-శ్రీలంక తరహాలో కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనతో తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తుకునే దుస్థితి
-రైతులు, యువకులు, ఉద్యోగులు, కార్మికులుసహా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
-కేసీఆర్ చేసిన ద్రోహాన్ని, మోసాలపై బీజేపీ సాగిస్తున్న మహోద్యమంలో భాగస్వాములు కండి
-పేదల ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి తోడ్పాటు అందించండి
-నరేంద్రమోదీ ఆధ్వర్యంలో మరో 20 ఏళ్లు దేశంలో అధికారంలో ఉండటం ఖాయం…
-తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
-బీజేపీ అధికారంలోకి వస్తే అమర వీరుల కుటుంబాలకు తగిన గౌరవం కల్పిస్తాం
-సెక్రటేరియట్ లో అమర వీరుల స్థూపాన్ని నిర్మిస్తాం
-సెక్రటేరియట్ సహా జిల్లా కేంద్రాల్లోనూ అంబేద్కర్, పూలే విగ్రహాలను ఏర్పాటు చేస్తాం
– అమరుల యాదిలో… ఉద్యమకారుల ఆకాంక్షల సాధన సభలో బండి సంజయ్ …
-పుప్పాల రజనీకాంత్ సహా పలువురు వరంగల్ జిల్లా నేతలు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిక
బండి సంజయ్ మాట్లాడుతూ…
‘‘తెలంగాణ ప్రజలారా… ఎన్నో పోరాటాల చేసిన చరిత్ర మీది. కేసీఆర్ కుటుంబం చేసిన మోసాలను కళ్లారా చూశారు. ఆయన తెలంగాణకు తలపెట్టిన ద్రోహాన్ని ఉద్యమకారుల ద్వారా విన్నారు.. ఇంకెన్నాళ్లు భయపడతారు.. ఇకనైనా మేల్కొండి. బీజేపీ సాగిస్తున్న మహోద్యమంలో భాగస్వాములు కండి. పేదల ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి తోడ్పాటు అందించండి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగర శివారులోని తట్టి అన్నారం ‘జే కన్వెన్షన్’ లో బీజేపీ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలక్రిష్నారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘అమరుల యాదిలో… ఉద్యమ ఆకాంక్ష సాధన సభ’ జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పలువురు నాయకులు, కేసీఆర్ ఉద్యమ సహచరులు ఈ సభకు హాజరై ప్రసంగించారు. కేసీఆర్ చేసిన మోసాలను ఎండగట్టారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ సభలో ఉద్యమ కారుల ప్రసంగాలను ఆసక్తిగా విన్న బండి సంజయ్ అనంతరం మాట్లాడుతూ… కేసీఆర్ పై నిప్పలు చెరిగారు. అనంతరం వరంగల్ కు చెందిన పలువురు నాయకులు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగ పాఠం వివరాలు…
ఎవరైతే తెలంగాణకు ద్రోహం చేశారో… వారి ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభుత్వం తెలంగాణ ఉత్సవాలు చేసుకుంటోంది. అదే సమయంలో నిజమైన తెలంగాణ ఉద్యమకారులతో కలిసి జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభ నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది.
కేసీఆర్ ఏం సాధించారని తెలంగాణ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ తీరును చూసి నవ్వుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించిన బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల క్రితమే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమించిన చరిత్ర ఉంది. బీజేపీ ఏనాడో ఒక ఓటు-రెండు రాష్ట్రాలు పేరిట తీర్మానం చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటు చేయాలన్నదే జన సంఘ్ లక్ష్యం.
బీజేపీకీ మీడియాను మేనేజ్ చేయడం తెలియదు. లక్ష్య సాధన కోసం తెగించి కొట్లాడటమే బీజేపీ సిద్ధాంతం. ప్రొఫెసర్ శేషగిరిరావు, సీహెచ్.విద్యాసాగర్ రావు, కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ సహా నాతోపాటు ఎంతోమంది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని ఉద్యమించిన చరిత్ర బీజేపీదే. తెలంగాణ వస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో, ప్రభుత్వ కార్యాలయాల మీద సెప్టెంబర్ 17న జాతీయ జెండాను ఎగరేసేందుకు పోరాటాలు చేసి గాయపడి, జైలుకు వెళ్లిన సంఘటనలు కోకొల్లలు.
బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో యాడ ఉన్నడని టీఆర్ఎస్ నేతలు సొల్లు మాటలు చెబుతున్నరు. టీఆర్ఎస్ లాగా దొంగ ఉద్యమాలు, దొంగ దీక్షలు చేసే వ్యక్తిత్వం నాది కాదు.. గంట సేపు కూడా దీక్ష చేయకుండా తప్పతాగి కేసీఆర్ చేసే దీక్షలు తన వల్ల కాదు… తెలంగాణ పోరాటంలో పబ్లిసిటీతో పనిలేకుండా నిఖార్సైన ఉద్యమం చేసిన చరిత్ర నాది. నాతోపాటు బీజేపీ నాయకులు, ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారుల పోరాట పటిమను చూసిన తరువాతే సుష్మాస్వరాజ్ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చి రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ పరుల పాలైంది. కేసీఆర్ కుటుంబం గుప్పిట్లో బందీ అయ్యింది. ఉద్యోగుల గోస వర్ణణాతీతం. ప్రమోషన్లు లేవు. 317 జీవో పేరుతో ఉద్యోగులపై కక్ష తీర్చుకుంటున్నడు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నరు. చివరకు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకున్నరు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తే నాకు కేటీఆర్ లీగల్ నోటీస్ ఇచ్చిండు. నేను లీగల్ నోటీసుకు భయపడను. కేటీఆర్ ఐటీశాఖ మంత్రిగా ఉండటంవల్లే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నరు. తెలంగాణ ఉద్యమం చేస్తున్న నటించి మంత్రి పదవులు పొందిన కేటీఆర్ లాంటి వాళ్లకు భయపడే ప్రసక్త లేదు. సీఎం కుటుంబం నిర్వాకంవల్లే ముమ్మాటికీ 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయిన మాట ముమ్మాటికీ వాస్తవం.
తెలంగాణ రాకముందు వడ్ల కుప్పలపై ఏనాడూ రైతులు గుండెపోటుతో చనిపోలేదు.. కేసీఆర్ పాలనలో రైతులు వడ్ల కుప్పలపై పడి చనిపోతున్నరు. ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నరు. నిజమైన తెలంగాణ ఉద్యమకారులను భయభ్రాంతులకు గురిచేస్తూ కేసులు పెడుతున్నరు.
ఏ పదవుల కోసమో తెలంగాణ కోసం ఉద్యమించలేదు. గంజి తాగినమో..గట్కా తిన్నమో తెల్వదు.. తెలంగాణ సాధనే లక్ష్యంగా పోరాడినం. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ కుటుంబం దండుపాళ్యం ముఠా లెక్క రాష్ట్రాన్ని దోచుకుంటున్నది.
భాష, యాసతో ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపి నిజమైన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు సాకారం చేసేందుకే బీజేపీ మలిదశ పోరాటం చేస్తోంది. కేసీఆర్ కుటుంబం కోసమా? తెలంగాణ తెచ్చుకుంది. ఆనాటి తెలంగాణ ఉద్యమకారులంతా ఈనాడు బీజేపీలోనే ఉన్నరు. తెలంగాణ తల్లి పార్టీ పెట్టిన విజయశాంతి, నవ తెలంగాణ పెట్టిన దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్, యువ తెలంగాణ పార్టీ పెట్టిన జిట్టా బాలక్రిష్ణారెడ్డి సహా అందరూ బీజేపీలోనే కొనసాగుతున్నరు.
