– క్రైస్తవాంధ్రప్రదేశ్గా మార్చే కుట్ర
– అందుకే వినాయకచవితిని వేధిస్తున్నారు
– మండపాలకు వెయ్యి వసూలు చేస్తారా? సిగ్గుందా?
– వైసీపీని క్రిస్టియన్ పార్టీగా మారుస్తారా?
– 151 సీట్లు ఇచ్చినందుకు హిందువులను శిక్షిస్తారా?
– అంతర్వేది నిందితులను పట్టుకోరా?
– పుణ్యక్షేత్రాల్లో మత ప్రచారం సిగ్గుచేటు
– ముద్దుల స్వామి ఎటు వైపో తేలాలి
– శ్రీ శ్రీనివాసానంద సరస్వతి ధర్మాగ్రహం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి ఏపీ సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. జగన్కు హిందువులంటే కక్ష అని, అందుకే వినాయకచవితిని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయకమండపాలకు వెయ్యిరూపాయలు వసూలు చేయడం సిగ్గుమాలిన పని అని కన్నెర్ర చేశారు. జగన్ క్రిస్టియన్ కాబట్టి, తన పార్టీని క్రిస్టియన్ పార్టీగా మారుస్తారా? అని ప్రశ్నించారు. మతమార్పిళ్లతో ఏపీని క్రైస్తవాంధ్రగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందులో భాగంగానే హిందువుల పండగలపై ఆంక్షల పడగ విప్పారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మానికి ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసిన శ్రీనివాసానంద సరస్వతి ఇంకా ఏమన్నారంటే… ‘జగన్కు హిందు మతంపై ఏమాత్రం నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కాబట్టి. అందుకే హిందువులపై పండగలకు మాత్రం నిషేధాజ్ఞలు, నియమాలు విధిస్తున్నారు. ఆ నిబంధనలు ముస్లిం, క్రైస్తవ మతాలకు వర్తింపచేయడం లేదు. హిందువులంటే చేతకానివారన్నది ఆయన నమ్మకం. అది భ్రమ. హిందువుల్లో చైతన్యం వస్తే ఎవరూ నిలబడలేరు. హిందూధర్మాన్ని నాశనం చేసి, తమ మతాలను విస్తరించాలని దండయాత్రలు చేసి దేవాలయాలను ధ్వంసం చేసిన వారు, భూస్థాపితం అయిన చరిత్ర మనకుంది. ఇప్పుడు ఏపీలో హిందువులు కళ్లు తెరుస్తున్నారు. తమ మతానికి జగన్ చేస్తున్న అన్యాయం ఏమిటన్నది గ్రహిస్తున్నారు. అంతర్వేది రథం తగులబెట్టిన నిందితులను ఇప్పటివరకూ శిక్షించలేదు. కానీ అప్పుడు ఒకరి ఇంటిపై హిందూ కార్యకర్తలు రాళ్లేశారన్న సాకుతో హిందువులను అరెస్టు చేశారు. ఇదా పాలకుల ధర్మం? ఇదా రాజ్యాంగాన్ని కాపాడే విధానం? ఇదా రాజధర్మం’’?
‘‘హిందువులకు వినాయకచవితి పెద్ద పండగ. అలాంటి పండగలపైనా జగన్ ప్రభుత్వం ఆంక్షల కత్తి వేళ్లాడదీయడం దారుణం. వినాయకమండపాలకు వెయ్యి రూపాయల ఫీజు కట్టాలనడం అనాగరికం, దుర్మార్గం. ఇది నేరుగా హిందువులను, హిందూమతాన్ని అణచివేసే కక్ష సాధింపు చర్య మాత్రమే. మిగిలిన మతాలు నిర్వహించుకునే పండగలకూ ఇదే పద్ధతి, విధానం పాటిస్తారా? నేను సవాల్ చేస్తున్నా.. మిగిలిన మతాలకూ ఇలాంటి నిబంధనలు రూపొందించే ధైర్యం జగన్ ప్రభుత్వానికి ఉందా? అంటే హిందువులంటే చేతకాని, చేవలేని మతం అని జగన్ భావిస్తున్నారా’’?
‘‘హిందువులు జగన్కు 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది ఇందుకేనా? జగన్ క్రైస్తవుడు కాబట్టి, వైసీపీని క్రిస్టియన్ పార్టీగా మారుస్తారా? గత ఎన్నికల్లో హిందువుల ఓట్లతోనే ఆయన సీఎం అయ్యారన్నది గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో యధేచ్చగా మతమార్పిళ్లు జరుగుతున్నాయంటే, పాలకుల సహకారం లేకుండా అది సాధ్యమవుతుందా? హిందూ ఆలయాలపై దాడులు చేస్తుంటే చర్యలు లేవు. మతమార్పిళ్లు అడ్డుకుంటున్న హిందువులపైనే ఎదురుకేసులు పెడుతున్నారు’’
‘‘ఆధ్మాత్మిక కేంద్రాలు, క్షేత్రాల వద్ద క్రైస్తవులు బహిరంగంగా మత ప్రచారం చేసుకుంటుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. జగన్ దిగిపోయేనాటికి ఏపీని క్రైస్తవాంధ్ర చేయడమే పాలకుల లక్ష్యంగా కనిపిస్తోంది. దీనిని హిందూ సమాజం అడ్డుకుంటుంది. హిందువుల మౌనం అసమర్ధతగా భావించవద్దు. ఈ అరాచకాలు, జగన్ హిందూ మత వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ మేమంతా రోడ్డెక్కుతాం. సమాజాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత పీఠాథిపతులుగా మాపై ఉంది. పీఠాథిపతులు కూడా రాష్ట్రంలో జరుగుతున్న హిందూ వ్యతిరేక విధానాలపై ఆందోళనతో ఉన్నారు’’
‘‘ఇప్పుడు ప్రభుత్వాన్ని రక్షిస్తూ, వారికి వంతపాడుతున్న కొంతమంది స్వాములు తాము హిందువుల పక్షాన ఉండాలా? క్రైస్తవాంధ్రప్రదేశ్గా మార్చాలని చూస్తున్న జగన్ వైపు ఉండాలా అని తేల్చుకోవాలి. వారి భక్తులు కూడా పాలకులకు ముద్దులు పెడుతున్న తమ స్వాములను నిలదీయాల్సిన అవసరం ఉంది. పాలకులను మెప్పించి భూములు, ఆస్తులు సంపాదించాలన్న ధ్యాసలో, కనీసం ఒకటో వంతయినా హిందూధర్మరక్షణపై ఉంటే సమాజం కొంతయినా బాగుపడుతుంది. వినాయక మండపాలకు వెయ్యి రూపాయల ఫీజు నిర్ణయంపై పాలక రాజగురువులు హిందువులవైపు ఉంటారా? పాలకుల వైపు ఉంటారా? అన్నది తేలిపోవాలి’
1 thought on “హిందువులంటే జగన్కు కక్ష”