వైసీపీ నేతల అత్యుత్సాహంలో ఇదో వింత
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు?.. ఇప్పుడు మంత్రులంతా రాజీనామా చేశారు కాబట్టి, నిన్నటి వరకూ కురసాల కన్నబాబు. జగనన్న కూడా ఆయననే వ్యవసాయశాఖ మంత్రిగా నియమించారు. పాపం ఆయన కూడా తనకు కేటాయించిన చాంబరులో కూర్చుని, మూడేళ్లూ సర్కారు వాహనంలోనే తిరిగారు. క్యాబినెట్ సమావేశాలకూ హాజరయ్యారు. మరి ఆయన స్థానంలో టీడీపీకి చెందిన పత్తిపాటి పుల్లారావును, జగనన్న వ్యవసాయశాఖ మంత్రిగా ఎప్పుడు నియమించారు? చిత్తూరు జిల్లా నగరి ైనియోజకవర్గ వెసీపీ నేతలు ఏర్పాటుచేసిన ఫ్లెక్లీ చూస్తే, మెడ మీద తల ఉన్న ఎవరికయినా ఇలాంటి డౌటనుమానాలే వస్తాయి.
నగరి నియోజకవర్గంలో నిండ్ర మండల రైతుభరోసాకేంద్రం కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం ఏర్పాటుచేశారు. దానికి స్థానిక ఎమ్మెల్యే రోజా ముఖ్య అతిథి. ఆ సందర్భంగా స్థానిక వైసీపీ నేతలు.. సహజంగా పదవులు వచ్చిన తమ నేతలను అభినందిసూ,్త ఆ మేరకు రోజా మేడమ్కు కృతజ్ఞత వ్యక్తం చేస్తూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. సరే ఈ ఉత్సాహం సహజమే. ఆ ఫ్లెక్సీల్లో జగనన్నతోపాటు, జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శంకరనారాయణతోపాటు ఇతర అగ్రనేతల ఫొటోలు కూడా పెట్టారు.
మరిక సమస్యేమిటి? అందులో వింతేమిటనుకుంటున్నారా? యస్. వింత ఉంది. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఫొటోకు బదులు, టీడీపీ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన పత్తపాటి పుల్లారావు ఫొటో పెట్టారు. అదే వార్త! వార్తలో వింత!! రోజా మేడమ్ గానీ, ఆమె అనుచరులు గానీ ఈ ఫ్లెక్సీని పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ, సోషల్మీడియా దుర్మార్గులు ఊరకనే ఉండరు కదా? వైసీపీ నేతల గ్రహపాటును గుర్తించి ఆ ఫొటోను వెంటనే సోషల్మీడియాలో పెట్టేశారు. ఇప్పుడది తెగ వైరల్ అవుతోంది. కన్నబాబు ఎలాగూ మాజీ అయిపోయారు కాబట్టి, దీనిగురించి ఆయన పెద్దగా ఫీలవాల్సిన పనిలేదు. ఎటొచ్చీ పుల్లారావుకే మహదానందం. తనను వైసీపీ ఇంకా వ్యవసాయశాఖ మంత్రిగా గుర్తించినందుకు పుల్లన్నకు గంపెడానందం మరి!