రజాకార్లకు వ్యతరేకంగా ఉద్యమించి ప్రాణాలు కోల్పోయిన వాళ్లున్నరు. తొలిదశ తెలంగాణ పోరులో ఎంతోమంది అసువులు బాసిండ్రు. అయినా తెలంగాణ వచ్చినంక తెలంగాణ ప్రజలను అణిచివేసిన నిజాం సమాధి వద్దకు వెళ్లి మోకరిల్లిన నీచుడు కేసీఆర్… ఆనాడే కేసీఆర్ ను నిలదీయకుండా కుహానా లౌకిక శక్తులు ఎందుకు మౌనంగా ఉన్నాయో సమాధానం చెప్పాలి. నిజాం ముందు మోకరిల్లిన టీఆర్ఎస్ పాలన కావాలా? తెలంగాణకు స్వాతంత్ర్యం తీసుకొచ్చి భారత్ లో అంతర్భాగం చేసిన సర్దార్ వల్లభాయిపటేల్ ముందు మోకరిల్లిన బీజేపీ పాలన కావాలా ప్రజలు తేల్చుకోవాలి?
తెలంగాణ ప్రజలారా… ఎన్నో పోరాటాల చేసిన చరిత్ర మీది. ఇంకెన్నాళ్లు భయపడతారు.. దరువు ఎల్లన్న వంటి ఎందరో కళాకారులను బీజేపీలోకి ఆహ్వానించాను. కాషాయ జెండా పట్టి కాలుకు గజ్జె కట్టి ప్రజలను చైతన్యం చేస్తున్న వ్యక్తి దరువు ఎల్లన్న.
ముఖ్యమంత్రి కేసీఆర్ బరి తెగించి ఉన్నడు. కొంచెమైనా సిగ్గు, శరం, ఇంగిత జ్ఝానం లేదు. కుటుంబ పాలన సాగిస్తూ దోచుకుంటున్నడు. తెలంగాణకు ముందు ధనిక రాష్ట్రం మనది. ఇయ్యాల 4 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి ప్రజల చేతికి చిప్ప ఇచ్చిండు. ఒక్కో వ్యక్తి తలపై లక్షకుపైగా అప్పు భారం మోపిండు.
తెలంగాణను అభివ్రుద్ది చేయాలనే తపన, ఆకాంక్ష ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉంది. కానీ కేంద్రానికి తెలంగాణ ఏమాత్రం సహకరించడం లేదు. రహదారుల విస్తరణకు, సంక్షేమ పథకాల అమలుకు సహకరించడం లేదు. పేదలకు ఉచితంగా 5 కిలోల బియ్యం ఇస్తుంటే… వాటిని అమ్ముకుంటూ పేదల సొమ్ము కాజేస్తున్న నీచుడు కేసీఆర్…
కేసీఆర్ పాలనలో సర్పంచులు ఉన్న ఆస్తులను అమ్ముకుని బికారిగా మారిపోతున్నరు. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ ప్రభుత్వం వాడుకుంటున్నది. ఎన్నికలొస్తే.. కారు గుర్తుకు ఓటేస్తేనే స్థానిక సంస్థలకు నిధులిస్తామని చెప్పి ఓట్లు దండుకున్న కేసీఆర్ ఆ స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. కేసీఆర్ వల్ల సర్పంచులు ఉపాధి కూలీలుగా మారిన దుస్థితి. చివరకు ఉపాధి కూలీలకు ఇవ్వాల్సిన సొమ్మును కూడా సక్రమంగా చెల్లించకుండా వారిని మోసం చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్…
రైతును కోటీశ్వరుని చేస్తానన్న కేసీఆర్ తన పాలనలో వడ్ల కుప్పలపై ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి తీసుకొచ్చిండు. వడ్ల కొనుగోలు రాజకీయం చేస్తూ కేంద్రాన్ని బదనాం చేస్తున్నడు. రైతులకు వాస్తవాలు అర్ధమైందని తెలిసి దేశ పర్యటన పేరుతో కేసీఆర్ మరో డ్రామా చేస్తున్నడే తప్ప రైతులను బాగు చేయాలనే ఆలోచనే లేకపోవడం సిగ్గు చేటు.
