-అన్నదాతలు వేలాదిగా తరలివచ్చి రైతువ్యతిరేక వైసీపీ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలి
-అభివృద్ధి గురించి మీరా మాకు చెప్పేది….20 ఏళ్ల క్రితమే అల్లీపురానికి అన్నీ తెచ్చా
– పొదలకూరు,వెంకటాచలం మండలాల్లో టీడీపీ నేతలతో సమావేశం సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాతే జిల్లాలో క్రాఫ్ హాలిడేలు ప్రకటిస్తున్నార ని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విరుచుకుపడ్డారు.
సోమిరెడ్డి ఇంకా ఏమన్నారంటే… మనుబోలు సెంటరులో 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రైతు పోరు సభ ప్రారంభమవుతుంది. నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, రాజంపేట పార్లమెంటు పరిధిలో ఈ సభ నిర్వహిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతు కుటుంబాలు నలిగిపోవడం, పలువురి ఆత్మహత్యలకు దారితీయడం, మోటార్లకు మీటర్లు పెట్టే దుర్మార్గమైన ప్రయత్నాలపై నిరసన తదితర అంశాలే అజెండాగా రైతుపోరు.
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాతే జిల్లాలో క్రాఫ్ హాలిడేలు ప్రకటిస్తున్నారు. కళ్లముందే పుష్కలంగా నీళ్లున్నా పంట వేయడానికి రైతులు జంకుతున్నారు.జిల్లా వ్యాప్తంగా ధాన్యం తాలూకూ రైతులకు రూ.400 కోట్లు, రైసుమిల్లర్లకు రూ.245 కోట్లు ప్రభుత్వం బకాయిపడింది.మంత్రిగా ఆయన తడాఖా చూపించి ఈ బకాయిలు చెల్లింపునకు చర్యలు తీసుకోవచ్చు కదా?
మొన్న అల్లీపురంకి వచ్చి తోడేరులో అభివ్రుద్ధి చూడమని చెప్పాడంట.. తోడేరును ఏమి చూస్తావు?నేను ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అభివృద్ధి అంటే ఏమిటో నీ సొంత మండలం పొదలకూరులోనే చూపించా. అల్లీపురంలో రెండు దశాబ్దాల క్రితమే మూడు ఎకరాలు మా తండ్రి రాజగోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం కొనుగోలు చేసి హైస్కూలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇచ్చాం.20 ఏళ్ల క్రితమే ఊళ్లో పశువుల ఆస్పత్రి అందుబాటులోకి తేవడమే కాక వీధివీధినా సిమెంట్ రోడ్లు వేయించాం.నవలాకులతోటలోనూ కోట్లాది రూపాయల విలువైన భూమిని హైస్కూలుకు ఇచ్చిన చరిత్ర మా కుటుంబానిది.
మొన్న మీరు ప్రారంభించిన రోడ్డుకు కూడా ఎన్నికలకు ముందు రూ.10 కోట్లు మంజూరు చేయించింది నేను…ఆ రోడ్డును ఈ మూడేళ్లు ఎందుకు అడ్డుకున్నారో మీరే చెప్పాలి.మూడేళ్లు నడుములు విరిగేలా పడిన గుంతలతో జనం అవస్థ పడిన తర్వాత నాలుగో సంవత్సరంలో వేసి ఇప్పుడు తోడేరు చూడమంటారా?
జెడ్పీ చైర్మన్ గా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పొదలకూరు మండలానికి ఏం చేశారో చెప్పండి.గెలిచిన నువ్వు పనులకు, అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తే ఓడిపోయిన నేను చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేశాను.పొదలకూరు మండల ప్రజలు శాశ్వతంగా పేదరికంలో కొనసాగాలని నువ్వు కోరుకుంటే దశాబ్దాలుగా నిలిచిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్, దక్షిణ కాలువ, ఆస్పత్రి, వాటర్ స్కీం వంటి ఎన్నో ప్రాజెక్టులు నేను సాకారం చేశా.
నీ స్నేహితులు మంత్రులుగా కొనసాగే సమయంలో చేయలేని అటవీ అనుమతులను మేం సాధించి, కండలేరు కింద 1.30 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టును తీసుకొచ్చాం. మీ మాదిరిగా పుట్టిని రూ.12 వేలకు అమ్ముకునే పరిస్థితి రైతులకు తేలేదు..పుట్టికి 300 కిలోలు అదనంగా తీసుకునే పరిస్థితి మేం తీసుకురాలేం.