Suryaa.co.in

Andhra Pradesh

ఎన్టీఆర్‌ను భూస్థాపితం చేసి 40 ఏళ్ల ఉత్సవాలా?

– వెన్నుపోటుదార్లకు అసలు ఆ హక్కు ఉందా?
– చంద్రబాబును ప్రశ్నించిన వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు

ప్రెస్‌మీట్‌లో అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..:
అది ‘తెగులు దేశం పార్టీ’:
ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి, ఆయన పదవి లాక్కుని భూస్థాపితం చేసిన చంద్రబాబు, ఇప్పుడు 40 ఏళ్ల ఉత్సవాలు చేస్తున్నారు. వెన్నుపోటుదార్లకు అసలు ఆ హక్కు ఉందా? అప్పుడు ఎన్టీ రామారావు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ చంద్రబాబుగారు నడుపుతున్నది తెగులుదేశం పార్టీ. అది రాష్ట్రానికి పట్టిన తెగులు.

ప్రతి చోటా వాటిపై చర్చ జరగాలి:
ఈనెల 29వ తేదీకి ముందు వెనకా నాలుగు రోజుల పాటు రాష్ట్రమంతా కొన్నింటిపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సి ఉంది.
ఎన్టీఆర్‌గారి పార్టీని, ఆ పార్టీ గుర్తును, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ను, ఆయన కుర్చీని చంద్రబాబుగారు లాక్కున్న వైనం, చేసిన విధ్వంసం పట్ల వాడవాడలా 29వ తేదీన చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
అంతే కాకుండా దేశ రాజకీయ చరిత్రలో ఒక చీడపురుగలా మారిన చంద్రబాబుగారి మనస్తత్వంపై కూడా వాడవాడలా చర్చ జరగాలని మనవి చేస్తున్నాం.

వ్యవస్థలను మేనేజ్‌ చేసిన తీరు పట్ల, వాటిని భ్రష్టు పట్టించిన తీరు పట్ల, ఎదగడానికి వ్యవస్థలను వాడుకుని వాటిని సర్వనాశనం చేసిన తీరు పట్ల వాడవాడనా, వీధి వీధినా తెలుగు ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చంద్రబాబుగారి దౌర్భాగ్యమైన పాలన వల్ల, ఆయన దౌర్భాగ్యమైన పాలసీల వల్ల టీఆర్‌ఎస్‌ వంటి పార్టీలు ఆవిర్భవించిన తీరు పట్ల కూడా చర్చ జరగాలి.

బీసీలకు తెలుగుదేశం పార్టీలో, ఆ హయాంలో జరిగిన అన్యాయం పట్ల కూడా చర్చ జరగాలి. అంతేకాదు తెలుగుదేశం పాలనలో ఎస్సీ ఎస్టీలను దారుణంగా అణిచివేసిన తీరు పట్ల కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

పార్టీ వ్యవస్థాపకుడిని చంపి, ఆ పార్టీని లాక్కున్నటు వంటి చంద్రబాబుగారికి పండుగ చేసుకునే హక్కు కానీ, పండగ చేయాలని కోరే హక్కు కానీ ఉందా?
చంద్రబాబుగారు 40 ఏళ్లు పాలించలేదు. ఆయన కొంతకాలం టీడీపీ తరపున పాలించాడు. రాజకీయాల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి అధికారం సంపాదించాడు.
ఆయన పాలనలో కనీసం ఒక్క సంస్కరణ కూడా చేయలేదు. 40 ఏళ్లలో జరగనటువంటి పరిపాలనా సంస్కరణలు, జగన్‌గారు సీఎం అయిన తర్వాత కేవలం 34 నెలల్లో ఎన్ని జరిగాయన్న దానిపై చర్చ జరగాలి. 40 ఏళ్ల పార్టీ వర్సెస్‌ జగన్‌గారి 34 నెలల పాలనతీరు పట్ల పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలల్లోనే గ్రామ, వార్డు స్థాయిలో సంస్కరణలు తీసుకువచ్చి, ప్రభుత్వ పాలనను ఇంటి గడప వద్దకే చేర్చిన జగన్‌మోహన్‌రెడ్డిగారి పాలనపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి, సంక్షేమ కార్యక్రమాలు వారికి చేరే విధంగా సంస్కరణలు అమలు చేసిన జగన్‌మోహన్‌రెడ్డిగారి పరిపాలన ఎక్కడ? 40 సంవత్సరాల మీ పార్టీలో కొన్నాళ్లు పరిపాలన చేసిన తీరు ఎక్కడ అన్నదానిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది.

