Suryaa.co.in

Andhra Pradesh

జగన్ పాలనలో పేదవారికి విదేశీవిద్య అందని ద్రాక్షే

-జగన్ జీఓ 39తో కనీసం ఎంతమంది విదేశాలకు వెళ్లగలరు
-జగన్ కూతురు చదివే యూనివర్శిటీ టాప్ 200 క్యూఎస్ ర్యాంకింగ్ జాబితాలో ఉందా?
-యువతలో వ్యతిరేకత పోగొట్టుకునేందుకే జీఓ 39 తెచ్చారు
-పథకానికి అంబేద్కర్ పేరు తొలగించడం వెనుక ఆంతర్యమేంటి?
-దళితులపై జగన్ రెడ్డిది కపట ప్రేమ
– టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు

జగన్ రెడ్డి ప్రభుత్వం పేద విద్యార్థులను విదేశీ విద్యకు దూరం చేసింది. విదేశీ విద్య అంటే అందని దాక్ష మాదిరి పరిస్థితులను, దానికి అనుగుణంగా జీఓను తీసుకొచ్చింది. దీనిపై ప్రభుత్వంలో యువతలో పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యగా జీఓ నెంబర్ 39ను తీసుకువచ్చింది. ప్రపంచంలోని టాప్ 200క్యూఎస్ ర్యాంకులు ఉన్న యూనివర్శిటీల్లో సీటు వచ్చిన వారికి మాత్రమే ప్రభుత్వం ఫీజులు కడతామని చెబుతోంది.

అన్ని సౌకర్యాలున్న నీ కూతురికే వేల ర్యాంకులో ఉన్న యూనివర్శిటీలో సీటు వచ్చింది.కోట్ల రూపాయలు కుమ్మరించి నీ కూతురుని విదేశాల్లో చదివిస్తున్నావు. అటువంటిది పేదింటిలో పుట్టిన వాళ్లు టాప్ 200క్యూఎస్ యూనివర్శిటీల్లో సీటు సంపాదించడం సాధ్యమేనా జగన్ రెడ్డి? టీడీపీ ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి పేద విద్యార్థికి విదేశీవిద్యను చంద్రబాబుగారు అందించారు. ఇంటికి ఒక్కరే అన్న పరిమితిని విధించకుండా ఎంత మంది చదువుతానంటే, అంత మందిని విదేశాల్లో చదివించారు.

జీఓ నెంబర్ 77లో విద్యార్థులకు వెసులుబాటు కల్పించారు. ఏ కోర్సుకైనా వెళ్లొచ్చు, యూనివర్శిటీలు మారొచ్చు, సీఏ చదివే వారికి సీపీఏ, సీపీఎం కోర్సులు కెనడా, యూఎస్ లో చదువుకునే వారికి లోన్ సౌకర్యం ఉందని చెప్పాం, అవకాశం కల్పించాం. విదేశీవిద్య అందని పండుకాదని, 4,900మందికి అవకాశం కల్పించి మేం నిరూపించాం. మీరు ఇచ్చిన జీఓ 39 ద్వారా ఎంతమందికి విదేశీవిద్య అందుతుందో చెప్పగలరా జగన్ రెడ్డి? మీ మూడేళ్ల పాలనలో ఎంత మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందించారో బహిరంగంగా చెప్పాలి.

మేం 4,900మంది పేద విద్యార్థులను విదేశాలకు పంపించా కాబట్టే మా అధినాయకుడు ట్విట్టర్ లో ధైర్యంగా చెప్పగలిగారు. విదేశాల్లో విద్యనభ్యసించలేని వారు అత్యధికంగా ఎస్సీ లు ఉన్నారు. నీ నిరంకుశ విధానాలకు దళిత విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. నీ అధికార దాహానికి దళిత విద్యార్థుల బంగారు భవిష్యత్తును నాశనం చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? నిజంగా పేదప్రజలకు విదేశీవిద్యను అందించాలనే సదుద్దేశం నీకు ఉంటే టాప్ 100క్యూఎస్ ర్యాంకులు ఉన్న యూనివర్శిటీల్లో కాకుండా ఎక్కడైనా చదువుకునే అవకాశాన్ని కల్పించాలి. దళితులపట్ల నిజంగా నీకు ప్రేమ ఉంటే, దళితులపై నీది కపట ప్రేమ కాకుంటే తక్షణమే విదేశీవిద్యకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలి.

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దళితులపై విషం కక్కుతున్నాడు. పేద విద్యార్థులకు అందించే విదేశీ విద్య పథకానికి గతంలో ఉన్న పేరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును తొలగించారు. ఆ స్థానంలో తన పేరు పెట్టుకుని జీఓ విడుదల చేశారు. ప్రపంచ మేధావి, దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును తొలగించి జగన్ రెడ్డి అవమానించారు. కోనసీమ జిల్లాకు కూడా అంబేద్కర్ పేరును పెట్టడం జగన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే ఆ పేరుపై ఉద్దేశపూర్వకంగా వివిదాన్ని సృష్టించారు. సొంత మంత్రి దళితుడు కావడంతో అతని ఇంటిని మీ కార్యకర్తలతో తగులబెట్టించారు.

నీ పక్కనున్న దళిత మంత్రులంటే కూడా నీకు కనీస గౌరవం లేదు. అంబేద్కర్ ఫోటోలు ఉన్న పేపర్ ప్లేట్లలో టిఫిన్ లు అమ్ముతున్న దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేసేవరకు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ కు జరిగిన అన్యాయంపై ఆరా తీసే దిక్కు లేదు. దళితుడిని చంపిన తన పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు అత్యంత నామమాత్రంగా ఉన్నాయి. కొన్ని సార్లు అనంతబాబు జైలులో ఉన్నాడా, లేక గెస్ట్ హౌస్ లో ఉన్నాడా అనే అనుమానం కూడా కలుగుతోంది. దళిత పక్షపాతినని చెప్పుకునే నైతిక హక్కు నీకు లేదు జగన్ రెడ్డి.

LEAVE A RESPONSE