కళ్యాణికి అభినందనలు తెలిపిన ప్రముఖులు
అవనిలో సగ భాగమైన మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళలపై నానాటికి అఘాయిత్యాలు పెరుగుతున్న ప్రస్తుత వ్యవస్థలో మహిళలు న్యాయవాద వృత్తిలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు చలకాని వెంకట్ యాదవ్, ఫనీంద్ర భార్గవ్ లు అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ లో తన పేరు నమోదు చేసుకుని న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన జనగామకు చెందిన నారం కల్యాణిని ధ్రువీకరణ పత్రం ఇచ్చి అభినందించి మాట్లాడారు.
సమాజంలో సరైన విలువల బోధన, ప్రగతిశీల భావాల ప్రచారం లేకపోవడంతో నానాటికి సమస్యలు తలెత్తున్నాయని, ప్రధానంగా మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు విచ్చిన్నమవుతున్నాయని అన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో సమాజ సమస్యలు బాగా తెలిసిన మహిళలు ఉన్నతమైన న్యాయవాద వృత్తిలోకి రావడం హర్షించదగిన విషయమని అన్నారు.
ఎన్నో సమస్యలతో, నిత్య కలహాలతో, పౌర హక్కులు ధ్వంసం అవుతున్న నేటి రోజుల్లో సమాజ సేవలో న్యాయవాద వృత్తి కీలకపాత్ర వహిస్తుందని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు, ప్రభుత్వ న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్ అన్నారు. మహిళలు న్యాయవాద వృత్తిలోకి రావడం వల్ల పీడిత వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని వెంకట్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన న్యాయవాద ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ నర్సింహారెడ్డి హాజరై నూతనంగా బార్ కౌన్సిల్ లో ఎన్రోల్ చేసుకున్న న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. నోబుల్ ప్రొఫెషన్ అయిన న్యాయవాద వృత్తిని మర్యాద, విధేయతతో నైతికతతో, నీతివంతంగా నిర్వహించాలని, కోర్టుల పట్ల, జ్యూడిషియల్ అధికారుల పట్ల, తోటి న్యాయవాదులతో మర్యాదగా ప్రవర్తించాలని అన్నారు.
న్యాయవాద వృత్తిలోకి ప్రవేశం పొందిన కల్యాణికి న్యాయవాదులు విప్లవ్ కుమార్, సాయిని నరేందర్, చింతం దనుంజయ, సందేసాని ప్రసాద్, జన్ను పద్మ, నర్సింహా యాదవ్, రవికుమార్, శేఖర్, జె.జె. స్వామి, గాంధీ, ప్రణయ, స్వాతి, రమ్య, జార్జ్, జోసేఫ్, రజనీకాంత్, నల్లపు రాజు, ప్రజా సంఘాల నాయకులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, సోమ రామమూర్తి, వలిబాబా, సుదర్శన్, శ్రీను, గద్దల మహేందర్, వెలుగు వనిత, పటేల్ వనజ, రాదక్క, సింగారపు అరుణ తదితరులు అభినందనలు తెలిపారు.