Suryaa.co.in

National

వరద ప్రవాహంలో నా కళ్లముందే ఎంతోమంది కొట్టుకుపోయారు..

– అమర్‌నాథ్ విలయంపై ఎమ్మెల్యే రాజాసింగ్

అమర్‌నాథ్ యాత్రికులపై ఒక్కసారిగా విరుచుకుపడిన వరద కారణంగా 13 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో భక్తులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన అనుభవాన్ని పంచుకున్నారు.

ఈ నెల 6న ఆయన తన కుమార్తె, అల్లుడితోపాటు 11 మంది కుటుంబ సభ్యులతో కలిసి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. ఢిల్లీ నుంచి హెలికాప్టర్‌లో అమర్‌నాథ్ వెళ్లాలని తొలుత అనుకున్నా వాతావరణం అనుకూలించకపోవడంతో అతి కష్టం మీద గురువారం సాయంత్రం పంచతరణికి చేరుకున్నారు. రాత్రికి అక్కడే నిద్రపోయి నిన్న ఉదయం ఆరు గంటలకు గుర్రాలపై అమర్‌నాథ్ చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అమర్‌నాథ్‌లో దర్శనం తర్వాత అరకిలోమీటరు దూరం వరకు వెనక్కి నడిచి వచ్చారు.

సరిగ్గా అదే సమయంలో పెద్ద శబ్దంతో వరద దూసుకొస్తూ కనిపించిందని, భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారని తాను చూసిన ఆ భయానక దృశ్యం గురించి చెప్పారు. తమకు కొద్ది దూరంలోనే ఎంతోమంది వరద ప్రవాహంలో కొట్టుకుపోతూ కనిపించారని, తమకు కూడా భయం వేసిందని గుర్తు చేసుకున్నారు. ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటపడగలమా? అన్న భయం వేసిందన్నారు. అయితే, అదృష్టవశాత్తు సమయానికి గుర్రాలు దొరకడంతో వాటిపై కిందికి బయలుదేరామన్నారు.

కిందికి చేరుకునేందుకు మూడు గంటల సమయం పట్టిందన్నారు. తనకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉండడంతో పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనం సమకూర్చి తనను, తన కుటుంబాన్ని శ్రీనగర్ చేర్చినట్టు చెప్పారు. కొన్ని క్షణాలు ఆలస్యమైనా తమ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. నేడు వైష్ణోదేవీ అమ్మవారిని దర్శించుకుంటామని, రేపు విశ్రాంతి తీసుకుని సోమవారం హైదరాబాద్ వస్తామని రాజాసింగ్ చెప్పారు.

LEAVE A RESPONSE