దమ్ముంటే చర్చకు రండి:
40 ఏళ్లలో మీరు చేయలేనిది, కేవలం 34 నెలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో మేము చేసిన మేలును నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే చర్చకు రండి. మీరు 40 ఏళ్లలో ఏమీ చేయలేకపోయారు. కానీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 34 నెలల్లోనే అందరికీ ఎంతో మేలు చేసింది. దీనిపై చర్చకు వస్తారా? ఆ ధైర్యం మీకుందా? చంద్రబాబుగారికి సవాల్‌ చేస్తున్నా. కమాన్‌ చర్చకు రండి.

అయినా మీరెక్కడ వస్తారు? శాసనసభకే రావడం లేదు. ఇక మీరు చర్చకు ఏమొస్తారు? మీ అబ్బాయికి బుర్ర ఉన్నా లేకపోయినా సభకు పంపిస్తున్నారుగా. మీకు ధైర్యం ఉంటే, ఆ చర్చకు మీ అబ్బాయిని పంపించండి. మా స్థాయి కాకపోయినా ఈ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం.

పరిపాలన వికేంద్రీకరణ:
44 ఏళ్ల మీ పొలిటికల్‌ ఇండస్ట్రీలో మీరు ఎన్నడూ చేయలేదు. పరిపాలన వికేంద్రీకరణ. రేపు ఉగాది నుంచి కొత్త జిల్లాలు. మొత్తం 26 జిల్లాలు. ఇంకా సుపరిపాలన. ఎన్నికల ప్రచారంలో జగన్‌మోహన్‌రెడ్డిగారు హామీ ఇచ్చారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తున్నారు. ఆ మాట నిలబెట్టుకుంటున్నారు.

మీరు 40 ఏళ్లలో ఏమీ చేయలేదు. జగన్‌గారు ఆ పని చేస్తుంటే, మా కుప్పం పరిస్థితి ఏమిటి? మా బావమరిది బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురం పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు. ఏదేదో గందరగోళం పరిస్థితికి వచ్చారు. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ విధంగా దిగజారిపోయారు. దాన్ని గమనించండి.

ఇంతేకాకుండా పరిపాలన వికేంద్రీకరణ. ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మేము భావించి చేస్తుంటే, అమరావతి అమరావతి అని కేకలేసే దౌర్భాగ్య పరిస్థితికి మీరు దిగజారిపోయారు. దీనిపైనా చర్చ జరగాల్సి ఉంది.

ఎవరి అధికారాలు వారివే:
ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. బాబుగారు అధికారంలో ఉంటే సర్వం ఆయనదే అధికారం. కానీ బాబుగారు అపోజిషన్‌లో ఉంటే, మామీద వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, కోర్టులను తప్పు పడుతున్నారని ఏవేవో మాట్లాడే పరిస్థితికి దిగజారిపోయాడు. కానీ ఆయన అధికారంలో ఉంటే మాత్రం సర్వం అధికారాలు కావాలి. కానీ మేమలా అనడం లేదు.

మాకు సర్వం అధికారాలు కావాలని అనడం లేదు. ఎవరి అధికారాలు వారు సక్రమంగా నిర్వర్తించాలన్నది మా పాలసీ. అది భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఉందన్న విషయాన్ని చంద్రబాబుగారు గుర్తు పెట్టుకోవాలి. దీన్ని మమ్మల్ని విమర్శిస్తున్న వారు కూడా గుర్తు పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. డాక్ట్రిన్‌ ఆఫ్‌ సెపరేషన్‌ ఆఫ్‌ పవర్స్‌. మొన్న శాసనసభలో చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది.

దేశ చరిత్రలోనూ ఎవరూ సాటిరారు:
రాష్ట్ర చరిత్రలోనే కాదు. దేశ చరిత్రలో కూడా మేనిఫెస్టోకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన రాజకీయ పక్షం వైయస్సార్‌ కాంగ్రెస్‌ అని మనవి చేస్తున్నాను. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఉన్నటువంటి వాటిలో 95 శాతం హామీలు, వాగ్దానాలను నెరవేర్చినటువంటి ఏకైక ప్రభుత్వం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అని సవినయంగా మనవి చేస్తున్నాం. అందుకు గర్వపడుతున్నాం కూడా.

మనం చాలా మందిని చూశాం. చివరకు తెలుగుదేశం పార్టీని కూడా చూశాం. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను దాచేసుకున్నారు. ఆ మేనిఫెస్టో చూసి ప్రజలు అడుగుతారని భయపడ్డారు. కానీ మేము మేనిఫెస్టోను ఇంటింటికీ పంపిస్తాం. చెక్‌ చేసుకోమని చెబుతాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్న రాజకీయ పక్షం వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అని చెబుతున్నాం.

