– పాలన్నయ్య… నిన్ను కొట్టిన పాపిని క్షమించుడి
-( మార్తి సుబ్రహ్మణ్యం)
కిలారి ఆనందపాల్… అదేనండీ.. ప్రపంచదేశాలలో పలుకుబడి ఉన్న కె.ఏ.పాల్ తెలుసు కదా? అనేక దేశాల అధ్యక్షులతో బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేయగల ఘనుడు. నిమిషాల్లో సొంత ఫ్లెట్ వేసుకుని వెళ్లగల దేవదూత. కాకపోతే ఇప్పుడా స్పెషల్ ఫ్లైటకు పార్కింగ్ ఫీజుకు పైసల్లేక అక్కడే వదిలేశారట. అది వేరే విషయం. పెగ్గా ఎప్పుడంటే అప్పుడు ఏసుప్రభువుతో హాటెలో మాట్లాడగల మహా మహిమాన్వితుడు. పాలన్నయ్య ప్రార్ధనల వల్లే కరోనా పిశాచి పారిపోయిందట.
దేశం- రాష్ట్రం సంక్షోభంలో పడిన సందర్భాల్లో..పాలన్నయ్య ఫోన్ చేస్తే చాలు, ప్రత్యేక విమానాల్లో బయట దేశాలు డబ్బులు కుమ్మరించడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ పాలకులు తమకు డబ్బులిప్పించమని ఆయనను కోరరు. పాలకులు కోరడం లేదు కాబట్టి పాలన్నయ్య కూడా, విమానాల్లో డబ్బులు తీసుకురావడం లేదు. ‘మొన్న ట్రంపు నాకు ఫోన్ చేసి 10 మిలియన్ డాలర్స్ ఇస్తానన్నాడు. నాతో పెట్టుకోవద్దని చెప్పా’నని.. స్వయంగా పాలన్నయ్యే చెప్పినా ఎవరూ నమ్మలేదు. దేశాల మధ్య యుద్ధం ఆపిన ఒంటరి సైనికుడు. అది వేరే ముచ్చట.
ప్రధానులు, ముఖ్యమంత్రులు అంతలావు పెద్దాళ్ల దగ్గరకే నేరుగా ‘వితవుట్ అపాయింట్ మెంట్ ‘ వెళ్లే పాలన్నయ్యను, ఒక టీఆర్ఎస్ సామాన్య కార్యకర్త, లాగిపెట్టి చెంపచెళ్లుమనిపించడం ఏమిటి? ఆ చోద్యాన్ని డీఎస్పీ చూస్తూ ఎంజాయ్ చేయడమేమిటి? తప్పుకదూ?! రోజూ జీసస్ తో లవ్ లో మాట్లాడే పాలన్నయ్యను కొడితే ఏసుప్రభువు ఎంత తల్లడిల్లుతారు? తన బిడ్డపై చేయి చేసుకున్న ఆ పాపిపె కోపం
ఉన్నా, దయామయుడు కాబట్టి క్షమించేయవచ్చు.కానీ కోట్లాదిమంది పాలన్నయ్య భక్తజనం ఊరుకుంటారా?
నిజం. పాలన్నయ్య పై సిరిసిల్ల రాజన్న జిల్లాలో జరిగిన దాడితో యావదాంధ్ర, యావద్దేశం, యావత్ ప్రపంచమే కుమిలి కుంగిపోయి, టన్నుల కొద్దీ కన్నీరు కారుస్తోంది. అజాతశత్రువు, కరోనా పిశాచిని తరిమికొట్టిన దేవదూతను ఒక అనామకుడు చెంపచెళ్లుమనిస్తే.. ఆ వీడియో నెట్టింట రచ్చ చేస్తుంటే, కఠినపాషాణ హృదయం సైతం ద్రవించుకుపోతుంది. పొద్దున నిద్ర లేవగనే ఓడ్కా తాగే తికమనిషి రాంగోపాల్ వర్మనే.. టీవీ లైవ్ షో నుంచి పాలన్నయ్య దెబ్బకు తాళలేక దండం పెట్టి పారిపోయాడు. ఏదో తన మానాన తాను ప్రార్ధన చేసుకుని, మూడవ ప్రపంచయుద్ధం రాకుండా తిరుగుతూ , తన పీస్ మిషన్ ద్వారా ప్రపంచ ప్రజలను తన ముద్దు ముద్దు మాటలతో అలరిస్తున్న ‘మురిపాలన్న’య్యపై, అలా
చేయిచేసుకోవటం మహా పాపం. అంతలావు దేవదూతపై చేయిచేసుకుంటే, ఆ పాపిని చెరబట్టాల్సిన డీఎస్పీ.. అదేదో తనకు సంబంధించిన వ్యవహారం కాదన్నట్లు అటు తిరిగి ఫోన్ చేసుకోవడం దారుణంన్నర.
