Suryaa.co.in

Andhra Pradesh

జల్లయ్య అంత్యక్రియలకు వెళుతున్న నేతల అరెస్టులను ఖండించిన చంద్రబాబు

-ఆసుప్రత్రి నుంచి మృతదేహాన్ని ఎక్కడికి తరలించారో కుటుంబ సభ్యులకు కూడా చెప్పరా?
-మృతునికి సొంత గ్రామంలో దహన సంస్కారం చేసే అవకాశం కూడా బంధువులకు ఇవ్వరా?
-ఒక్క మాచర్లలోనే 5 గురు బిసిలను హత్య చేశారు
-హత్యల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి హస్తం – ప్రత్యేక కోర్టు పెట్టి నిందితులకు ఉరిశిక్ష వెయ్యాలి
– టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు

అమరావతి:- తెలుగు దేశం పార్టీ నేతలు, మాజీ మంత్రులను పోలీసులు వరుసబెట్టి అరెస్టులు చెయ్యడంపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మండి పడ్డారు. పల్నాడు జిల్లాలో హత్యకు గురైన కంచర్ల జల్లయ్య అంత్యక్రియలకు వెళుతున్న నేతలను అరెస్టు చెయ్యడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు పోతుంటే ఆపలేని పోలీసులు…అంత్యక్రియలకు వెళుతున్న వారికి ఆపడం, అరెస్టులు చెయ్యడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్త చనిపోతే….కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు ఎక్కడ ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. సొంత గ్రామం జంగమేశ్వరపాడులో అంత్యక్రియలు జరిపే అవకాశం కూడా లేకుండా జల్లయ్య మృతదేహాన్ని పోలీసులు తరలించడం అమానవీయం అని చంద్రబాబు అన్నారు.

కనీసం మృతదేహాన్ని ఎటుతరిలిస్తున్నారో కూడా కుటుంబ సభ్యులకు చెప్పారా అని ప్రశ్నించారు. హత్యలతో వైసిపి నేతలు కిరాతకంగా వ్యవహరిస్తే….అక్రమ అరెస్టులతో పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పల్నాడును వల్లకాడు చేస్తున్నారని…మూడేళ్లలో ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే 5 గురిని హత్య చేశారని, వందలమందిపై దాడులు చేశారని అన్నారు. వైసిపి హత్యాకాండలో మాచర్లలో బలయ్యింది అంతా బిసిలే అని…5 గురిలో నలుగురు ఒక్క యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం అన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రోద్భలంతోనే హత్యలు జరుగుతున్నాయని…ఈ హత్యాకాండపై స్పెషల్ కోర్టు పెట్టి విచారణ చేసి నిందితులకు ఉరి శిక్షవెయ్యాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE