– రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నాశనం చేసిండు అని రాష్ట్ర అప్పులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై వినోద్ కుమార్ ఆగ్రహం
– పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఈనెల 25న రాష్ట్రాల వారీగా అప్పులపై విడుదల చేసిన ఆర్.బీ.ఐ. నివేదికను బండి సంజయ్ చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయి
– దేశ వ్యాప్తంగా టాప్ 10 అప్పులు ఉన్న రాష్ట్రాలలో తెలంగాణా రాష్ట్రం పేరు లేనే లేదు
– ఇదిగో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్రాల వారీ అప్పుల జాబితా
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
రాష్ట్ర ప్రభుత్వ అప్పుల విషయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, లోక్ సభ సభ్యుడు అన్న బాధ్యతను బండి సంజయ్ మరువకూడదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నాశనం చేశారని, పుట్టబోయే బిడ్డ మీద కూడా లక్షన్నర రూపాయల అప్పు చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించడాన్ని వినోద్ కుమార్ తప్పు పట్టారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై వినోద్ కుమార్ స్పందించారు.అప్పుల విషయంలో అసలు వాస్తవాలను తెలుసుకోవాలని, అనవసరంగా అవాస్తవాలను ప్రచారం చేయవద్దని బండి సంజయ్ కు సూచించారు.
వాస్తవాలు తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎలా..? అని బండి సంజయ్ ను ఆయన ప్రశ్నించారు. ఏదైనా విషయం మాట్లాడే ముందు పక్కా సమాచారంతో ప్రజల ముందుకు రావాలని, అంతేగాని బాధ్యత గల ఎం.పీ.గా ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ఎలా..? అని వినోద్ కుమార్ నిలదీశారు.నాలుగు రోజుల క్రితం పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తాజా గణాంకాలను ఎం.పీ.గా ఉన్న బండి సంజయ్ ఒకసారి విశ్లేషించు కోవాలని సూచించారు.
పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్బిఐ తాజా నివేదిక ప్రకారం ఎక్కువ అప్పులు ఉన్న టాప్ 10 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం పేరు లేదని, ఈ విషయాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఎందుకు గమనించలేదని, ఒక ఎంపీగా పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన విలువైన నివేదికను పట్టించు కోకుంటే ఎలా..? అని, ఇదేనా..? ఒక ఎం.పీ బాధ్యత అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి ప్రాజెక్టులను కడుతోందని, అప్పులతో క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ పై వెచిస్తున్నదని,, నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపడుతోందనీ పేర్కొన్నారు.
అప్పులతో రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు చేపడుతోందనీ, అప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ కోసం వాడటం లేదని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.సగటు మనిషికి తరతరాలుగా ఉపయోగపడే విధంగా విలువైన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతోందనీ తెలిపారు.
పైగా తెచ్చిన అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా బకాయిలు (ఈఎంఐ) చెల్లిస్తోందని, ప్రతి నెలా ఈఎంఐ చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని వినోద్ కుమార్ తెలిపారు.ఎక్కువ అప్పులు ఉన్న టాప్ 10 రాష్ట్రాలలో ఐదు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయని, ఈ వాస్తవాలను బండి సంజయ్ గ్రహించాలని, తెలంగాణ రాష్ట్రం మాత్రం అతి తక్కువ అప్పులు చేసిన విషయాన్ని కూడా బండి సంజయ్ గమనించాలని పేర్కొన్నారు.
25-7-2022 నాడు కేంద్ర ప్రభుత్వం నిండు పార్లమెంటు సమావేశాలలో దేశంలోని రాష్ట్రాల వారీగా ఉన్న అప్పుల నివేదికను ఆర్.బీ.ఐ. గణాంకాల ఆధారంగా విడుదల చేసిన తాజా జాబితాను వినోద్ కుమార్ వెల్లడించారు.