వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను కడప కోర్టు కొట్టేసింది.కేసులో మూడో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డికి బెయిలు ఇస్తే.. మిగిలిన సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్న సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించింది.
మాజీమంత్రి వివేకా హత్యకేసులో నిందితుడుగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి బెయిలు పిటిషన్పై కడప కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కేసులో మూడో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డికి బెయిలు ఇస్తే.. దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు.
మిగిలిన సాక్షులను కూడా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని న్యాయస్థానానికి తెలిపారు. వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుగు సాగాలంటే బెయిలు పిటిషన్ కొట్టేయాలని అభ్యర్థించారు.సీబీఐ వాదనలతో కడప కోర్టు ఏకీభవించింది. ఉమాశంకర్ రెడ్డి బెయిలు పిటిషన్ కొట్టివేస్తూ.. కడప నాలుగవ అదనపు జిల్లా జడ్జి కోర్టు తీర్పును వెలువరించారు.
మరో వైపు వివేకా కేసులో కీలక సాక్ష్యులుగా ఉన్న దస్తగిరి, రంగన్నకు భద్రత కల్పించాలని కోరుతూ సీబీఐ వేసిన పిటిషన్పై విచారణను న్యాయస్థానం ఈనెల 25కు వాయిదా వేసింది.