డిస్ట్రబ్‌ చేయడమే ఆయన లక్ష్యం:
40 ఏళ్ల టీడీపీ, 34 నెలల వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరుపై మార్చి 29న చర్చ జరగాలి. పరిపాలన వికేంద్రీకరణ జరుగుతోంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. దీన్ని డిస్ట్రబ్‌ చేయాలని చంద్రబాబుగారు కృతిమ ఉద్యమాలు చేస్తున్నారు. మొన్ననే చూశారు. కల్తీ సారా మరణాలంటూ నానా యాగీ చేశారు. మాకు మద్యం పాలసీ స్పష్టంగా ఉంది. క్లారిటీ ఉంది. అయినా చంద్రబాబుగారు నిందిస్తున్నారు.
నిజానికి చంద్రబాబు వైఖరిపై చర్చ జరగాలి. ఎన్టీరామారావుగారు మద్య నిషేధం అమలు చేస్తే, దాన్ని చంద్రబాబు ఎత్తివేశారు. కాబట్టి దానిపైనా చర్చ జరగాలి.

ఏం మాట్లాడుతున్నారు!:
మొన్న ఎవరో చంద్రబాబును శాసనసభ గురించి అడిగితే, సమావేశాలు జరిగాయా? అన్నాడట. అలా పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అంటే ఆయన సభకు రాకపోతే సమావేశాలు జరిగినట్లు కాదా? ఏం మాటలవి?
మీకు తెలుసు. లిక్కర్‌ బ్రాండ్స్‌. ప్రెసిడెంట్‌ మెడల్‌ బ్రాండ్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారి బ్రాండ్‌ అని దుష్ప్రచారం చేశారు. కానీ తవ్వి తీస్తే అవన్నీ చంద్రబాబుగారి బ్రాండ్స్‌. అయినా మా వెంట పడి నిందిస్తున్నారు.

అలాగే పోలవరం ప్రాజెక్టు. దాన్నీ చర్చకు తీసుకొచ్చారు స్పిల్‌వే కట్టకముందే కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి దాంట్లో డబ్బులు కాజేసిన చంద్రబాబు, ఇవాళ ప్రాజెక్టు పనులు జరగడం లేదని జగన్‌గారిని నిందిస్తున్నారు.

ఇంకా కాగ్‌ రిపోర్టు. రూ.48 కోట్ల మేర ఏదో జరిగిందని టీడీపీ నేతలు, యనమల రామకృష్ణుడు మాట్లాడుతున్నారు. వారి హయాంలో ఖజానాను ఊడ్చేశారు. 4 లక్షల కోట్ల అప్పు చేసి మా మీద రుద్ది పోయారు. మేము అవన్నీ తీర్చే ప్రయత్నం చేస్తుంటే, ఈ ప్రభుత్వం అప్పులు చేస్తోందంటూ, అవి పుట్టకుండా బ్యాంకులకు లేఖలు రాస్తున్నారు. అందుకే ఆర్థిక వ్యవస్థపై ఆ శాఖ మంత్రి ఒక ప్రకటన చేస్తారు.

వారికి దిక్కు తోచడం లేదు:
సీఎం జగన్‌మోహన్‌రెడ్డిగారు చిత్తశుద్దితో పరిపాలిస్తున్నారు. అందరికీ మేలు కలుగుతోంది. అందుకే టీడీపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు. ఏం చేయాలో తోచక, సభలో రోజూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. దుర్మార్గ ఆలోచనలతో పని చేశారు.

మీడియా ప్రశ్నలకు జవాబునిస్తూ..
అందుకే అధిక ఆదాయం:
మద్యం మీద ఆదాయాన్ని మేము సంపాదించాల్సిన అవసరం లేదు. అది చంద్రబాబు నైజం. మా పాలసీ ప్రకారం మద్యం విక్రయిస్తున్నాం. మధ్యవర్తులు లేరు కాబట్టి, ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చింది. గతంలో మద్యం అమ్మకాలకు వేలం పాటలు పెట్టేవారు. కానీ ఈ ప్రభుత్వం మధ్యవర్తులు లేకుండా నేరుగా మద్యాన్ని విక్రయిస్తున్నాం. అందుకే ప్రభుత్వ ఆదాయం పెరిగింది. దాన్నీ వారు విమర్శిస్తున్నారు.

ఆయనదే అధికార మదం:
అధికారమదంతో వ్యవహరించింది చంద్రబాబు. అనర్హులకు మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే ఆయన కొడుకుని అందలమెక్కించాడు. చివరకు బోర్లా పడ్డాడు. అందుకే ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారు. లేనిపోని విమర్శలు చేస్తూ, ఏదేదో మాట్లాడుతున్న లోకేష్‌ ఇలా యాక్టివ్‌గా ఉన్నంత కాలం టీడీపీ పతనం ఖాయం. అది ఆ పార్టీ వాళ్లే చెబుతున్నారు.. అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

LEAVE A RESPONSE