– అర్చకుడి తొలగింపుపై ప్రశ్నిస్తే జీ.వీ . ప్రవీణ్ కుమార్ రెడ్డిపై కేసు పెడతారా?
-ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి చట్టం? ఇది రాజ్యాంగ హక్కును హరించడమే.
– తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ రెడ్యం
తాము చెప్పిందే వేదం, శాసనం దీనిని ఉల్లంఘిస్తే మీ పై కేసులు పెట్టిస్తాం… అర్చకుడి నైనా తొలగిస్తాం అనే విధంగా ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని వైసీపీ ప్రభుత్వంలో అర్చకులను కూడా వదలరా? అని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెదేపా పొద్దుటూరు ఇంచార్జి జీ.వీ. ప్రవీణ్ కుమార్ రెడ్డి అర్చకుడి తొలగింపుపై ప్రశ్నించినందుకు నాన్ బెయిలబుల్ కేసు పెట్టడంపై తెదేపా నేతలతో కలిసి రెడ్యం ప్రొద్దుటూరులోని ప్రవీణ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి జరిగిన విషయాలను తెలుసుకున్నారు.
అనంతరం రెడ్యం విలేకరులతో మాట్లాడుతూ… శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు, 85 ఏళ్ల వృద్ధుడు అయిన పద్మనాభ ప్రణీత్ ను తొలగించడంపై ఆలయ ఈవో ను ప్రశ్నిస్తే ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఈవీ సుధాకర్ రెడ్డి తదితరులపై అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఒత్తిడితో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం చూస్తే ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి చట్టం? అనిపిస్తోందని ఇది రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని హరించడమే అని ఆయన ధ్వజమెత్తారు.
దేవుడికి సంబంధించిన సొమ్ము పరాయి పాలవుతుంటే ప్రధాన అర్చకుడు ఇది తప్పు అని చెప్పడం నేరమా? చట్ట వ్యతిరేకమా? అని ఆయన నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలో తప్పులను ప్రశ్నించి తెదేపా, ప్రతిపక్ష నేతల పై అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయడం భౌతికంగా అంతమొందించడం పరిపాటిగా మారిందని ఇది నీచ రాజకీయానికి పరాకాష్ట అని ఆయన నిశితంగా విమర్శించారు.
అక్రమ కేసులను ఎత్తివేసి పోలీసులు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రెడ్యం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంచన బోయిన గురప్ప యాదవ్, తెదేపా జిల్లా కార్యదర్శి చిన్న ఇమామ్ గారి సిద్దయ్య, తెలుగు యువత అధికార ప్రతినిధి నేట్లపల్లె శివరామ్ యాదవ్, తెదేపా జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది రామిశెట్టి శ్రీనివాసులు ( ఆర్ శ్రీను ), తెదేపా ఖాజీపేట మండలం నేత దవనం ఓబులు తదితరులు పాల్గొన్నారు.