Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రప్రభుత్వానికి వచ్చే ఆదాయం…అప్పులు, వడ్డీలకే సరి!

-ద్రవ్యలోటు, తెచ్చిన అప్పులపై వైసిపి ప్రభుత్వ తప్పుడు లెక్కలు
-శ్రీలంకలో సగటు అప్పు రూ.లక్ష.. ఏపీలో రూ.1.70 లక్షలు!
-ప్రైవేటు సంస్థ అయితే ఈపాటికి రాష్ట్రం దివాలా తీసేది
-జగన్ సీఎం అయ్యాక రూ.5.43 లక్షల కోట్లు అప్పు చేశారు
-కేంద్రానికి దొంగలెక్కలు చెప్పి తప్పించుకోలేరు
-దేశం మొత్తం మీద ద్రవ్యలోటు అత్యధిక ఉన్న రాష్ట్రం ఏపీనే
-టిడిపి జాతీయ అధికార ప్రతినిధి జివి రెడ్డి

సూట్ కేసు కంపెనీలు పెట్టి ప్రైవేట్ వ్యాపారాల్లో వేలకోట్లు దోచుకున్నట్లు కేంద్రానికి దొంగ లెక్కలు ఇచ్చి గత మూడేళ్లుగా పరిమితికి మించి అప్పులు చేశారని టిడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి దుయ్యబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి సర్కారు కాగ్ కు దొంగలెక్కలు సమర్పించందని ఆయన ఆరోపించారు. విలేకరుల సమావేశంలో జివి రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే…!

జగన్ రెడ్డి బండారం బయటపడుతుందనే దొంగ లెక్కలు ఇస్తున్నారు. ఏ స్ధాయిలో అప్పులు చేయాల్సి ఉంది, ఏస్థాయిలో చేశారు, ద్రవ్యలోటు ఎంత ఉండాలి, దాన్ని తగ్గించి చూపించేందుకుఎన్ని తిప్పలు పడ్డారో తాజా గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.
రాష్ట్రప్రభుత్వ అప్పులకు సంబంధించి అన్ని అంశాలను పరిశీలించి గతనెల 22తేదీన
కేంద్రం వివిధ అంశాలకు సంబంధించి ఒక లేఖ రాసింది. కేంద్రం పంపిన నిధులని రాష్ట్ర ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తోందో ఆ లేఖలో స్పష్టంగా పేర్కొంది.

అప్పులు, ద్రవ్యలోటులో తప్పుడు లెక్కలు
ఆర్థికమంత్రి బుగ్గన, ఆర్థిక సలహాదారులు జులై 21న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒక ప్రెస్ నోటీ విడుదల చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి మాకు ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్యలోటు) చాలా తక్కువగా 2.09 శాతంగా చూపించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్ ల కంటే ఆంధ్రప్రదేశ్ లో తక్కువగా ఉందని చూపించారు. అయితే ఆగస్టులో విడుదల చేసిన కాగ్ రిపోర్టు తర్వాత వాస్తవ విషయాలు వెల్లడయ్యాయి.

2022 ఫిబ్రవరి వరకు రాష్ట్ర వాస్తవ అప్పు 55వేల కోట్ల పైచిలుకు ఉంటే దానిని మార్చికి 25వేల కోట్ల రూపాయలుగా తగ్గించి చూపించారు. ఒక్క సారిగా 30వేల కోట్ల రూపాయలు అకస్మాత్తుగా తగ్గడానికి బుగ్గనగారి మాయజాలమే కారణం. ఆర్థిక సంవత్సరం మార్చిలో ముగుస్తుంది. ద్రవ్యలోటు, రెవిన్యూ లోటు, డెట్ టు జిడిపి, ఎఫ్ఆర్ బిఎం వంటివాటికి మార్చి చివరి లెక్కలెక్కలే ప్రాతిపదిక కాబట్టి అప్పులను తగ్గించి చూపించారు. ఆదాయ, వ్యయాలను వాస్తవ గణాంకాలతో సంబంధం లేకుండా చూపడం వల్ల తక్కువగా ద్రవ్యలోటు ఉన్నట్లు కన్పిస్తోంది. 2022 ఏప్రిల్, మే తరువాత లెక్కలు బయటికొచ్చాయి. తక్కువ చూపించిన 30వేల కోట్లను సరిచేయడానికి 2022 ఏప్రిల్ లో 13వేల 422 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. సాధారణంగా దివాలా అంచున ఉన్న ప్రైవేటు కంపెనీలు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి పబ్బం గడుపుకోవడానికి బ్యాలెన్స్ షీట్లు తారుమారు చేస్తుంటాయి. కంచే చేనుమేసిన చందంగా ఇలాంటి దొంగ లెక్కలు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే ఏమనాలి?

2022-23 ఆర్ధిక సంవత్సారానికి కేవలం పబ్లిక్ డెట్, కార్పొరేషన్ ద్వారా కాకుండా ఆర్బిఐ ద్వారా 46, 608 కోట్ల రూపాయలు 7.84శాతం వడ్డీ సగటుకి తెచ్చారు. ఈ ఆర్థిక సంవత్సారానిక ఉన్న లిమిట్ మొదట రూ.28 వేలకోట్లు మాత్రమే కాగా, తర్వాత కేంద్రాన్ని బతిమాలుకొని రూ.48వేల కోట్లకు పెంచుకున్నారు. రాష్ట్రం మొత్తం అప్పు ఆగస్టు 2022 నాటికి 8,87,397 కోట్ల రూపాయలు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు రాష్ట్రానికి తెచ్చిన అప్పు 5,42,902కోట్ల రూపాయలు. పరిమితికి మించిన అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా అంచుకు తీసుకెళ్లారు. ప్రస్తుత రాష్ట్ర ఆదాయం, అప్పులతో బేరీజు వేస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 80శాతం వడ్డీలకే సరిపోతుంది.

