Suryaa.co.in

Andhra Pradesh

వరద బాధితులకు ₹25వేల తక్షణ సాయం ప్రకటించాలి

-జాతీయ విపత్తుగా ప్రకటించేలా రాష్ట్రం కేంద్రం పై వొత్తిడి తేవాలి
-వరద సాయం అందరికీ సమానంగా పంచాలి
-వరద బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటం
-ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వస్తాం
-వరద బాధితుల పట్ల ఇంత నిర్లక్ష్యమా?
-ఎమ్యెల్యేలు, మంత్రులు కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటించరా?
-వరద నష్టాన్ని అంచనా వేసే వారేరీ?
-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్
-పోలవరం ముంపు ప్రాంతాలైన ఏలేరుపాడు, కుక్కునూరు ప్రాంతాల్లో -బాధితులను పరామర్శించిన శైలజనాధ్

విజయవాడ : వరదల కారణంగా ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ₹25వేల తక్షణ సాయం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్ డిమాండ్ చేశారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించేలా రాష్ట్రం కేంద్రం పై వొత్తిడి తేవాలని, వరదసాయం అందరికీ సమానంగా పంచాలని కోరారు. ఎన్ ఆర్ ఈ జీ ఎస్ పథకం కింద బకాయిలను తక్షణం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ కి వంగివంగి దండాలు పెట్టడం మాని నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు.

వరద బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని, అందుకు అవసరమైన ఒత్తిడిని ప్రభుత్వం పై తీసుకు వస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్ అన్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదార్చాల్సిన ప్రజా ప్రతినిధులు ఏసీ గదుల్లో కూర్చుని ఆదేశాలు ఇస్తున్నారు తప్ప ఆదుకునే వారెవరని ప్రశ్నించారు.

వరద బాధితుల పట్ల జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిన మంత్రులు హెలికాప్టర్ లో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారని శైలజనాధ్ ధ్వజమెత్తారు. నిండా మునిగిన ఇళ్లు.. ఎటుచూసినా నీళ్లే. అయినా తాగేందుకు గుక్కెడు మంచినీళ్లకూ కటకటే..చంటిబిడ్డ గుక్కపట్టి ఏడ్చినా పాలు పట్టలేని దుస్థితి ముంపు ప్రాంతాల్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.
పోలవరం ముంపు ప్రాంతాలైన ఏలేరుపాడు, కుక్కునూరు ప్రాంతాల్లో సోమవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్ ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జెట్టి గురునాధం ఆధ్వర్యంలో బాధితులను పరామర్శించారు. గోదావరి వరద పీడిత ప్రాంతమైన ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని పునరావాస కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ బృందం సోమవారం పర్యటించింది. అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించింది. ఈ సందర్భంగా బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటూ తమ కష్టాలను, తాము పడుతున్న ఇబ్బందులను కాంగ్రెస్ పార్టీ నేతలకు వివరించారు.

అనంతరం శైలజనాధ్ మీడియాతో మాట్లాడుతూ సర్వం కోల్పోయి అందరూ పునరావాస కేంద్రాలకు చేరారని, వారికి కూరగాయలు, తాగునీరు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. వరద సాయం విషయంలో ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్ర స్థాయి పరిస్థితికి పొంతన లేకుండా ఉందని తెలిపారు. చిన్నారులకు పాలు, బిస్కెట్లు వెంటనే అందించాలని డిమాండ్‌ చేశారు. వరద బాధితులకు తాగునీరు సైతం అందడం లేదని, బాధితుల కష్టాలు హృదయ విదారకంగా ఉన్నాయని శైలజనాధ్ ఆవేదన వ్యక్తం చేశారు. లోపాలను ప్రభుత్వం వెంటనే సరిదిద్ది అందరికీ సక్రమంగా సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

నూనె, పాల ప్యాకెట్లు కూడా ఇవ్వడం లేదన్నారు.వరద బాధిత ప్రాంతాల్లోని అన్ని జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందని, మరోపక్క గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోందని, లంకగ్రామాలు, పోలవరం ప్రాజెక్టు ప్రాంతాలు నీటి ముంపులోనే ఉన్నాయని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పోలవరం నిర్వాసిత మండలాలైన విఆర్‌.పురం, చింతూరు, ఎటపాక, కూనవరంలో గ్రామాలు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయన్నారు. తక్షణమే అధికారులు బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపాట్టాలని శైలజనాధ్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి డిమాండ్స్
★ గోదావరి వరదలకు నష్టపోయిన అందరికీ రూ.10,000 నష్టపరిహారం ఇవ్వాలి
★ గోదావరి వరదల్లో కొట్టుకుపోయిన, చనిపోయిన పశువులకు నష్టపరిహారం ఇవ్వాలి
★ గోదావరి వరదలకు కూలిన ముంపుకు గురైన ఇళ్ళకు రూ.25,000 నష్టపరిహారం ఇవ్వాలి
★ పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్న ఏడు మండలాల గ్రామపంచాయతీల గ్రామాలను 41.5 పరిధిలో అన్ని గ్రామాలను చేర్చి అందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన 10 లక్షల నష్టపరిహారం ఇచ్చి అన్ని వసతులతో కాలనీ గృహాలు నిర్మించి త్వరగా తరలించాలి
★ మండలంలో గిరిజన, గిరిజనేతరలకు భూమికి నష్టపరిహారం ఇవ్వాలి
★ వరదల వల్ల అన్ని గ్రామాలు పారిశుధ్యం శానిటేషన్ చేసి అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి

LEAVE A RESPONSE