతున్నరు. అయినా ఆ కుటుంబమే (కేసీఆర్) అటువంటిది. ఏది పడితే అది మొరగడం వాళ్లకు అలవాటైంది. అసలు తెలంగాణకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా కేంద్రంపై ఏడ్వటం సిగ్గు చేటు.
మతపిచ్చి లేపుతున్నానని చెబుతున్న వాళ్లకు… నేను సగర్వంగా హిందువనని చెప్పకుంటా. హిందువులు రెచ్చగొడితే రెచ్చిపోయేటోళ్లు కాదు. ఎంఐఎం కోసం మైనారిటీ సంతుష్ట విధానాలను అవలంబించే మీ లాంటోళ్లకు బుద్ది చెబుతాం.
ఎంపీగా అడ్డిమార్ గుడ్డిసూట్ లో గెలిచారనే ఆరోపణలు చేస్తున్న వాళ్లు నన్ను కరీంనగర్ ప్రజలు లక్ష ఓట్లతో గెలిపించిన సంగతి గుర్తుంచుకోవాలి. టీఆర్ఎస్ గెలిచేందుకు వంద కోట్లు ఖర్చు పెట్టినా ఆ పార్టీ అభ్యర్ధిని ఓడించిండ్రు. అందరూ కలిసినా బీజేపీని ఏమీ చేయలేకపోయిండ్రు.
తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని గెలిచేది మీరే (టీఆర్ఎస్). నీ అయ్యతోసహా మీరంతా తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని గెలిచిండ్రు. కానీ నీ అయ్య తెలంగాణ బిల్లు ఓటింగ్ లో పాల్గొనలేదు. సీఎం అయ్యాక నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం చేసిండు. ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటుండు.డీపీఆర్ పంపకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎట్లా ఇస్తరు? ఏది పడితే అది మొరిగితే.. జనం వాత పెడతరని టీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలి.
గంగులపై పోటీ చేయాలంటూ తూట్ పాలిష్ గాళ్లు చెప్పే మాటలను పట్టించుకునేదెవరు? టీఆర్ఎస్ కు భయం పట్టుకుంది. హిందుత్వం, బీజేపీ, కాషాయం అంటేనే వణుకు మొదలైంది. అందుకే టీఆర్ఎస్ సభను అడ్డుకుంటామనే భయంతో బీజేపీ కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేసిండ్రు సిగ్గు లేకుండా… అడ్డుకోవాలనే నీచ సంస్ర్కుతి మాత్రం మాకు లేదు. బీజేపీ అంటే భయంతోనే వాళ్లు అరెస్టు చేస్తుండ్రు.
టీఆర్ఎస్ లెక్క బీజేపీ ఏక్ నిరంజన్ పార్టీ కాదు. జాతీయ పార్టీ. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఎవరైనా సరే దానికి కట్టబడి ఉండాల్సిందే… దాని ప్రకారమే బండి సంజయ్ అయినా.. ఇంకెవరైనా పోటీ చేయాల్సిందే.. పనిచేయాల్సిందే.