– గడపకు గడపకూ ప్రభుత్వం పేరుతో వైసీపీ
– నిఘా నీడలో ‘గడపగడపకు ప్రభుత్వం’
– ఎమ్మెల్యేల పనితీరుపై సర్కారు డేగ కన్ను
– ప్రభుత్వ విజయాల ప్రచారంతో జనంలోకి వైసీపీ ఎమ్మెల్యేల పాదయాత్రలు
– జనం నిలదీతతో నీళ్లు నములుతున్న ఎమ్మెల్యేలు
– నేటి నుంచి చంద్రబాబు బస్సుయాత్రలు ప్రారంభం
– దసరా నుంచి జనసేనాధిపతి పవన్ బస్సుయాత్రలు
– తిరుపతి నుంచి పవన్ సమరభేరి
– ఏడాదిలో 80 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన
– జిల్లా మహానాడుతో క్యాడర్‌ను కలవనున్న చంద్రబాబు
– పవన్ కాన్వాయ్‌లో కొత్త కార్లు
– ప్రభుత్వ వ్యతిరేకత పెంచేపనిలో టీడీపీ-జనసేన
– రోడ్‌షో, బహిరంగసభలతో జనంలోకి చంద్రబాబు, పవన్
– యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటున్న టీడీపీ, జనసేన
– అందరి లక్ష్యం అధికారసాధనే
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయినా పార్టీల ‘ముందస్తు’ పరుగు. అందరికంటే ముందుండాలన్న తపన. ప్రత్యర్ధులను ఓడించాలన్న ‘ముందస్తు’ వ్యూహాలు. అందుకే ఒకరికి మించి మరొకరు జనక్షేత్రంలోకి ముందుగా దూకేందుకు సిద్ధమవుతున్నాయి. మూడేళ ్ల అధికార ప్రస్థానంలో జనాలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తుచేసేందుకు అధికార వైసీపీ.. మూడేళ్ల జగన్ పాలనలో రాష్ట్రానికి అంటిన మరకలు, అప్పులు, అరాచకాలను మళ్లీ గుర్తు చేసేందుకు విపక్ష టీడీపీ, జనసేన అధినేతలు జనక్షేత్రంలో కలియతిరగనున్నారు.
ఇప్పటికే అధికార వైసీపీ ‘గడపకు గడపకు ప్రభుత్వం’ పేరుతో జనక్షేత్రంలో ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ మూడేళ్లలో తాము చేసిన అభివృద్ధి వివరిస్తూ, జనం తలుపు కొడుతున్నారు. ఇంకో చాన్సివ్వాలని అభ్యర్ధిస్తున్నారు. ఇప్పటివరకూ సంఘటనల ఆధారంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ.. ఇకపై ఏడాది పాటు జనక్షేత్రంలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఏకబిగిన ఏడాది పాటు జనంలోనే ఉండే కార్యక్రమాలు ఖరారు చేశారు. 15వ తేదీ నుంచి ఆయన అనకాపల్లి నుంచి సమరశంఖం పూరించనున్నారు.
ఇక జనసేనాధిపతి పవన్ కల్యాణ్ దసరా నుంచి తిరుపతి వెంకన్న పాదాల నుంచి బస్సుయాత్ర ప్రారంభించనున్నారు. అందుకాయన తన కాన్వాయ్ కోసం ఆరేడు కొత్త వాహనాలు కూడా సమకూర్చుకున్నారు. చంద్రబాబు, పవన్.. ఇద్దరూ రోడ్‌షోలు, బహిరంగసభలతో జనాలకు దగ్గరయే మార్గాలు ఎంచుకున్నారు. ఇలా ఎన్నికలకు రెండేళ్ల ముందే పొలిటికల్‌వార్‌కు తెరలేచింది.
