Suryaa.co.in

Editorial

కుయ్.. కుయ్.. నయ్.. నయ్!

– శవాలతో అంబులెన్సుల బేరాలు
– శవం తీసుకువెళ్లాలంటే సొమ్ములివ్వాలంతే
– నిన్న తిరుపతి.. నేడు నాయుడుపేట
– జగన్ ఆదేశాలకే దిక్కులేని దుస్థితి
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘మీరు ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లోనే కుయ్ కుయ్ కుయ్ కుయ్ మంటూ అంబులెన్సులు వనన్నాయి’’ ఇది ఈమధ్య గుంటూరులో కొత్త అంబులెన్సుల ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం జగనన్న చెప్పిన మాట.

నిజమే.. ఆ నెంబరుకు ఫోన్ చేస్తే అంబులెన్సులు వస్తున్నాయి. కానీ.. మృతదేహాలను తీసుకువెళ్లేందుకు డ్రైవరు ‘మనీ’ంద్రులు ముందస్తుగా ఫోన్లలోనే కాసుల బేరం చేస్తున్నారు. వేల రూపాయలిస్తేనే శవాన్ని తీసుకువెళతామని ఖరాఖండీగా చెబుతున్నారు. డబ్బులిస్తే ఓకే.. లేకపోతే రూల్సు ఒప్పుకోవని ఫోన్లు పెట్టేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులపై గద్దల్లా వాలి, సర్కారు దవాఖానా చూర్లు పట్టుకుని వేళ్లాడుతున్న అంబులెన్సుల మాఫియారాజ్ డిమాండ్లకు తాళలేని సామాన్యులు.. విధిలేక.. టూవీలర్లపైనే తమ వారిని భుజంపై వేసుకుని, తరలించుకుపోతున్న అమానవీయ ఘటనలకు సర్కారు ఆసుపత్రులు వేదికలవుతున్నాయి. మొన్న తిరుపతి రుయా ఆసుపత్రిలో.. తాజాగా నాయుడుపేటలోనూ ‘షేమ్ టు షేమ్’ దృశ్యాలు దర్శనమిచ్చాయి. ఇది సర్కారు వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

మానవత్వం చిరునామా చెరిగిపోతున్న కాలమిది. మనిషి పోతే నలుగురూ నాలుగు చేతులు వేసి, అంతిమకర్మలు చేసే పుణ్యకాలం మాయమయి.. కాసులిస్తేనే కడపటి చూపు అనే కలికాలం దాపురించిన ముదనష్టపు యుగమిది. మొన్నటికి మొన్న తిరుపతి రుయా ఆసుపత్రిలో అంబులెన్సు మాఫియా ధాటికి తాళలేక, తన కొడుకు శవాన్ని అర్ధరాత్రి టూవీలర్‌పైనే మోసుకెళ్లిన తండ్రి విషాదం చూశాం.

ఆ ఘటన ఇంకా మరువక ముందే.. తాజాగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మృతి చెందిన తన రెండేళ్ల చిన్నారిని.. అంబులెన్సులో తీసుకువెళ్లేందుకు నిరాకరించడంతో, ఓ తండ్రి విధిలేక టూవీలర్‌పైనే శవాన్ని తీసుకువెళుతున్న దృశ్యాలు చూస్తే, కఠిన పాషాణ హృదయాలు సైతం ద్రవించకమానదు. మరి ఇటీవలే.. ‘108కు ఫోన్ చేస్తే 5 నిమిషాల్లోనే కుయ్ కుయ్ కుయ్ మన్న అంబులెన్సు శబ్దాలు ఎక్కడ జగనన్నా’ అన్నది మృతుల కుటుంబాలు సంధిస్తున్న ప్రశ్న.

నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రెండేళ్ల అక్షయ, గ్రావెల్ గుంతలో పడి తీవ్రగాయాలపాలయింది. అన్న శ్రవణ్ కూడా అందులో పడిపోయాడు. అయితే అక్కడున్న గొర్రెల కాపరి

శ్రవణ్‌ను కాపాడాడు. అక్షయ పరిస్థితి విషమంగా ఉండటంతో నాయుడుపేటకు తీసుకువెళ్లారు. అక్కడే ఆ చిన్నారి కనుమూసింది.

చిన్నారి శవాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లాలని ప్రయత్నించిన ఆ తండ్రికి ఆటో డ్రైవర్లు సహకరించలేదు. మేం శవాన్ని తీసుకువెళ్లమని కొందరు, తమకు వేల రూపాయలు కావాలని ఇంకొందరు బేరాలు పెట్టారు. 108 అంబులెన్సు డ్రైవర్లదీ దీ అదే పరిస్థితి. నిబంధనలు ఒప్పుకోవని కొందరు, వేల రూపాయలిస్తేనే శవాన్ని తీసుకువెళ్తామని మరికొందరు బేరాలకు దిగారు.

దానితో.. ఏ భుజాలపై తన బిడ్డను ఆడించి, లాలించి నిద్రపుచ్చాడో… అవే భుజాలపై మోసుకుని కడసారి చూపుకోసం… శాశ్వత నిద్రలో ఉన్న కన్నబిడ్డను తరలించాల్సిన దుస్థితి. బతుకు భారమైన కన్న తండ్రి దురవస్థ.. సుఖనిద్రపోతున్న పాలనా వ్యవస్థకు… పాపం కనుమూసిన చిన్నారి అక్షయ సాక్షీభూతంగా నిలిచింది. వైద్యశాఖ మంత్రిగారూ.. మీకు అర్ధమవుతోందా?

LEAVE A RESPONSE