– బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్
ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వానికి ఆస్తుల వివరాలు సమర్పించాలని, ఇకపై స్థిర, చరాస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం హస్యాస్పదం. ఇది ముమ్మాటికీ ఉపాధ్యాయులను వేధించడంలో భాగమే. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఉద్యోగుల్లో అవినీతికి ఎవరు పాల్పడినా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ టీచర్లపై మాత్రమే కక్ష కట్టినట్లుగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.
విద్యార్థులకు పాఠాలు బోధించడమే ఉపాధ్యాయుల విధి. అవినీతికి పాల్పడే, ప్రజలను పీడించి సొమ్ము చేసుకునే అవకాశం లేని ఉద్యోగం వారిది. ఒకవేళ విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అట్లాకాకుండా ఉపాధ్యాయులపై కక్ష కట్టినట్లుగా ఆదేశాలు జారీ చేయడం అన్యాయం. ఉపాధ్యాయులు విద్యావంతులు. మేధావులు. సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో వారి పాత్ర క్రియాశీలకం. తెలంగాణ ఉద్యమంలో, స్వరాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, అరాచకాలతో రాష్ట్రం అథో:గతి పాలవుతుంటే విద్యావంతులైన ఉపాధ్యాయ లోకం ప్రశ్నిస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలపై పోరాడుతూ నిలదీస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలవల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రజలను చైతన్యం చేస్తుంటే జీర్ణించుకోలేని కేసీఆర్ టీచర్లపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. 317 జీవో పేరుతో స్థానికతతో సంబంధం లేకుండా టీచర్లను బదిలీ చేస్తూ ఆయా కుటుంబాలను చెట్టుకొకరు పుట్టకొకరుగా వేరు చేశారు. పాత జీవోలను తెరమీదకు తెస్తూ టీచర్లు వేధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కక్ష పూరిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.