Suryaa.co.in

Andhra Pradesh

కంకిపాడులో అక్రమ క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు

– డీజీపీకి తెదేపా నేత వర్లరామయ్య లేఖ

కంకిపాడులో గోవా తరహా క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించిన శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన డీజీపీకి లేఖ రాశారు. లేఖలో రామయ్య ఏమన్నారంటే…

వైసీపీ నాయకుల మద్దతుతో రాష్ట్రంలో కొంతమంది అక్రమంగా జూదం, క్యాసినో కల్చర్ ను ప్రోత్సహిస్తున్నారు. 2022 జనవరిలో కొడాలి నాని గుడివాడలో నిర్వహించిన అక్రమ కాసినోపై అనేక ఫిర్యాదులు సమర్పించాం.కానీ, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

గుడివాడ క్యాసినో నేరస్థులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లే కంకిపాడులో 2022 జూన్ 22న మరో క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించారు.మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో పేరుతో నిర్వాహకులు టాలీవుడ్, బాలీవుడ్ డ్యాన్స్ లతో పాటు లైవ్ షోల ఆటాపాటలతో కాక్‌టెయిల్‌ డిన్నర్‌లతో ఆహ్వాన ప్రకటనలు చేశారు.ప్రసారమాధ్యమాల్లో, సోషల్ మీడియాలలో ప్రజల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో ఈవెంట్‌కు అనుమతి లేదని పోలీసులు కార్యక్రమాన్ని రద్దు చేశారు.

ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అనుమతులు జారీ చేయడం అత్యంత శోచనీయం. గుడివాడ అక్రమ క్యాసినో నిర్వాహకులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లే అధికార వైసీపీ నాయకులు ఒక వర్గం పోలీసు అధికారులతో కుమ్మక్కై ఇలాంటి క్యాసినోలు నిర్వహించేందుకు ధైర్యం చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.

ఇల్లీగల్ గేమింగ్ లతో, పేకాటలతో, అశ్లీల నృత్యాలతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకునే సమయంలోనే పోలీసులు ఎందుకు సరైన విచారణ చేయలేదు.. గుడివాడ అక్రమ క్యాసినో నిర్వహకులతో, ప్రస్తుత నిర్వాహకులకు ఉన్న సంబంధాలపై కూడా విచారణ జరగాలి.

కంకిపాడు క్యాసినో ఈవెంట్ వెనుక ఉన్న సూత్రధారులను వెంటనే విచారించి పోలీసుల తగు చర్యలు తీసుకోవాలి.అంతేకాకుండా గుడివాడ అక్రమ క్యాసినోపై విచారణ నివేదికను బయటపెట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

గుడివాడ అక్రమ క్యాసినో వ్యవహారంపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని చెప్పారు.ఆరు నెలలు గడిచినా ఏపీ శాసనసభకు ఎలాంటి విచారణ నివేదికను పోలీసులు సమర్పించలేదు. అక్రమ క్యాసినోలపై పోలీసుల తీసుకునే సత్వర చర్యలు మాత్రమే ప్రజల్లో పోలీసులపై విశ్వాసం కలిగిస్తుంది.జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి క్యాసినో సంస్కృతిని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని మంత్రులు, వైకాపా నాయకులు ప్రయత్నించడం చాలా బాధాకరం, శోచనీయం. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు ప్రోత్సాహించే పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలని కోరిన వర్ల.

 

LEAVE A RESPONSE