ఏపీ రాజకీయ మేఘాలు ‘ముందస్తు’ దిశగా పయనిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయన్న అంచనాలతో విపక్షాలు తమ రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. విపక్షాల దూకుడుకు అడ్డుకట్టవేసేందుకు, అధికార వైసీపీ ‘సంక్షేమపథకాల బ్రేకులు’ వేస్తోంది. సామ, దాన, బేధ, మాయోపాయాలతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే వ్యూహాలకు ఊపిరిపోస్తోంది. ప్రభుత్వ యంత్రాంగ దన్నుతో ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్న పార్టీ ఊపు తగ్గకుండా ఉండేందుకు, ప్రతి ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జిలను జనం మధ్యలోనే ఉంచే ప్రణాళికను, జగన్ విజయవంతంగా అమలు చేస్తున్నారు. సోషల్‌మీడియా అస్త్రంగా.. విపక్షాల వైఫల్యంతోపాటు, వారిపై మానసిక యుద్ధం చేస్తోంది.
గత ఆరు నెలల వరకూ నిస్తేజంగా ఉన్న ప్రధాన విపక్షమైన టీడీపీ, ఇప్పుడు మహానాడు సక్సెస్‌తో సమరోత్సాహంతో వైసీపీని ఢీకొనేందుకు సిద్ధమవుతోంది. రాయలసీమలో వైసీపీ నుంచి వలసలు ప్రారంభం కావడం టీడీపీని ఉత్సాహపరుస్తోంది. ఇక జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఆరునెలల పాటు జనంలో ఉండనున్నారు. ఏపీ రాజకీయాల్లో ఏకైక ‘క్రౌడ్‌పుల్లర్’ అయిన పవన్ కల్యాణ్.. తన పార్టీని బలోపేతం చేయడంతోపాటు, వారిని జనంలోనే ఉంచే కార్యక్రమాలకు ఊపిరిపోశారు. యూత్-కాపు కార్డుతో జగన్ సర్కారుపై బాణం గురిపెట్టిన పవన్, ప్రతీ నియోజకవర్గంలో బహిరంగసభ నిర్వహించనున్నారు.
మళ్లీ అధికారమే లక్ష్యంగా జగన్ అడుగులు
వైసీపీ దళపతి, ఏపీ సీఎం ఈసారి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తన యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు. అందుకు తన ముందున్న అని మార్గాల్లోనూ పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ మూడేళ్లలో సాధించిన ప్రగతిని వివరిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో ప్రతిరోజూ ‘గడప గడపకూ ప్రభుత్వం’ పేరుతో పాదయాత్రలు చేయిస్తున్నారు. ఫలితంగా ఎన్నికలకు ముందే పార్టీ జనంలో నిరంతరం ఉండేలా చూడటమే జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఎమ్మెల్యేల కార్యక్రమాలపై నిఘా
‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకున్న జగన్.. ఆ కార్యక్రమ తీరుతెన్నులు, జనస్పందన, పార్టీ నేతలు ప్రజలకు ఇస్తున్న సమాధానాలు, హాజరవుతున్న రోజులు తదితర అంశాలపై పార్టీ, ప్రభుత్వ, సొంత మీడియా వేగులతో నివేదికలు తెప్పించుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో జరిగిన సమావేశంలో, ఆ నివేదికల ఆధారంగానే జగన్ ప్రోగ్రెస్ రిపోర్టు వెల్లడించారు. ప్రధానంగా ఇంటలిజన్స్, పీకే టీమ్‌తోపాటు తన సొంత మీడియా దళాలను జగన్ వేగులుగా వినియోగించుకోవడంతో, పలు కోణాల్లో నివేదికలు వ స్తున్నాయి. దాని ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
వైసీపీకి వాలంటీర్లే బలం
ప్రధానంగా ప్రజల్లో జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆదరణ కనిపిస్తోంది. ఏడాదికి ఒక్కో కుటుంబం సగటున, 75 వేల నుంచి లక్షరూపాయలు లబ్ధిపొందుతోంది. ముఖ్యంగా పెన్షన్లు అందరికీ అందుతుండటంతో వృద్ధులు, ప్రభుత్వ పనితీరుపై సంతృప్తితో ఉన్నారు. ఇక జగన్ కొత్తగా ప్రారంభించిన వాలంటరీ వ్యవస్థ, వైసీపీ సర్కారుకు తిరుగులేని బలంగా కనిపిస్తోంది. ‘వాలంటీర్లు ఒక అవసరం’గా మార్చిన జగన్, వారి నుంచే కీలకమైన నివేదికలు తెప్పించుకుంటున్నారట. పథకాల కొనసాగింపు-తొలగింపులో ఇప్పుడు వారే ప్రధానంగా మారారు. సూటిగా చెప్పాలంటే ఎమ్మెల్యేలకంటే వాలంటీర్లకే ఎక్కువ అధికారాలున్నాయి. కొన్ని సంఘటనలు మినహాయిస్తే, వాలంటరీ వ్యవస్థ జగన్‌కు ఒక ఆయుధంగా మారింది.
