Suryaa.co.in

Editorial

కవితకు ఈడీ నోటీసు వెనుక కథేమిటి?

– విలీన దినోత్సవ వేళ కారుకు షాక్‌
– సంబరాల వేళ నోటీసుల కలకలం
– కవితకు నోటీసుతో నిజమైన మీడియా కథనాలు
– ముందు ఆరోపణలు, త ర్వాత చర్చ
– ఆ తర్వాతనే వ్యూహాత్మకంగా ఈడీ నోటీసు, దాడులు
– అధికార పార్టీలో అంతా అ‘టెన్షన్‌’
( మార్తి సుబ్రహ్మణ్యం)

అంతా అనుకున్నట్లే జరుగుతోంది.. అందరూ అనుమానించిందే జరుగుతోంది.. అంతా పక్కా స్కెచ్‌.. ఆమెపై ఇప్పటిదాకా కేవలం మీడియాలో ఆరోపణలే.. బీజేపీ విమర్శల వర్షమే.. ఈలోగా సర్దుమణిగిన ఆరోపణల జల్లు. విరామానంతరం ఉన్నట్లుండి మళ్లీ ఓ భారీ కుదుపు.. విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసు.. అంతేనా? ఆమె ఆదాయ వ్యవహారాలు చూసే ఆడిటర్‌ నివాసంలోనూ సోదాలు.. ఆ బురదలో చిక్కుకున్న వారి నివాసాలపై సోదాలు. ఇవన్నీ.. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సంబరాల్లో బిజీగా ఉన్న గులాబీ దళాలకు గుబులు పుట్టించే పరిణామాలే. అసలు రేపటి సెప్టెంబర్‌-17 సంబరాలకు ముందే ఎందుకీ ‘ముందస్తు షాకులు’? అమిత్‌షా, రాజ్‌నాధ్‌సింగ్‌, ఇద్దరు బీజేపీ సీఎంలు రానున్న హైదరాబాద్‌లో.. ప్రత్యేకించి ఒకరోజు ముందుగానే ఏమిటీ దాడులు? ఇందులో ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా? జాతీయ పార్టీ పేరుతో స్పీడవుతున్న కేసీఆర్‌కు బ్రేకులు వేసే వ్యూహమా? తాజా పరిణామాలతో కేసీఆర్‌ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా వ జ్రోత్సవాల ఘనత బదులు, కవిత ఈడీ కేసులే ఇక తెరపైకి తెచ్చే వ్యూహామా? అసలు ఈడీ దాడుల వెనుక కథేమిటి? ఇదీ ఇప్పుడు కేసీఆర్‌ కూతురు కవితకు ఈడీ నోటీసుల జారీతో అధికార టీఆర్‌ఎస్‌లో టెన్షన్‌. అ‘టెన్షన్‌’.

ఎట్టకేలకూ ఈడీ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు నోటీసుల్చి, ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణానికి సంబంధించిన కేసును కొత్త మలుపు తిప్పింది. అయితే ఆమెకు కరోనా వచ్చి, క్వారంటైన్‌లో ఉన్నారు. అయినప్పటికీ తాజా పరిణామాలతో, ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేంద్రంగా తెలంగాణపై రాజకీయ రచ్చ మొదలయ్యేందుకు ఈడీ దాడులు దోహదం చేశాయి. ఆమె కవితపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ, మరి ఇప్పటిదాకా ఆమెపై ఎందుకు కేసు పెట్టలేద’న్న కాంగ్రెస్‌ నేతల ప్రశ్నల నేపథ్యంలో.. ఈడీ బృందం హటాత్తుగా హైదరాబాద్‌ రావడం .. కవితకు నోటీసు, ఆమె ఆడిటర్‌ బుచ్చిబాబు , ప్రేంసాగర్‌రావు, అభిషేక్‌, అభినవ్‌రెడ్డి, అరుణ్‌పిళ్లై నివాసంలో సోదాలు నిర్వంచిన వైనం టీఆర్‌ఎస్‌ వర్గాల్లో కలవరం సృష్టించింది. గచ్చిబౌలి, నానక్‌రామ్‌కూడ, కోకాపేట, దోమల్‌గూడలో ఈడీ నిర్వహిస్తున్న సోదాల్లో ఏం దొరికాయి? అన్న టెన్షన్‌ అటు టీఆర్‌ఎస్‌ నాయకత్వాన్నీ కలవరపెడుతోంది.

అయితే.. కేంద్రం సరైన సమయంలోనే ఈడీని దింపినట్లు కనిపిస్తోంది. పక్కా రాజకీయ వ్యూహం, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో అన్ని వర్గాలకు కేసీఆర్‌ సర్కారు-పార్టీ చేరువవుతోంది. సరిగ్గా ఇదే సమయంలో .. ఆయన కూతురు కవిత ప్రమేయం ఉందని భావిస్తున్న లిక్కర్‌ స్కాంలో ఆమెకు నోటీసులివ్వడం బట్టి, ఇదంతా పక్కా ప్లాన్‌తోనే, అదను చూసి కొట్టిన దెబ్బగానే అర్ధమవుతోంది.

