– ఈ కార్యక్రమాన్ని నేరుగా పర్యవేక్షించనున్న సీఎం
– ఎంపీ విజయసాయి రెడ్డి
విశాఖపట్నం, ఆగస్టు 24: ప్రజాసమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని ఇకపై తానే నేరుగా పర్యవేక్షించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఇకనుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రాధాన్యత పనులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.3,000 కోట్లు కేటాయించింది. ఈ ప్రాధాన్యత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, పూర్తి చేయాలని కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశించారని ఆయన చెప్పారు.
వరల్డ్ బ్యాంకు ప్రశంసలు పొందిన రైతు భరోసా కేంద్రాలు
రైతు భరోసా కేంద్రాలకు విశ్వవ్యాప్తంగా మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తుందని విజయసాయి రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన నుంచి పురుడు పోసుకున్న రైతు భరోసా కేంద్రాలు ఐక్యరాజ్య సమితి అవార్డు ఎంపిక కావడం రాష్ట్రానికే కాక దేశానికే గర్వకారణమని అన్నారు. ఈ మేరకు విజయవాడలో పెనమలూరు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధి ఆర్బీకేలు అందిస్తున్న సేవలను కొనియాడారని అన్నారు. రాష్ట్రం మొత్తం మీద 10778 రైతు భరోసా కేంద్రాలు రైతులకు వివిధ రకాల సేవలందిస్తున్నాయి. రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం, పండించిన ఉత్పత్తులను విక్రయించడంలో రైతు భరోసా కేంద్రాల పాత్ర అనిర్వచనీయమైనదని అన్నారు.
విద్య, వైద్యం పై చేసే ఖర్చు ఉచితాలు కావు
ప్రపంచంలో అభివృద్ధి చెందిన అనేక దేశాలు సైతం అక్కడి ప్రజలను విద్య, వైద్యం ఉచితంగానే అందిస్తున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు. ఉచితాలు గూర్చి మాట్లాడేటప్పుడు ప్రపంచంలో వివిధ దేశాలు విద్య, వైద్యంపై చేసే ఖర్చు గూర్చి గురించి తెలుసుకోవాలని అన్నారు. విద్య. వైద్యంపై చేసే ఖర్చు ఉచితాలుగా (ఫ్రీబీస్ ) పరిగణించరాదని అన్నారు.