మాజీలతో తాజా మంత్రుల భేటీ

– కృష్ణా జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఆర్కే రోజా
– కొడాలి,పేర్ని ఏమ్మేల్యేలతో సమావేశం

రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లవుతాయి. నిన్నటి వరకూ మంత్రికి వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే, నేడు హటాత్తుగా మంత్రిగా మారి, ఒకరోజు ముందు తాను వినతిపత్రం ఇచ్చిన మంత్రే మాజీగా మారి, తన ముందు మామూలు ఎమ్మెల్యేగా కూర్చోవచ్చు. ఇలాంటి గమ్మతయిన ఘటన ఒకటి తాజాగా కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.

కృష్ణా జిల్లా కేంద్రం మ‌చిలీప‌ట్నంలో మంగ‌ళ‌వారం ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం క‌నిపించింది. ఏపీ మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణలో చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌గా… అప్ప‌టిదాకా మంత్రులుగా ప‌ద‌వుల్లో కొన‌సాగిన కొడాలి శ్రీవెంక‌టేశ్వ‌ర‌రావు (కొడాలి నాని), పేర్ని వెంక‌ట్రామ‌య్య (పేర్ని నాని)లు మంత్రి ప‌ద‌వులు కోల్పోయారు. అదే స‌మ‌యంలో కృష్ణా జిల్లా ఇంచార్జీ మంత్రిగా రోజా ఎంపిక‌య్యారు.

తాజాగా కృష్ణా జిల్లా ఇంచార్జీ మంత్రి హోదాల‌తో ఆర్కే రోజా మ‌చిలీప‌ట్నం రాగా… ఆమె ఎదురుగా తాజా మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు కూర్చున్నారు. ఈ స‌మావేశంలో జిల్లా నుంచి కొత్త‌గా మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన జోగి ర‌మేశ్ కూడా పాలుపంచుకున్నా… ఆయ‌న రోజాకు ఓ వైపున ఆమెకు కాస్తంత వెనుకాల కూర్చున్నారు. ఈ నేప‌థ్యంలో జిల్లా కొత్త ఇంచార్జీ మంత్రి రోజా ఎదుట ఇద్ద‌రు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు కూర్చున్న దృశ్యం ప‌లువురిని ఆక‌ట్టుకుంది.

Leave a Reply