Suryaa.co.in

Telangana

అమాయక రైతులపై అమానుష చర్యలా?

-దొంగల్లా గోడదూకి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి కిడ్నాప్ చేస్తారా?
– థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ రాక్షసానందం పొందిన సీఐ, సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలి
-ఆయా పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేసి సీసీ టీవీ పుటేజీని స్వాధీనం చేసుకోవాలి
-బాధ్యులైన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
-చట్ట, న్యాయ పోరాటం చేస్తాం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

ల్యాండ్ పూలింగ్ పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం భూములను సేకరించడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపిన వరంగల్ జిల్లా పెరుమాండ్ల గూడెం గ్రామానికి చెందిన కుమ్మరి సామాజికవర్గానికి చెందిన మురళి, నిరంజన్, శ్రీనివాస్ లను పోలీసులు అర్ధరాత్రి ఇంటిగోడ దూకి దొంగల మాదిరిగా కిడ్నాప్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది.

అమాయకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత అమానుషం. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ వీడియో తీయడం… ఆ వీడియోను టీఆర్ఎస్ నేతలకు చూపిస్తూ రాక్షస పొందడం హేయనీయం.
సీఐ ఫోన్ చేసి బాధితులను ఎన్ కౌంటర్ చేస్తానని బెదిరించడం.. రౌడీ షీట్ ఓపెన్ చేసి జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తానంటూ భయభ్రాంతులకు గురిచేయడం దారుణం. బాధితుల కుటుంబ సభ్యులను ఉద్దేశించి పచ్చి బూతులు తిడుతూ సభ్యసమాజం తలొంచుకునేలా వ్యవహరించడం సిగ్గు చేటు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ సీఐ విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఐ భరత్ లను తక్షణమే సస్పెండ్ చేయాలి. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. పోలీస్ స్టేషన్ లో సీసీ టీవీ పుటేజీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపిన అమాయకులపై అమానుషంగా వ్యవహరించిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్ట, న్యాయపరంగా పోరాటం చేస్తాం.

ఇప్పటికే పార్టీ జిల్లా నాయకుల బ్రుందం ఆ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి వాస్తవాలను సేకరిస్తోంది. రేపు పార్టీ రాష్ట్ర శాఖ లీగల్ సెల్ బ్రుందం జిల్లాలో పర్యటించి వాస్తవాలను తెలుసుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతుంది.టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించే గొంతులను నొక్కివేసేందుకు పోలీసుల ద్వారా సీఎం కేసీఆర్ చేస్తున్న అమానుష చర్యలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. కేసీఆర్ ప్రభుత్వ తీరును ప్రజస్వామ్యవాదులంతా రాజకీయాలకు అతీతంగా ముక్త కంఠంతో ఖండించాలని కోరుతున్నా.కేసీఆర్ అవినీతి-కుటుంబ-నియంత పాలనకు చరమగీతం పాడేందుకు బీజేపీ సాగిస్తున్న మహోద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నా.

బాధితులకు ధైర్యం చెప్పిన బండి సంజయ్- న్యాయం జరిగేదాకా అండగా ఉంటామని హామీ
మరోవైపు రైతుల పట్ల వరంగల్ పోలీసుల అమానుష చర్య తన ద్రుష్టికి వచ్చిన వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు బాధితులు మురళి, నిరంజన్, శ్రీనివాస్ లతో ఫోన్ లో మాట్లాడారు. జరిగిన ఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు పోలీసులు అర్ధరాత్రి తమ ఇంటి గోడదూకి కిడ్నాప్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తీరును వివరిస్తూ వాపోయారు. వారికి ధైర్యం చెప్పిన బండి సంజయ్ న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకునే దాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE