Suryaa.co.in

Telangana

8 ఏండ్లుగా ఇంటి స్థలాలు ఇవ్వని సర్కారు

– డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇంకెప్పుడిస్తారు?
-ఏటా పెరుగుతున్న సంపద ఏమవుతున్నది?
– ప్రజలకు చెందాల్సిన సంపద కొద్దిమంది పాలకులు పంచుకుంటుండ్రు
– ప్రజల సొంతింటి కలను నెరవేర్చటం కోసమే పాదయాత్ర చేస్తున్న
– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది సంవత్సరాలుగా నిరుపేదలకు గూడు నిర్మించుకునేందుకు ఇంటి స్థలాలు పంపిణీ చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఇంటి స్థలాలు ఇవ్వని ఈ సర్కారు అవసరమా? ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకై భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శుక్రవారం 21 వ రోజు బోనకల్ మండలం గోవిందపురం(ఏ), మోటమర్రి, మధిర మండలం అల్లినగరం గ్రామాల్లో కొనసాగింది.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వారు ఇచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. ఇంటి స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని పెద్ద మొత్తంలో ప్రజల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ దేశ ప్రజలందరికీ కూడు, గూడు, గుడ్డ కనీస అవసరంగా గుర్తించి వాటిని కల్పించిందని అన్నారు. ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు ఇంటి స్థలాలు పంపిణీ చేశారని వివరించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇంటి స్థలాల పంపిణీ తోపాటు ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణం చేసి పేదలకు ఇచ్చారని గుర్తు చేశారు. సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతున్న పేదలకు సొంతింటి కల నెరవేరకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు బడ్జెట్ పెరుగుతున్న ప్రజల కనీస అవసరమైన ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించక పోవడం ప్రజల పట్ల టిఆర్ఎస్ పాలకులకు ఉన్న చిత్తశుద్ధి బయట పడిందని మండిపడ్డారు.

రూ. 2.56 లక్షల రాష్ట్ర బడ్జెట్ పెరిగిందని ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పటికీ ప్రజల అవసరాలను ప్రభుత్వం ఎందుకు తీర్చడం లేదని ప్రశ్నించారు. సంపద పెరిగినప్పుడు పెరిగిన సంపద ప్రజలకు చెందాలి తప్ప పాలనలో ఉన్న కొద్దిమంది పంచుకోవడానికి కాదన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ఒక్కో ఇంట్లో మూడు, నాలుగు కుటుంబాలు సుమారుగా డజను మందికి పైగా చాలా ఇబ్బందికరంగా జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు.

గ్రామీణ ప్రాంతంలో ఇళ్లు లేని వారిలో దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు చెందినవారు అత్యధికులుగా ఉన్నారని తెలిపారు. వీరి సంక్షేమం ఈ ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. సంక్షేమం అమలుచేయడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉన్నామని ప్రగల్బాలు చెప్పుకునే టిఆర్ఎస్ పాలకులకు ఇండ్లు, ఇంటి స్థలాల సమస్య ఎందుకు కనిపించడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రంలో సుమారుగా 2.92 లక్షల మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని నిధులు మంజూరు చేసినట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి ఆరు సంవత్సరాలు అవుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మాణం చేసి ఎందుకు పంపిణీ చేయలేదని నిలదీశారు. ముందస్తు ఎన్నికల ముందు సొంత జాగా ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలను ఆర్థిక సాయంగా ఇస్తామని ప్రకటించిన టిఆర్ఎస్ పాలకులు గత అసెంబ్లీ సమావేశాల్లో రెండు లక్షల రూపాయలు కుదించి మూడు లక్షలు మాత్రమే ఇచ్చేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించడం ప్రజలను మోసం చేయడంమేనని దుయ్యబట్టారు.

గత 21రోజులుగా తాను పాదయాత్ర చేసిన అన్ని గ్రామాల్లో ఇండ్లు, ఇంటి స్థలాల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. బోనకల్ మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీలో మూడు కుటుంబాలు సుమారుగా డజను మంది చిన్న రేకుల ఇంట్లో అరకొరగా జీవనం కొనసాగిస్తున్నామని తన పాదయాత్రకు ఎదురొచ్చి గిరిజన మహిళ రమ అనే ఆమె తన ఇంటికి తీసుకెళ్లి గోడు వెళ్లబోసుకున్నదని వివరించారు. లక్ష్మీపురంలో గంగమ్మ అనే వృద్ధురాలు వేప చెట్టును ఆవాసంగా చేసుకుని దుర్భరమైన జీవితం గడుపుతున్నదన్నారు.

ఇలా చాలా గ్రామాల్లో ఇల్లు లేక పేదలు పడుతున్నా బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని వారి బాధలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పేద ప్రజల అందరి సొంతింటి కలను నెరవేర్చటం కోసమే తాను పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ఇల్లు, ఇంటి స్థలాల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం కోసం నిర్వహిస్తున్న ఈ పీపుల్స్ మార్చ్ అడుగులో అడుగులు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రోడ్డు వేయించాలని భట్టికి వినతి
బోనకల్లు మండలం గోవిందపురం (ఏ) గ్రామం నుంచి మోటమర్రి గ్రామానికి పంట పొలాలకు వెళ్ళడానికి రహదారి నిర్మించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారికి గోవిందపురం రైతులు విజ్ఞప్తి చేశారు. గోవిందపురం చెరువు కట్ట నుంచి మోటమర్రి గ్రామానికి పాదయాత్రగా వస్తుండగా రైతులు ఎదురొచ్చి తమ సమస్యను వివరించారు. వర్షాకాలం వస్తే ఈ రహదారి గుండా నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని గోడును వెళ్లబోసుకున్నారు.

గుంతల మయంగా రాళ్ళు రప్పలు తేలి, రోడ్డుకిరువైపులా కంపచెట్లతో ఇబ్బందికరంగా ఉన్న ఈ రోడ్డును సీల్పి నేతకు చూపించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం మూడు సంవత్సరాల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ కరోనా సాకుతో నిధులు ఇవ్వలేదని రైతులకు వివరించారు. ఈ సంవత్సరం ఏ సి డి పి నిధులు వస్తాయని, తప్పకుండా రోడ్డు నిర్మాణం కోసం కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఇందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ రోడ్డు వేయించి చరిత్రలో నిలిచిపోవాలని భట్టి విక్రమార్క కు విజ్ఞప్తి చేశారు.

ఆత్మీయంగా పలకరిస్తూ.. సమస్యలను ఆలకిస్తూ…
ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ లో భాగంగా శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు కూడా ఏ గోవిందపురం నుంచి అల్లినగరం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా దారి పొడవునా ప్రజలు ఆత్మీయంగా పలకరిస్తూ వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు, మహిళలు తమ సమస్యలను సీఎల్పీ నేత దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వారి వ్యక్తిగత సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

LEAVE A RESPONSE