ఒకవైపు సంక్షేమ కోణంలో అడుగులు వేస్తూనే.. మరోవైపు రాజకీయ కోణంలో, రాజకీయ ప్రత్యర్ధుల శక్తియుక్తులను నిర్వీర్యం చేసే వ్యూహాలకూ వైసీపీ పదునుపెడుతోంది. అందుకు పోలీసులతోపాటు, సోషల్‌మీడియానూ ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. గత ఆరునెలల క్రితం వరకూ విపక్షాలు ఆందోళన చేసేందుకే భయపడ్డాయంటే, ప్రభుత్వ యంత్రాంగంపై వైసీపీ ఎంత పట్టుసాధించిందో, ప్రత్యేకి ంచి చెప్పాల్సిన పనిలేదు. సీఐడీని విస్తృతంగా వాడటంతో, ప్రతిపక్ష నేతలు సర్కారుపై విమర్శలు కురిపించే ధైర్యం చేయలేకపోయారు.
గడపగడపకూ గండమే..
అయితే ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, లబ్థిదారులకే నేరుగా డబ్బులిస్తున్నా, ప్రజల్లో సంతృప్తి శాతం పెరగకపోవడం వైసీపీ నాయకత్వాన్ని కలవరపరుస్తోంది. గడపగడపకు ప్రభుత్వంలో వస్తున్న ఎమ్మెల్యేలను జనం నిలదీస్తుంటే, నీళ్లు నమలాల్సిన దుస్థితి. ప్రజల్లో ఆశలు పెరిగిపోవడమే దానికి ప్రధాన కారణం. మరోవైపు పన్నులు పెంచడం, వైసీపీ నేతల విచ్చలవిడితనం, అనేక చోట్ల మితిమీరిన రౌడీయిజం, భూకబ్జాలతో జగన్ ఇమేజీకి డామేజీ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఒకచాన్సు ఇచ్చిన తటస్తులు, విద్యావంతులు, యువకులు ఇప్పుడు పాలనపై ప్రతికూలంగా ఉన్నారు.
సొంత సామాజికవర్గంలో సెగ
ముఖ్యంగా గత ఎన్నికల్లో జగన్ విజయానికి కీలకపాత్ర పోషించిన ఉద్యోగులు, ఇప్పుడు అదే పార్టీని ఓడించేందుకు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న వాస్తవ పరిస్థితి. వీటికిమించి.. వైసీపీ క్యాడర్‌లో తమకేమీ
జరగడం లేదన్న అసంతృప్తి ప్రమాదకరంగా కనిపిస్తోంది. గతంలో కమ్మ సామాజికవర్గం టీడీపీ సర్కారుపై అసంతృప్తితో ఉన్నట్లే.. ఇప్పుడు రెడ్డి సామాజికవర్గం కూడా వైసీపీపై అంతే అసంతృప్తితో ఉంది. రెడ్డి వర్గం గతంలో కమ్మవర్గం మాదిరిగా కులాభిమానంతో సొంత పార్టీకి ఓట్లు వేసినా, తమ ప్రభావం ఉన్న ప్రాంతాల్లోని వారితో ఓట్లు వేయించకుండా, మౌనంగా ఇంట్లో కూర్చునే పరిస్థితి కనిపిస్తోంది.
బిల్లుల పెండింగ్‌లో అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైసీపీ
గత టీడీపీ సర్కారు తన పార్టీ నేతలు చేసిన పనులకు బిల్లులు ఆపినట్లే, ఇప్పుడు వైసీపీ సర్కారు కూడా తన పార్టీ నేతలు చేసిన బిల్లులు నిలిపివేసింది. ఈ దృష్ట్యా.. గత ఎన్నికలో పోలింగ్ రోజున ముందు, టీడీపీ నేతలు తమ ఓట్లు వేసుకుని ఇంట్లో కూర్చున్నట్లే.. రేపు వైసీపీ నేతలు కూడా తమ ఓట్లు తాము వేసుకుని, మౌనపాత్ర పోషించే అవకాశాలున్నట్లు వారి మాటల్లో స్పష్టమవుతోంది. మరి ఈ ప్రమాదాన్ని జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలి.
అటు టీడీపీ-జనసేన అధిపతులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న సోషల్‌మీడియా వింగ్ , జగన్ అమ్ములపొదిలో ఓ ప్రధాన అస్త్రమే. టీడీపీ-జనసేన ఏకం కాకుండా ఉండేలా, వైసీపీ సోషల్‌మీడియా చేస్తున్న మైండ్‌గేమ్ చాలాసార్లు సక్సెస్ అయింది. వైసీపీ సోషల్‌మీడియా ట్రాప్‌లో టీడీపీ-జనసేన పడ్డాయంటే, సోషల్‌మీడియాను ఏ స్ధాయిలో వైసీపీ వాడుకుంటుందో స్పష్టమవుతోంది.
ఆ జిల్లాల్లో పూర్తి వ్యతిరేకత
ప్రశాంత్ కిశోర్ టీం సిఫార్సు ప్రకారం.. రానున్న ఎన్నికల్లో దాదాపు 70 మంది సిట్టింగులకు, మళ్లీ టికెట్లు ఇవ్వరన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ, సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఉనికి కొనసాగించేందుకు పట్టుదలతో పనిచేస్తున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. గుంటూరు, కృష్ణా, ప్రశాశం, ఉభయ గోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నట్లు సమాచారం.
మీడియా ప్రభావంతో జనంలో పెరుగుతున్న వ్యతిరేకత
చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు కార్యకర్తలపై నియంత్రణ కోల్పోయిన ఫలితంగా, పార్టీకి అప్రతిష్ఠ వస్తోందన్న నివేదికలు వైసీపీ నాయకత్వానికి వెళ్లాయి. అగ్రనేతల లెక్కలేనితనం, అధికారం ఉందన్న అహంకారంతో ఉన్మాద చ ర్యలు, పార్టీ నేతల కులాభిమానం, ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత, కాపుల ఆగ్రహం తదితర అంశాలు మాత్రమే వైసీపీకి ఇప్పుడున్న ప్రధాన సమస్య. అన్ని పదవులూ రెడ్లకే ఇస్తున్నారని, వారి కాకపోతే మతం మారిన క్రైస్తవ నేతలకు ఇస్తున్నారన్న భావన ఇతర కులాలలో బలంగా నాటుకుపోయినట్లు వారి మాటల్లో స్పష్టమవుతోంది. ప్రధానంగా మీడియాలో వస్తున్న కథనాలు,
సోషల్‌మీడియాలో వీడియోలతో చూస్తున్న నిజాలతో.. వైసీపీ ప్రతిష్ఠ మసకబారేందుకు కారణమవుతోంది. విజయసాయిరెడ్డి, కొడాలి నాని, వంశీ, రోజా వంటి ఎమ్మెల్యేల అసభ్య పదజాలం, పోలీసులపై వైసీపీ నేతల దౌర్జన్యకాండ, వైసీపీ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ కార్యకర్తల తిరుగుబాటు దృశ్యాలు జగన్‌పై తటస్తులు, విద్యావంతుల్లో ఉన్న ఇమేజీని దారుణంగా డామేజీ చేస్తున్న విషయం గ్రహించకుండా, వాటిని ప్రోత్సహిస్తున్న జగన్ వైఖరి అగ్రనేతలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘గత ఎన్నికల్లో మేం తటస్తులు, విద్యావంతులు, యువకులు, ఉద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చాం. కానీ ఇప్పుడు కొందరు ఎమ్మెల్యేలు-ఎంపీలు చేస్తున్న దిగజారుడు ప్రకటనలతో వారంతా దూరమయ్యే ప్రమాదాన్ని జగన్‌గారు ఎందుకు గ్రహించడం లేదో మాకూ ఆశ్చర్యంగా ఉంది’ని ఉత్తరాంధ్రకు చెందిన ఓ మాజీ మంత్రి వాపోయారు. ఏ పార్టీకీ చెందని తటస్తుల మనోభావాలు గ్రహించకపోతే అంతా మునిగిపోతామన్న ఆందోళన, చాలామంది ఎమ్మెల్యేలలో వ్యక్తమవుతోంది.