అటు కేసీఆర్‌ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో .. తన పార్టీ శ్రేణులను, తెలంగాణ జిల్లాల్లో సంబరాలకు సిద్ధం చేయిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను జిల్లాల్లో మోహరింపచేశారు. ఇటు బీజేపీ సైతం.. తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట ఇప్పటికే హైదరాబాద్‌ సహా, తెలంగాణ జిల్లాల్లో ఫ్లెక్సీలు-బ్యానర్లతో హడావిడి చేస్తోంది. పైగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రాజ్‌నాధ్‌సింగ్‌ ఠాకూర్‌, ఇద్దరు ముఖ్యమంత్రులను హైదరాబాద్‌కు తీసుకురావడం ద్వారా.. విమోచన దినోత్సవం పేరిట హిందువులకు చేరవయ్యే ప్రణాళికకు పదునుపెట్టింది.

విమోచన ఉద్యమంలో పనిచేసిన సమర యోధులు, వారి కుటుంబాలను పరామర్శించేందుకు కమలదళం సిద్ధమవుతోంది. పనిలో పనిగా ‘‘రజాకార్ల పార్టీ అయిన మజ్లిస్‌కు భయపడి కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడం లేద’’ంటూ, బీజేపీ రాజకీయ అస్ర్తాలు సంధిస్తోంది. అయితే.. దానిపై టీఆర్‌ఎస్‌ కూడా ఎదురుదాడి ప్రారంభించి, ‘‘అసలు తెలంగాణ విలీనంలో బీజేపీ-ఆరెస్సెస్‌ పాత్ర ఏమీ లేద’’న్న ప్రచారానికి పదునుపెట్టింది. బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటక, మహారాష్ట్రలో ఇప్పటిదాకా విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించలేదన్న ప్రశ్నలతో ఎదురుదాడి చేయడం రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. దీనిపై అటు మీడియా సైతం చర్చలు ప్రారంభించడంతో.. సహజంగా తెలంగాణ సమాజం అంతా విలీన-విమోచన వాదన వైపు ఆసక్తిగా మళ్లింది.

ఈ సమయంలో ఈడీ హటాత్తుగా రంగప్రవేశం చేసి, కవిత-ఆమె సన్నిహితులకు నోటీసులు, ఇళ్లపై దాడులు చేయడంతో ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. విమోచన/విలీన దినోత్సవానికి సరిగ్గా ఒ రోజు ముందుగానే.. టీఆర్‌ఎస్‌ సర్కారు వజ్రోత్సవ వేడుకలను జిల్లాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సమయంలో.. కేసీఆర్‌ జాతీయస్థాయిలో విపక్షాలను కూడగట్టే క్రమంలో హైదరాబాద్‌కు వచ్చిన గుజరాత్‌ మాజీ సీఎం శంకర్‌సింగ్‌ వాఘేలాతో భేటీ అయిన సమయంలో.. ఈడీ బృందం కవితకు నోటీ సు ఇవ్వడం వ్యూహాత్మకంగానే భావిస్తున్నారు.

దీనితో తెలంగాణ సమాజం దృష్టి , తెరాస నిర్వహించే వజ్రోత్సవాల నుంచి ఈడీ దాడుల చుట్టూనే కేంద్రీకృతమవుతోంది. దానికిమించి, కవితపై ఇప్పటివరకూ వచ్చిన ఆరోపణలు నిజం కాబట్టే, ఈడీ నోటీ సులిచ్చిందన్న చర్చకు బీజేపీ వ్యూహాత్మకంగా తెరలేపినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో తన కుమార్తె కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, జాతీయ పార్టీ పెట్టేందుకు కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్‌ వేయడం… అవినీతిపరులంతా కలసి మోదీ సర్కారుపై దాడి చేస్తున్నారన్న సంకేతాలను, దేశ ప్రజలకు పంపించడమే బీజేపీ అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.

ఏదేమైనా.. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం అంశంలో బీజేపీ వ్యూహాత్మకంగా ఒక లక్ష్యం ప్రకారమే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ముందు కవిత పాత్రపై బీజేపీ జాతీయ నేతలు ఆరోపణలు చేయడం.. ఆమె ఢిల్లీలో ఎవరెవరిని కలిసిందీ బయటపెట్టడం.. కవిత పరువునష్టం దావా తర్వాత కొద్దిరోజులు వ్యూహాత్మక మౌనం పాటించడం.. ఆ తర్వాత ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వ్యక్తి వీడియో విడుదల చేయటం… కేసీఆర్‌ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న, ‘సెప్టెంబర్‌ 17’కు ఒకరోజు ముందుగానే ఈడీ దాడులు చేసి కవితకు నోటీసు ఇవ్వడం చూస్తే.. భవిష్యత్తులో మరికొన్ని సంచలనాలకు తెరలేవనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A RESPONSE