పోటీ ప్రపంచంలో ఏ దేశానికైనా,రాష్ట్రాలకైనా పెట్టుబడులు, ప్రతిష్టాత్మక సంస్థలు ఊరికే నడుచుకొంటూ రావు. అందుకు అధికారంలో ఉన్న వారి చొరవ, కృషి, పట్టుదల, కార్యాచరణ తోడవ్వాలి. రెండు దశాబ్దాల ప్రస్థానంలో ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా ఎదిగి నేడు ద్విదశాబ్ద ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్న హైదరాబాద్ ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (ఐఎస్ బి) ఏర్పాటు వెనుక ఓ నాయకుడి అసాధారణ పట్టుదల, అసమాన కృషి, దూరదృష్టి ఉన్నాయి. ఆయనెవరో కాదు.. ఆనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు.
దార్శనికతతోపాటు తన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న తపన ఉన్న నాయకత్వం అధికారంలో ఉంటే ఆ రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలేమిటో అర్ధం చేసుకోవాలంటే.. ‘ఐఎస్ బి’ హైదరాబాద్ క్యాంపస్ ఏర్పాటుకు దారితీసిన ఆసక్తికర పరిణామాలను మననం చేసుకోవాలి.
1998లో ప్రపంచంలోని 500 ఫార్చూన్ కంపెనీలు తమ ఉమ్మడి భాగస్వామ్యంలో ఆసియా ఖండంలో ఓ బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయాలని భావించాయి. ఆ తర్వాత ఆసియా ఖండంలోని భారతదేశంలో అనువైన వాతావరణ స్థితిగతులు, మెరుగైన శాంతిభద్రతలు, సహకరించే ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో తమ బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా ఓ నిర్ణయం తీసుకున్నాయి. మెకిన్సే సంస్థకు చెందిన రజత్ గుప్తా, అనిల్ కుమార్‌తో పాటు కొంతమంది విదేశీ ప్రతినిధులను ఓ బృందంగా ఏర్పాటుచేసి వారికి ‘ఇండియన్ బిజినెస్ స్కూల్’ ఏర్పాటు బాధ్యతను అప్పగించారు.
ప్రతిష్టాత్మకమైన ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏర్పాటు ప్రతిపాదన తెరమీదరకు రాగానే హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు దానికోసం పోటీ పడ్డాయి. బిసినెస్ స్కూల్ ప్రతినిధి బృందం కూడా ఆ నాలుగు రాష్ట్రాలలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలనుకొన్నారు. అప్పటికి ‘ఆంధ్రప్రదేశ్’ను వారు కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు తన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి వడివడిగా ముందుకు తీసుకువెళ్లడానికి విశేష కృషి చేస్తున్నారన్న పేరు రాజకీయ వర్గాలలోనే కాక పారిశ్రామిక, వాణిజ్య, విద్యారంగాలలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు ప్రవేశపెట్టిన వినూత్న పథకాలు, వివిధ పథకాలలో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేసి ఫలితాలు రాబడుతున్న తీరు, పెట్టుబడుల్ని ఆకర్షించడానికి అందిస్తున్న రాయితీలు, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అన్ని రంగాలలో ఉపయోగిస్తూ ‘స్మార్ట్ గవర్నెన్స్’తో ముందుకు దూసుకు వెళుతున్న వైనంపై దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, మేధావులు, మీడియా రంగం ఆసక్తితో గమనిస్తున్న సందర్భం అది.
సిఎం చంద్రబాబునాయుడికి ఆలోచనలకు అనుగుణంగా సమర్థులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆయన పేషీలో పనిచేసేవారు. అందులో ఐటీ, బిజినెస్ రంగాలలో చక్కటి అవగాహన కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారి రణదీప్ సుడాన్ దృష్టికి ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏర్పాటు అంశం రాగానే ఆయన ఆ విషయాన్ని సీఎం చంద్రబాబు చెవిన వేశారు. బిజినెస్ స్కూల్ ప్రమోటర్ల తొలి ప్రాధాన్యం ముంబాయి; ఆ తర్వాత బెంగుళూరు. ఈ రెంటిలో ఏదో ఒక చోట బిజినెస్ స్కూల్ పెట్టడానికి వారు మానసికంగా సిద్ధంగా ఉన్నారు. కాగా, అప్పటికే ప్రతిష్టాత్మకమైన పలు జాతీయ సంస్థలను, వ్యాపార సంస్థలను రాష్ట్రానికి రప్పించడానికి కృషి చేస్తున్న చంద్రబాబునాయుడు ఓ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ప్రమోటర్లతో మాట్లాడడం చిన్నతనంగా భావించకుండా ఫోన్ ద్వారా ఇండియన్ బిజినెస్ స్కూల్ ప్రమోటర్లందరితో మాట్లాడారు. హైదరాబాద్ ను కూడా పరిగణనలోకి తీసుకోమని వారిని అభ్యర్థించారు. “మాకు బొంబాయి తొలి ప్రాధాన్యత.. లేదంటే బెంగుళూరు. హైదరాబాద్ గురించి ఆలోచనే లేదు” అని వారు కుండబద్దలు కొట్టినట్లు తేల్చేశారు. కానీ, చంద్రబాబు పట్టువీడలేదు. “మీరు ఏమీ అనుకోకపోతే.. ఒక్కసారి హైదరాబాద్ రండి.. నన్ను కలిసి జస్ట్ టీ తాగి వెళ్లండి.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిక్వెస్ట్ చేస్తున్నా” అంటూ ఎటువంటి బేషజాలు లేకుండా రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని వారిని ఒప్పించడానికి ఒక మెట్టుదిగి బ్రతిమిలాడినట్లుగా కోరారు.
ఇండియన్ బిజినెస్ స్కూల్ ప్రమోటర్లకు అది ఓ కొత్త అనుభవం. వారు అప్పటి వరకు నెగోషియేషన్స్ జరిపింది. ఆయా రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులతోనే. భారతదేశంలో రెడ్ టేపిజం ఎక్కువని, అధికారంలో ఉన్నవారు ఒకటికి పదిసార్లు తిప్పించుకుంటారనే స్థిరపడిన అభిప్రాయానికి భిన్నంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా తమకు ఫోన్ చేసి ‘టీ’కి రమ్మని ఆహ్వానించడంతో వారు కాదనలేకపోయారు. అయితే, ఓ షరతు మాత్రం పెట్టారు. “మేము వస్తాం. మీ ఆతిధ్యాన్ని స్వీకరిస్తాం. కానీ, మీ దగ్గరే ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్న గ్యారంటీ మాత్రం ఇవ్వం” అన్నారు. చంద్రబాబు అందుకు సరేనన్నారు.
హైదరాబాద్ కు వచ్చిన బిజినెస్ స్కూల్ ప్రమోటర్లను ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకోవడానికి సీఎం చంద్రబాబు తన క్యాబినెట్ లోని ఇద్దరు మంత్రులను ఎయిర్ పోర్టుకు పంపారు. మంత్రుల స్వాగత సత్కారం స్వీకరించిన బిజినెస్ స్కూల్ ప్రమోటర్ల బృందం అక్కడి నుండి నేరుగా జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంకు వెళ్లారు.రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పెట్టుకొన్న చంద్రబాబు ప్రోటోకాలను పక్కన పెట్టి వారికి ఎదురేగి పుష్పగుచ్చాలు అందించి, శాలువాలుకప్పి సాదరంగా వారిని లోపలికి తీసుకువెళ్లారు. సీఎం చంద్రబాబు స్వయంగా గరిటె పట్టి ప్రతినిధులందరికీ బ్రేక్ ఫాస్ట్ వడ్డించి ‘అతిధి దేవోభవ’ అన్న భారత సంప్రదాయాన్ని వారికి రుచి చూపించారు.
ఆ తర్వాత చంద్రబాబు తన నివాసంలోనే ఓ అరగంటపాటు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రతినిధి బృందానికి తన విజనన్ను ఆవిష్కరించారు. హైదరాబాద్ ప్రత్యేకతలను, అభివృద్ధిపథంలో రాష్ట్రం ఏవిధంగా ముందుకు సాగుతున్నదో గణాంకాలతో సహా వివరించారు. “ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేస్తే మీరు అందించే రాయితీలు ఏమిటి?” అని ఆ ప్రతినిధులు చంద్రబాబును సూటిగా అడిగారు. “మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఆ ప్రభుత్వాలు ప్రతిపాదించిన రాయితీలకంటే మేము ఎక్కువ ఇస్తాం. ప్రోత్సాహకాలతో పాటు అనుమతులలో ఎటువంటి జాప్యం ఉండదు. అనుకొన్న సమయంలో నిర్మాణం పూర్తి చేసుకొని మీ కార్యకలాపాలు మొదలుపెట్టుకోవచ్చు” అని చంద్రబాబు చెప్పడంతో బిజినెస్ స్కూల్ బృందం సంతృప్తితో తిరుగు ప్రయాణం అయింది.
ఇది జరిగిన కొన్ని రోజులకే హైదరాబాద్లో ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏర్పాటు ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. “ఐఎస్ మిని హైదరాబాద్ లోనే నెలకొల్పాలన్న మా నిర్ణయానికి కారణం రాష్ట్రాభివృద్ధి పట్ల ఈ ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి, తపన, దూరదృష్టి మాకు నచ్చాయి. ప్రభుత్వం అప్రోచ్ అద్భుతంగా ఉంది” అని ఐఎస్ బి ప్రతినిధి బృందం మీడియా ద్వారా దేశ ప్రజలందరికీ స్పష్టం చేశారు.
నిజానికి మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయి శివారు ప్రాంతంలో అత్యంత ఖరీదు చేసే 250 ఎకరాలను బిజినెస్ స్కూల్ కు ఇవ్వజూపింది. అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరు నగరానికి సమీపంలోనే 250 ఎకరాలు ఇస్తామన్నది. చివరకు హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో 260 ఎకరాల స్థలంలో ఐఎస్ బి ఏర్పాటయింది. ఐఎస్ బికి స్టాంపుడ్యూటీ మినహాయింపుతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు
కల్పించడంపై ఆనాడు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు చంద్రబాబుపై అనేక ఆరోపణలు చేశారు. అదో స్కామ్ అని నిందించారు. కొందరు నాయకులు ఈ ప్రాజెక్టును నిలుపుదల చేయడానికి న్యాయస్థానంలో కేసు వేశారు. కానీ, అన్ని అంశాలను విచారించిన కోర్టు చాలా స్పష్టంగా “ఇట్ ఈజ్ నాట్ ఎ ప్రాఫిట్ మేకింగ్ ఇన్స్టిట్యూట్. ఓ మంచి ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పొరపాటు, అధికార దుర్వినియోగం ఏమీ లేదు” అని చాలా స్పష్టంగా చెప్పింది. ఐఎస్ బి ఏర్పాటుపై వచ్చిన ఆరోపణల్ని తిప్పికొడుతూ చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ఓ శ్వేతపత్రం విడుదల చేశారు. పలు వేదికల నుంచి కూడా వివరణ ఇచ్చారు.
కొసమెరుపు ఏమంటే, హైదరాబాదు ‘ఐఎస్ బి’ రాకుండా చేయడానికి ఇక్కడ కొందరు కాంగ్రెస్ నేతలు అడ్డుపడగా.. ఆ సమయంలో మహారాష్ట్రలో, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చెందిన కొందరు నేతలు ‘ఐఎస్ బి’ని సాధించలేకపోయిన తమ రాష్ట్ర ముఖ్యమంత్రుల అసమర్ధతను బాహాటంగా విమర్శించారు. చంద్రబాబు చూపిన చొరవ ఆంధ్రప్రదేశ్ కు మేలు చేసిందని కొన్ని జాతీయ పత్రికలు సంపాదకీయాలు రాశాయి. అంతేకాదు.. చంద్రబాబు వంటి ముఖ్యమంత్రి తమకు లేకపోవడం తమ దురదృష్టం అంటూ ఆ రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్షనేతలు వ్యాఖ్యానించడం అప్పట్లో ఓ సంచలనం.
1999లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఐఎస్ బి హైదరాబాద్ క్యాంపసకు పునాదిరాయి పడింది. 2001లో నాటి దేశ ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయిని ఆహ్వానించి
ఆయన చేతుల మీదుగా సీఎం చంద్రబాబు సమక్షంలో ఐఎస్ బి హైదరాబాద్ క్యాంపస్ ప్రారంభోత్సవ
వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ రెండు దశాబ్దాల కాలంలో ఐఎస్ బి హైదరాబాద్ క్యాంపస్ ప్రపంచంలోనే ఓ అగ్రగామి విద్యాసంస్థగా, హైదరాబాదు తలమానికంగా నిలిచింది.
అసాధ్యాలను సుసాధ్యం చేయడం గొప్ప నాయకులకే సాధ్యం అంటారు.’ఐఎస్ బి హైదరాబాద్ క్యాంపస్’ ఇందుకు ఓ చక్కని ఉదాహరణ.
(మే 26న ‘ఐఎస్ బి’ ద్విదశాబ్ది వేడుకలు ప్రారంభం)
– విక్రమ్ పూల, సీనియర్ జర్నలిస్ట్