చేసిన అభివృద్ధి చెప్పుకోరేం?
ప్రధానంగా సీఎం జగన్ పర్యటనలకు వచ్చిన ప్రతిసారి షాపులు మూయించి, జనాలను గంటలకు గంటలు నిలిపివేస్తున్నార న్న ప్రచారం క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. ఇప్పటివరకూ ఏ సీఎం ఈవిధంగా వ్యవహరించలేదని జనం చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా.. ఈ మూడేళ్లలో పేద, మధ్య, సామాన్య తరగతి, మైనారిటీ వర్గాలకు అందించిన సంక్షేమ ఫలాలను ప్రచారం చేయకుండా.. విపక్షాలపై రోజూ విమర్శలు చేయడం వల్ల, ఇన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రచారం మూలనపడేందుకు కారణమయిందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘గతంలో టీడీపీ వాళ్లు చేసిందే ఇప్పుడు మేమూ చేస్తున్నాం. ఇంత ఆర్ధిక క్లిష్ట పరిస్థితిలో కూడా మేం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. మా ప్రభుత్వం వల్ల ఒక్కో కుటుంబం సగటున లక్ష రూపాయలు లబ్దిపొందుతోంది. అవి ప్రచారం చేయకుండా రోజూ చంద్రబాబును, పవ న్‌ను విమర్శించడం వల్ల వచ్చే లాభమేమిటో మాకు అర్ధం కావడం లేదని’ ఓ మంత్రి వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేలు, నాయకులకు అపాయింట్‌మెంట్లు ఇవ్వరా?
కాగా పార్టీ అధినేత, సీఎం జగన్ తమకు అపాయింట్‌మెంట్లు ఇవ్వని అవమానకర పరిస్థితిపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, సీనియర్లలో అసంతృప్తి పెరుగుతోంది. గతంలో కాంగ్రెస్, టీడీపీల్లో గౌరవ మర్యాదలందుకున్న వీరంతా,ప్రస్తుత అవమానకరపరిస్థితిపై ఆగ్రహంతో ఉన్నారు. ‘రాజకీయాల్లో ఎవరైనా గౌరవం కోసమే పనిచేస్తారు. డబ్బు కోసం కూడా పనిచేయవచ్చు. సీఎంను ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు కలవడం ఓ సంప్రదాయం. మేం ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్, కిరణ్, కోట్ల, చెన్నారెడ్డి లాంటి సీఎంలను చూశాం. వారితో కలసి అనేక సందర్భాల్లో టిఫిన్లు, భోజనాలు చేశాం. కానీ జగన్ మాదిరిగా మమ్మల్ని ఎవరూ అవమానించలేదు. ఏదైనా సమస్య ఉంటే సీఎంకు చెప్పుకోవడం రివాజు. కానీ మేం సీఎంఓలో అధికారులకు చెప్పుకునేంత దారుణమైన పరిస్థితికి చేరాం. ఇది మంచి సంప్రదాయం కాద’ని మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకూ వాపోయే పరిస్థితి కనిపిస్తోంది.
