– ఆంధ్రాలో ఆర్ధిక సమస్యలు ఉండవట!
– అన్ని పార్టీలూ అధికారంలోకి వచ్చేస్తారోచ్
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఉగాది రోజున చూసే రెగ్యులర్ కామెడీనే ఇది. రొటీన్‌కు భిన్నం ఏమైనా ఉంటుందా అని భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించి చావదు. కాకపోతే.. ఈసారి కాస్తంత రోటీన్‌కు భిన్నమేమిటంటే.. అప్పులతో కునారిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇకపై ఆర్ధిక ఇబ్బందులు ఉండవట. శారదా పీఠం ఉత్తరాధికారి వినిపించిన భవిష్యవాణి అది. పోనీలెండి..ఈ మండువే సవిలో స్వాత్మానందేంద్రుల వారు జగనన్న నెత్తిన ఒక పది టన్నుల హిమక్రీములు పోసినంత చల్లని వార్త చెప్పారు. త్రికాలజ్ఞానులు కదా.. జరిగి తీరుతుందేమో చూద్దాం!
పూర్వం పట్టణాల్లో వేదికలు ఏర్పాటుచేసి, పండితుల చేత ఉగాది రోజున పంచాంగశ్రవణాలు ఏర్పాటు చేయించి, ఆ ఏడాది కలిగే లాభనష్టాలు, ఏర్పడే విపత్తులు, ఆదాయం-రాజపూజ్యాలెంతో పురజనులకు వినిపించేవారు. కొందరు పండితులు ఆలయాల్లో సభావేదికపై నుంచి పంచాంగ శ్రవణం చేస్తే, దానికి పురప్రముఖులు హాజరయి, పండితులు వినిపించిన భవిష్యవాణిలో తమ వాటా ఎంత అని ఉగాది పచ్చడి తింటూ లెక్కలు వేసుకునేవారు.
ఆ సంప్రదాయం రాను రాను తగ్గిపోయి, కొన్ని ప్రాంతాలకే పరిమితమయింది. అలాగే లౌకికవాదం వినిపించే రాజకీయ పార్టీలు కూడా తమ కార్యాలయాల్లో పండితులను పిలిచి, పంచాంగ శ్రవణం ఏర్పాటుచేసే విధానం తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. ఆ తర్వాత దానిని అన్ని పార్టీలూ కొనసాగిస్తున్నాయి. పండితులు ఆ ఏడాది వచ్చే కష్టనష్టాలతో పాటు.. తమను పిలిపించిన పార్టీల భవిష్యత్తు కూడా చెప్పడమే పెద్ద కామెడీ. మరి వీరే అన్నీ డిసైడ్ చేస్తే, ఓటర్లెందుకు? ప్రశాంత్ కిశోర్ లాంటి వ్యూహకర్తలెందుకు? ఈ సర్వేలు, ఎగ్జిట్‌పోల్ ఎందుకన్నది వేరే ప్రశ్న.
సహజంగా సంభావన తీసుకునే పండితులు.. అది ఇచ్చిన వారి మేలు కోరతారు కాబట్టి, వారి క్షేమాన్ని కాంక్షించడంలో తప్పులేదు. కానీ సదరు రాజకీయ పార్టీకి ఈ ఏడాది అంతా శుభమే జరుగుతుందని, ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పడమే జోక్. ఎన్నికలయిన ఏడాది తర్వాత చెప్పే పంచాంగ శ్రవణంలోనూ, పార్టీల పండితులు అదే జోస్యం వినిపించడమే ఇంకో కామెడీ. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంటే.. తమతో పంచాంగం చెప్పించిన పార్టీ.. త్వరలోనే ఎలా అధికారంలోకి వస్తుందని పండిత స్వాములకే ఎరుక.
ఇక ఈ ఉగాదికీ అలాంటి చిత్ర విచిత్రాలే పునరావృతమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పంచాంగ శ్రవణం ఏర్పాటుచేయించిన రాజకీయ పార్టీలు.. యధావిథిగా మళ్లీ అధికారంలోకి వస్తామని, పండితులతో
చెప్పించుకుని మురిసిపోయాయి. అధికార పార్టీవారి వేదికలపై అయితే ఆయా పార్టీలు మళ్లీ అధికారంలోకి వస్తాయని చెప్పడం.. ప్రతిపక్షాలు ఏర్పాటుచేసిన వేదికలపై అయితే పాలకులు ప్రజాగ్రహం చవిచూస్తారని, పాలకులకు ఈఏడాది ఇబ్బందులు తప్పవని.. ఇదే పండితులు సూత్రీకరించిన వైనం బహు విచిత్రం.
గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ ఏర్పాటుచేసిన పంచాంగ శ్రవణం చెప్పిన శ్రీనివాసమూర్తి మాత్రం కొంచెం భిన్నంగా మాట్లాడారు. ఈ ఏడాది కేంద్రంలో ఒక పెద్ద తలకాయ వికెట్ వడిపోతుందని భవిష్యవాణి వినిపించారు. అది ఎవరన్నదీ చెప్పలేదు. అదికూడా చెప్పి ఉంటే సదరు పండితుడి విశ్వసనీయ తేలేది. ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు నిరంకుశ పాలనతో ప్రజాగ్రహం చవిచూస్తాయని చెప్పారు. కేంద్రం.. రాష్ట్రాల
హక్కులు కాలరాస్తోందన్న పండితుడు, అక్టోబర్‌లో రేవంత్‌రెడ్డి ఇక విశ్వరూపం ప్రదర్శిస్తారని జోస్యం చెప్పారు. మరి ఆ మేరకు ఆయనకు, శ్రీనివాసమూర్తి ఫైటింగ్ షెడ్యూలు ఇచ్చారో లేదో తెలియదు.
ఇక సీఎం కేసీఆర్ కొత్త ఏడాదిలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారని, టీఆర్ఎస్ ఆస్థాన పండితుడు బాచుపల్లి సంతోషకుమార్ శాస్త్రి వెల్లడించారు. కర్కాటక రాశికి చెందిన కేసీఆర్ జాతకం.. గతంలో కంటే ఈసారి ఇంకా బాగుందని, ప్రత్యర్ధులు ఇబ్బంది పెట్టినప్పటికీ ఆయనకు ఎలాంటి ఇబ్బందులుండవని చెప్పారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతుందని, ప్రజలు పొదుపు పాటించకపోతే పరిస్థితి శ్రీలంక మాదిరిగా తయారవుతుందని హెచ్చరించారు.
ఇక బీజేపీ ఆఫీసులో పంచాంగ శ్రవణం చేసిన మహేశ్వర శర్మ.. 2028 మే 5 వరకూ మోదీకి తిరుగుండదని, ముచ్చటగా మూడోసారీ ఆయనే ప్రధాని అవుతారని సెలవిచ్చారు. ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొంటుందన్న ఆయన, ఈ ఏడాది దేశంలో ఆహార ధాన్యాలకు లోటు ఉండదన్నారు. ఈ ఏడాది వరదలు వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.
అటు ఏపీలోనూ దాదాపు ఇలాంటి దృశ్యాలే దర్శనమిచ్చాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో ఏర్పాటుచేసిన పంచాంగ శ్రవణంలో ప్రసంగించిన, సర్కారు ఆస్థాన పండితుడు కప్పగంతు సుబ్బరామ సోమయాజీ సహజంగానే ప్రభుత్వాన్ని సంతోషపరిచే వ్యాఖ్యలు చేశారు. ప్రభువుల చల్లని పాలనకు తగ్గట్లే ప్రజలూ హాయిగా ఉంటారు. చాలామంచి పథకాలతో ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యే అవకాశం ప్రభుత్వానికి కలుగుతుంది అని చెప్పారు.
ఇక జగన్ కోసం సర్వశక్తులూ ధారపోసి, తమ తపశ్శక్తితో ఆయన సీఎం అయేందుకు కారణమయిన శారదా పీఠం కూడా.. ఏపీ చల్లగా ఉంటుందని సెలవిచ్చింది. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర వినిపించిన భవిష్యవాణిలో,
ఏపీకి ఆర్ధింగా దిగులుండదని చెప్పారు. కొన్ని ఒడిదుడుకులున్నప్పటికీ రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి బాగుంటుందని జోస్యం చెప్పారు. వేసవి కాలంలో ఎండలు, వర్షాకాలంలో ఎక్కువ వానలు కురుస్తాయని సెలవిచ్చారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుంటుందని శారదా పీఠాధిపతి చెప్పిన చల్లని వాక్కులు… సక్రమంగా జీతాలు రాని ఉద్యోగులు, పనులు చేసి బిల్లులు రాని కాంట్రాక్టర్లకు, గతుకుల రోడ్లపై బతుకుతున్న ప్రయాణికులకు చల్లని వార్త. అంటే చిన్నస్వామి వారు చెప్పిందే నిజమైతే.. అక్కాచెల్లెమ్మల సంక్షేమం కోసం, జగనన్న పోస్తున్న మందు ఆదాయం మరింత పెరిగి, కేంద్రం నుంచి అప్పులు బాగానే పుట్టే అవకాశాలున్నాయన్నమాట. శుభం. ఇన్ని చెప్పిన చిన్నస్వామివారు… రేపు క్యాబినెట్లో ఎవరెవరుంటారో కూడా అదే నోటితో సెలిస్తే బాగుండేదన్నది వైసీపీ భక్తుల కామెంటు.