అసలు పాలన్నయ్య అంటే ఎవరు? పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా ..పవర్ అన్నట్లు.. పాల్ అంటే ఫూల్ అనుకున్నారా? ఫ్యూయల్! దీనజన బాంధవుడు. గత ఎన్నికల్లో సీఎం కావలసినవాడు. కాలం ఖర్మం కలసిరాక, ఆయన ప్రార్ధన ఓటర్లకు అర్ధం కాక ఆ చాన్సు తృటిలో తప్పిపోయింది. ఏపీ ప్రజలకు ఆ అదృష్టం మిస్సయిపోయింది. ఎలాగూ ఏపీ జనం తన మాట వినకపోగా, తనను బ్రహ్మానందం మాదిరిగా
చూస్తున్నారని తేలిపోవడంతో.. పాలన్నయ్య ఇక తెలంగాణ ప్రజలను ఉద్ధరిద్దామని తలచారు. తలచిన వెంటనే గవర్నర్ తమిళడాతో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రజల ఈతిబాధలన్నీ ఆమె వద్ద మొరపెట్టుకున్నారు. ఇక బయట ఉన్న మీడియా ముందుకొచ్చి, తెలంగాణను ఉద్దరించే తక్షణ అవసరం వచ్చిపడిందని చెప్పారు. “తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతిపరుడు. ఎక్క చూసినా ఆయన కుటుంబం,రామేశ్వరరావు ఆస్తులే కనిపిస్తున్నాయి. సీబీఐ, ఈడీ కేసుల ద్వారా కేసీఆర్ త్వరలోనే జైలుకు వెళతారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి నేనే ప్రత్యామ్నాయం. త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తా” నని జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఆ ప్రకారంగా.. బాలకృష్ణ మాదిరిగా టెము, ప్లేసు చెప్పి.. అనుకున్నట్లుగానే.. పాలన్నయ్య ప్రార్ధన చేసి మరీ, తెలంగాణ పర్యటనకు బయలుదేరారు.అప్పటికీ పాలన్నయ్య టీవీ9లో తాను వస్తున్నానని చెప్పి మరీ వెళ్లారట. టీవీ9ని ఫాలో అయి, పాలన్నయ్యకు బందోబస్తు కల్పించకపోవడం పోలీసుల తప్పు. అన్నట్లు గతంలో పాలన్నయ్యకు 8+8 గన్ మెన్లు, జడ్ కేటగిరి సెక్యూరిటీ ఇస్తామని చెప్పిన సర్కారు ఇచ్చిన మాట తప్పింది. అక్కడికీ ‘నాకు జడ్ కేటగిరి, 8+8 గన్ మెన్లు వచ్చేశార’ని పిచ్చి పాలన్నయ్య.. తెలిసిన వారికి, తెలియని వారందరికీ ఫోన్లు చేసిన వీడియో కూడా రిలీజు చేసుకున్నారు.
రైతులను పరామర్శించి, తన ప్రార్ధన ద్వారా వారి కష్టాలు మాయం చేయాలనుకున్న పాలన్నయ్య పె.. సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఓ టీఆర్ఎస్ కార్యకర్త చెంప ఛెళ్లుమనిపించటం కోట్లాదిమంది పాలన్నయ్య భక్తుల గుండె పిండేసింది. సరే పాలన్నయ్య రోజూ ఏసుప్రభువుతో లెలో మాట్లాడతారు కాబట్టి, ప్రభువు చెప్పిన ప్రకారంగా తన చెంపపగలకొట్టిన వ్యక్తిని క్షమించి, దయామయుడి అవతారమెత్తితే ఆయన కలిగియ కరుణామయుడవుతారు. నిజమే.. కళ్ల ముందు తెలంగాణకు తానే సీఎం అవుతున్న లక్ష్యం నెరవేరుతున్నప్పుడు.. ఆఫ్టరాల్ ఈ చెంపదెబ్బలు ఓ లెక్కా ఏంది? ఏసుప్రభువు మాదిరిగా ఆ అవమానాలన్నీ ఆయన తెలంగాణ ప్రజల కోసమే భరిస్తున్నారు.
ఏదేమైనా పాలన్నయ్య తన చెంపవాయించిన వ్యక్తిని మన్నించకుండా, వాడిని జైల్లో పెట్టించకపోతే రాజశేఖర్ రెడ్డికి పట్టిన గతే మీకూ పడుతుందని పోలీసులను శపించకూడదు మరి. తనపై దాడికి చేసిన వారిని మన్నించే పెద్దమనసులో మన జగనన్న తర్వాతే ఎవరయిన! గతంలో విశాఖ ఎయిర్పోర్టులో కోడి కత్తితో తనపై దాడి చేసిన వ్యక్తిని,తాను సీఎం కాగానే ఏదో చోటామోటా పదవి ఇచ్చి క్షమించేసిన జగనన్నను, కిలారి ఆనందపాలన్నయ్య ఆదర్శంగా తీసుకుంటే ఆయన పుణ్యం ఊరకపోదు. ఆ పనిచేస్తే పైనున్న ప్రభువు కూడా మరుసటి రోజు ఫోన్ ఇన్లో పాలన్నయ్యను మెచ్చుకుంటారు. ఇద్దరూ దేవుడిబిడ్డలే కదా మరి?! ఓపాలి ఆలోచించకూడదూ?