జనంలోకి.. ‘పడి’లేచిన ‘పసుపుదళం’
తన పార్టీ కార్యాలయంపై వైసీపీ దళాల దాడి తర్వాత మేల్కొన్న టీడీపీకి, తాజా ఒంగోలు మహానాడు
టానిక్‌గా మారింది. పార్టీ ఆఫీసుపై దాడి తర్వాత అప్రమత్తమైన టీడీపీ పరిస్థితి, ఈ మూడేళ్ల పాటు విషాదంగా ఉండేది. ఓటమి తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలుగా గెలిచినవారంతా పలాయనం చిత్తగించారు. దానితో నియోజకవర్గాల్లో పార్టీ అనాధగా మారిన విషాదం.
నిరాశ నుంచి ఆశ వైపు…
ఉన్నవారిపై కేసులు, దాడులు, ఆస్తుల స్వాధీనం వంటి చర్యలతో వైసీపీ, తెలుగుతమ్ముళ్లను భీతావహులను చేసింది. టీడీపీ మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి నాయకత్వం అభయమిస్తున్నా, క్షేత్రస్థాయిలో వైసీపీపై పోరాడే సేనాని కరవు. ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు జంప్. గంటా శ్రీనివాస్ లాంటి ఎమ్మెల్యేలు, అసలు పార్టీలో ఉన్నారో లేరో తెలియని గందరగోళం. నియోజకవర్గ ఇన్చార్జి పదవులు మాకొద్దంటూ తప్పించుకుని తిరిగిన పరిస్థితి. లోకేష్ సారథ్యంలో పార్టీ భవిష్యత్తేమిటన్నది అగ్రనేతల ఆందోళన. ఇదీ గత కొద్దినెలల క్రితం వరకూ ప్రధాన విపక్షమైన టీడీపీ శిబిరంలో కనిపించిన వాస్తవ దృశ్యం.
దాడితో పెరిగిన వేడి
అయినా కాడికిందపడేయని అధినేత చంద్రబాబు నింపిన మనోస్థైర్యం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలే నేడు తెలుగుతమ్ముళ్లను, వైసీపీతో యుద్ధానికి సన్నద్ధమయ్యేలా చేసింది. ప్రధానంగా పార్టీ ఆఫీసుపై వైసీపీ దళాల భౌతిక దాడుల తర్వాత, టీడీపీ కార్యకర్తల్లో పట్టుదల పెరిగింది. కమ్మవర్గంలో మునుపటి చీలిక స్థానే ఏకీకరణ పెరిగింది. కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేస్తున్న కేసులు గెలుస్తుండటం, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో వ్యతిరేకత, వైసీపీ సర్కారు అవినీతిని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేందుకు, సోషల్‌మీడియాను తిరుగులేని అస్త్రంగా సంధించిన టీడీపీ కష్టానికి తగిన ప్రతిఫలం, ఒంగోలు మహానాడు విజయం ద్వారా దక్కింది. మహానాడుకు వైసీపీ సర్కారు ఆటంకాలు సృష్టించకపోతే టీడీపీలో ఆ జోష్ కనిపించేది కాదన్నది స్పష్టం.
మూడేళ్ల క్రితం వరకూ.. నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు మాకొద్దని తప్పించుకున్న నిరాశాపూరిత పరిస్థితి నుంచి, తమకే ఇవ్వాలంటూ బస్సులేసుకుని పార్టీ ఆఫీసు ముందు బలప్రదర్శన చేసే ఆశావహ పరిస్థితి ఏర్పడింది.
లోకేష్‌పై అగ్రనేతల్లో తొలగిన అనుమానాలు
కాగా మూడేళ్ల క్రితం వరకూ లోకేష్ నాయకత్వంపై ఎవరికీ పెద్ద ఆశ కనిపించేది కాదు. ఆయన ఫోన్లు తీయరని మాజీ మంత్రులే చెప్పేవారు. కానీ, ఈ మూడేళ్లలో మారిన ఆయన పనితీరు, ఆహార్యం, ప్రసంగాల తీరు, ఎదురుదాడి, వివిధ ఘటనలపై స్పందన వంటి అంశాలపై లోకేష్ వ్యవహారశైలి చూసిన అదే అగ్రనేతలు, ఇప్పుడు ఆయన పనితీరును మెచ్చుకుంటున్నారు. ‘హ్యూమన్‌టచ్ విషయంలో మా సార్ కంటే లోకేష్ చాలా బెటర్‌గా కనిపిస్తున్నారు. ఆ విషయంలో మేమే పొరపాటు పడ్డాం. మా సార్ మాదిరిగా ఆ పిల్లాడు ఏదీ నాన్చడు. తేల్చేస్తాడు. జనంలోకి వెళ్లిన తర్వాత ఆ అబ్బాయి చాలా నేర్చుకున్నాడు. మేం కోరుకున్నది కూడా అదే’నని గోదావరి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
పార్టీ ఆఫీసును ప్రక్షాళన చేస్తారా?
‘ పార్టీ కార్యాలయ వ్యవస్థను మార్చాలి. జీతగాళ్లకు పెత్తనం ఇవ్వకూడదు. ఇప్పుడు పార్టీ బాబుగారి కంటే లోకేష్ ఆదేశాల ప్రకారమే నడుస్తోంది. మాలాంటి నేతలకు గౌరవం తగ్గిపోతోంది. ఆఫ్టరాల్ పార్టీ కార్యకర్తల శిక్షణ ఇచ్చిన ఒక ట్రైనీ మాకు సూచనలిస్తున్నాడు. అతనికున్న రాజకీయ అనుభవమేమిటి? మా స్థాయేమిటి? సార్, లేదా లోకేష్ ఆదేశాలు లేకుండా ఒక గుమాస్తా స్థాయి వ్యక్తి మమ్మల్ని శాసించగలరా? రాజకీయాల్లో ఉన్న వారు గౌరవం కోరుకుంటారు. పెద్ద సార్ చెప్పినవేమీ అమలుచేయడం లేదన్న ప్రచారం జరుగుతోంది. లోకేష్‌బాబు తమకు ఇంకా ఆదేశాలివ్వలేదని ఆఫీసు సిబ్బంది మా ముందే బాబుగారికి చెబుతున్న పరిస్థితి మంచిదికాద’ని మరో మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
నేతలతో నారా వన్‌టు వన్
కాగా పార్టీ శ్రేణుల్లో మహానాడు విజయోత్సాహం కొనసాగించే లక్ష్యంలో భాగంగా.. పార్టీ అధినేత చంద్రబాబు ఈనెల 15వ తేదీ నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. చోడవరంలో మహానాడు నుంచి ప్రారంభం కానున్న చంద్రబాబు యాత్ర, వచ్చే ఏడాది వరకూ కొనసాగనుంది. ప్రతి జిల్లాలో జరిగే మినీ మహానాడుకు బాబు హాజరుకానున్నారు. ఏడాదిలో దాదాపు 80 నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతలతో స్వయంగా వన్‌టు వన్ భేటీ అయేందుకు సిద్ధమవుతున్నారు.
ఈసారి తగ్గేదేలేదంటున్న పవన్ కల్యాణ్
బీజేపీ చేతిలో పరాభవం పాలయిన నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటడం అనివార్యమైన నేపథ్యంలో, జనసేనాధిపతి పవన్ ఈసారి ఎక్కువకాలం జనం మధ్యలో ఉండే షెడ్యూల్ రూపొందించుకున్నారు. బీజేపీ తనను సీఎంను చేయదన్న విషయం తేలిపోవడంతో, పవన్ సొంత దారిలో పయనించేందుకు సిద్ధమవుతున్నారు. మొన్నటి వరకూ బీజేపీ రోడ్డుమ్యాప్ కోసం చూస్తున్నానన్న పవన్, ఇప్పుడు తన సొంత రోడ్డుమ్యాప్‌లో వెళుతున్నారు. ఒకవైపు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చోడవరం నుంచి జగన్‌పై యుద్ధం ప్రారంభిస్తుంటే, మరోవైపు వైసీపీ నుంచి ముప్పేట దాడులు ఎదుర్కొంటున్న పవన్, దసరా నుంచి తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి జగన్‌పై యుద్ధం మొదలుపెట్టనున్నారు.
ఆ మేరకు తన ఆరు నెలల కార్యక్రమాలు ఆయన ఖరారు చేసుకున్నారు. ఈ ఆరు నెలల్లో 175 నియోజకవర్గాలూ చుట్టిరావాలన్నది పవన్ ప్లాన్. ఇటీవల ఆయన తన పర్యటనల కోసం ఆరేడు కొత్త వాహనాలు కూడా ఖరీదు చేశారు. అదే విధంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక బహిరంగసభ నిర్వహించనున్నారు.
కులబలం కలిసొస్తుందా?
ప్రధానంగా రాయలసీమలో బలిజ, కోస్తాలో కాపుల బలంతోపాటు, కొత్త ఓటర్లే లక్ష్యంగా పవన్ పర్యటనలు ఉండనున్నాయి. అధికార వైసీపీపై కాపుల్లో తీవ్రస్థాయిలో ఉన్న వ్యతిరేకతను, అనుకూలంగా మార్చుకోవడం మరొక లక్ష్యంగా కనిపిస్తోంది. ముందు తన పార్టీ సొంత బలం పెంచుకోవడం ద్వారా, పొత్తులపై… ‘పైచేయి’ సాధించవచ్చన్న మరో వ్యూహం కూడా పవన్ పర్యటనలో లేకపోలేదు.
నిజానికి బీజేపీతో కలసి వెళ్లాలన్న పవన్ ఆలోచన, తానే సీఎం కావాలన్న కోరికను బీజేపీ దళపతి నద్దా, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ దారుణంగా తొక్కివేసిన తర్వాత, పవన్ ఒక స్పష్టతకు వచ్చారని జనసైనికులు చెబుతున్నారు. రాష్ట్రంలో బలంలేని బీజేపీ తనపై ఆధారపడుతూ, తనను సీఎంను చేసేందుకు నిరాకరించడం ఆయన ఇగోను దెబ్బతీసిందంటున్నారు. అందువల్ల తన బలమేమిటో నిరూపించేందుకే ఆయన, రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారంటున్నారు.
పవన్ ఆ ధైర్యం చేస్తారా?
అయితే పవన్ తన రాజకీయ సలహాదారులను మార్చుకుని, ప్రస్తుత రాజకీయాలపై, రాష్ట్ర పరిస్థితిపై అవగాహన ఉన్న వారిని నియమించుకోవడం మంచిదంటున్నారు. పవన్‌కు జనంలో ఇమేజ్ ఉన్నప్పటికీ, దానిని ఓట్ల రూపంలో మార్చుకునే స్ధాయి నాయకులు గానీ, యంత్రాంగం గానీ, సరైన వ్యూహబృందం గానీ లేకపోవడమే మైనస్ పాయింటని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన పక్కన ఉన్న వారిని మార్చి కొత్త దళంతో వెళితేనే పవన్ సక్సెస్ అవుతారన్నది జనసైనికుల ఉవాచ. మరి ఆయన అంత ధైర్యం చేస్తారా లేదా అన్నది చూడాలి.
కాగా జగన్ సర్కారుపై.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మరింత పెంచటంతోపాటు, సొంత పార్టీని విస్తృతపరిచేందుకూ పవన్ బస్సుయాత్ర దోహదపడనుంది. ఇటీవలి కాలంలో జగన్ సర్కారుపై.. తనదైన విరుపులతో విమర్శనాస్త్రాలు సంధించిన పవన్ పర్యటన తర్వాత, ఏపీ పాలిటిక్స్ మరింత హీటెక్కెడం ఖాయం.