కేంద్రప్రాయోజిత పథకాల నిధులనూ మళ్లించారు
తీసుకొచ్చిన అప్పులని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కాకుండా వడ్డీలకువాడే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రప్రభుత్వం దివాలా అంచున ఉన్నట్లే. అందుకే మేం ఎపి… శ్రీలంక దారిలో ఉందని చెబుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 22వ తేదిన రాసిన 16 పేజీల లేఖలో ప్రభుత్వం తెచ్చిన అనధికార అప్పుల చిట్టాను స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు ఇచ్చిన నిధులను రాష్ట్రప్రభుత్వం వాడేసుకుందని కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ సెక్రటరీ సోమనాథన్ రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.
లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ కి దారి మళ్ళించి 8వేల 305కోట్ల రూపాయలు 9.62శాతం వడ్డీతో తీసుకొచ్చారని మేం చెబితే లేదని బుకాంచారు. కేంద్ర రాసిన లేఖలో 2వ పేజీలోని 2వ పేరాలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎఫ్ఆర్ బియం నిబంధనలకి విరుద్దమని కేంద్రం లేఖ రాసింది.

డిస్కమ్ ల అప్పులపై సమాధానం లేదు
డిస్కం అప్పుల గురించి కేంద్రం అడిగితే ఇప్పటివరకు సమాధానం లేదు. రైతులకి ఇస్తున్న సబ్సీడీలు డిస్కమ్ లకు చెల్లించడం లేదు. సమాధానం చెప్పకుండా ఎన్నిరోజులు దాక్కుంటారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా డిస్కమ్ లు అప్పలు భారంతో దివాలా అంచున ఉన్నాయి. పవర్ జనరేటింగ్ కంపెనీలకు చెల్లించాల్సిన అప్పు రూ. 10,109 కోట్ల రూపాయలు ఉందని కేంద్రం లేఖ రాసింది. మూడు నెలల నుంచి ఎటువంటి పేమెంట్లు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టారు. ఏపేమెంట్ చేయలేదు. కేంద్రం రాసిన లేఖలో పేజి నెం. 4లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొత్తగా రైల్వే ప్రొజెక్ట్ ల కోసం అన్ని అనుమతులూ ఇచ్చిన కేంద్రం 2వేల 470 హెక్టార్ల భూమిని కోరింది. దానికి సంబంధించి 3వేల 558 కోట్ల రూపాయలు డబ్బు కూడా ఇచ్చింది. రైల్వే ప్రాజెక్టులకు కేవలం భూమిని కూడా రాష్ట్రప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అమరావతిలో రైతులు ఇచ్చిన భూమిని ఏంచేస్తున్నారో అందరికీ తెలుసు. అందుకే ఈ ప్రభుత్వాన్ని నమ్మి భూమి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో భూమిని సేకరించలేక పోతున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో అప్పులచేసి భారాన్నే తాము మోస్తున్నామని వైసిపి ప్రభుత్వం చెబుతున్న మాటలు పూర్తిగా అబద్దం. ఒక్కో జిల్లాకు 50కోట్ల చొప్పున 7 జిల్లాలకు ఇస్తుండగా, ఆ నిధులను వెనుకబడిన జిల్లాలకు వాడకుండా దారిమళ్లించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అప్పులు, వడ్డీలకే సరిపోతుంది.

శ్రీలంకకు మించిన అప్పులు!
శ్రీలంకలో వ్యక్తి సగటు అప్పు భారం రూ. లక్షకాగా, ఏపీలో రూ.1.70 లక్షలుగా ఉది. ప్రైవేటు సంస్థ అయితే ఈపాటికి కోర్టులో దివాలా పిటిషన్ పడేది. జగన్ సీఎం అయ్యాక రూ.5.43 లక్షల కోట్లు అప్పు చేశారు. కేంద్రానికి దొంగ లెక్కలు ఇచ్చి కొనితెచ్చుకున్న సమస్యలే ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలపై కేంద్రం కూడా లేఖలు రాసే దుస్థితి నెలకొంది. కేంద్రానికి వాస్తవాలు చెప్పకుండా దాచలేరని తాజా లేఖతో రుజువైంది. ఏపీలో ద్రవ్యలోటు తక్కువగా ఉందని ప్రకటించడం పూర్తి అవాస్తవం. దేశం మొత్తంమీద ద్రవ్యలోటు అత్యంత అధ్వాన్నంగా ఉన్న రాష్ట్రం ఏపీనే. మూడు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని సమస్యలు వెంటాడుతున్నాయి.

పంచడానికి ప్రభుత్వమే అవసరం లేదు!
అప్పులు తెచ్చి పంచడానికి ప్రభుత్వమే అవసరం లేదు.. ఎవరైనా చేయొచ్చు. ఒక్క సంతకంతో పీడీ అకౌంట్లలో సొమ్ము లాగేసుకుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఎఫ్ ఆర్ రూల్స్ ప్రకారం రావాల్సిన అప్పులను కూడా వాళ్లు కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు రాసిన లెటర్ ప్రకారం మార్చి 31న ఎఫ్ఆర్ బిఎం ను గట్టిగా అమలుచేస్తామని కేంద్రం చెబుతోంది. ఈ విషయంలో కేంద్రం తీరునుబట్టి వైసిపి ప్రభుత్వ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని జివి రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A RESPONSE