కేసీఆర్ వేసిన బిశ్వాల్ కమిటీయే లక్షకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెబితే… పట్టించుకోలేదు. నిరుద్యోగ భ్రుతి ఊసే లేదు. తెలంగాణ వల్ల ఎవరికి ఒరిగింది? క్రిష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు 575 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా 277 టీఎంసీలకే ఒప్పుకుని తెలంగాణకు తీరని ద్రోహం చేసిన కేసీఆర్ చంద్రబాబు ఇచ్చిన డబ్బులకు కక్కుర్తిపడి దక్షిణ తెలంగాణ ఎడారిగా మార్చిన నీచుడు. కాళేశ్వరం పేరుతో వేల కోట్ల కమీషన్లు దండుకున్నరే తప్ప అదనంగా ఎకరాకు కూడా సాగునీరివ్వలేదు.
తెలంగాణ ఉద్యమకారులంతా ప్రశ్నిస్తుంటే.. వాళ్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నడు. ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకుని మంత్రి, ఇతరత్రా పదవులిచ్చిండు. కేసీఆర్… ఇక నీ ఆటలు సాగవు.. కేంద్రంలో మాదిరిగానే తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం… డబుల్ ఇంజిన్ సర్కార్ తో తెలంగాణ అభివ్రుద్ధి తథ్యం.
కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ కుటుంబానికి పంచుతున్నారే తప్ప… ప్రజలకు అందడం లేదు. నరేంద్రమోదీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలతో 18 రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉన్నరు. నిన్న సిమ్లాలో మోదీ వల్ల తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందాయని.. టాయిలెట్ల నిర్మించారని.. కేంద్ర సంక్షేమ ఫలాలు అందాయని లబ్దిదారులంతా చెబుతున్నరు. ఎవరివల్ల 18 రాష్ట్రాల్లో లబ్ది పొందుతున్నారో… అలాంటి పాలన రావాలని తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారు.
ఒకే కుటుంబం సాగిస్తున్న అవినీతి పాలనతో శ్రీలంక అల్లాడుతోంది. అక్కడి ప్రజలు బిచ్చమెత్తుకుంటున్నరు. అక్కడి ప్రజలు తిరగబడి శ్రీలంక మంత్రులను బట్టలిప్పి తరిమితరిమికొడుతున్న ద్రుశ్యాలు మనం కళ్లారా చూశాం… తెలంగాణాలోనూ కేసీఆర్ కుటుంబం సాగిస్తున్న అవినీతితో ప్రజల చేతికి చిప్పనిచ్చే పరిస్థితిని కల్పించారు.
తెలంగాణలో ఉద్యమ కారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా… నీళ్లు-నిధులు-నియామకాల నినాదం సాకారం కావాలన్న బీజేపీ అధికారంలోకి రావాల్సిందే…. లేనిపక్షంలో కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు బతికే పరిస్థితి లేదు.
మరో 20 ఏళ్ల వరకు దేశంలో బీజేపీ ఆధ్వర్యంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కొనసాగడం ఖాయం…. రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో వస్తేనే తెలంగాణ ఉద్యమ కారుల ఆకాంక్షలు సాకారమవుతాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు తప్పనిసరిగా తగిన గౌరవం కల్పిస్తాం. సెక్రటేరియట్ లో తెలంగాణ అమర వీరుల స్థూపాన్ని నిర్మిస్తాం… సెక్రటేరియట్ తోపాటు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలె విగ్రహాలను ఏర్పాటు చేస్తాం.
అందులో భాగంగా కేసీఆర్ కుటుంబ పాలనను గద్దె దించేందుకు, కేసీఆర్ నియంత పాలనను తరిమి కొట్టేందుకు, పేదల ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ సాధనే లక్యంగా బీజేపీ సాగిస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని కోరుతున్నా…
ముఖ్యమంత్రి పదవి కోసం, సంపాదన కోసం కేసీఆర్ చేసిన మోసాలను, ద్రోహాలను తెలుసుకున్న ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలి. అన్ని పార్టీలు అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజలు ఒక్కసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరుతున్నా.