Suryaa.co.in

Andhra Pradesh

శతాధిక వృద్ధ న్యాయవాది కొండూరి ఇకలేరు !

-గుంటూరు జిల్లా నుండి నేరుగా జిల్లా జడ్జి అయిన తొలి న్యాయవాది
– 80 ఏళ్ల వృత్తి నైపుణ్యం ఆయన సొంతం
కృష్ణ, బాలకృష్ణ, కోడెల వంటి ప్రముఖులకు ఆయనే న్యాయవాది

గుంటూరు బార్ అసోసియేషన్ కు చెందిన శతాధిక వృద్ధ న్యాయవాది, మాజీ న్యాయమూర్తి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు మాజీ రిజిస్ట్రార్ కొండూరి వెంకటేశ్వరరావు (103) గురువారం స్వల్ప అస్వస్థతతో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. దుగ్గిరాల మండలంలోని కంఠంరాజు కొండూరులో 1920 ఏప్రిల్ 10వ తేదీన జన్మించిన కొండూరి ప్రాథమిక విద్యను కొంతకాలం స్వగ్రామంలోనూ, అనంతరం గుంటూరు లోనూ అభ్యసించారు.

1936లో కాకినాడ పిఠాపురం రాజా కాలేజీలో ఇంటర్మీడియట్ అనంతరం, మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో బి ఎ, బి ఎల్ పూర్తి చేశారు. కళాశాలలో ఉండగా తమిళ హీరో జెమినీ గణేషన్ తో కలిసి క్రికెట్, వాలీబాల్ టీం ను ఏర్పాటు చేసి టోర్నమెంట్లు ఆడేవారు.1942 నుండి గుంటూరు జిల్లా కోర్టులలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. స్వాతంత్ర ఉద్యమం లో ఖద్దరు ప్రచారాన్ని విరివిగా చేశారు. 1964లో గుంటూరు జిల్లా నుండి నేరుగా జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఏలూరు, విశాఖపట్నంతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో న్యాయమూర్తిగా తమ విధులు నిర్వహించారు.

ఉరిశిక్ష అమల్లో ఉన్న కాలంలో ఆయన ఎవరికీ ఆ శిక్ష అమలుపరిచేందుకు సుముఖత చూపేవారు కాదు. ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్ గా 1976లో పదవి విరమణ చేశారు. గుంటూరు జిల్లా నుండి నేరుగా న్యాయమూర్తి, హైకోర్టు రిజిస్ట్రార్ అయిన తొలి వ్యక్తిగా కొండూరి రికార్డుల్లో నిలిచారు. న్యాయమూర్తిగా, న్యాయవాదిగా ఆయన అనుభవం 80 ఏళ్ల పై మాటే… 1976 నుండి తిరిగి గుంటూరు జిల్లా కోర్టులలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఐటిసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి జాతీయ స్థాయి సంస్థలకు న్యాయ సలహాదారుగా కొనసాగారు.

సినీ నటులు కృష్ణ, బాలయ్య, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు వంటి ప్రముఖులందరో ఆయనకు క్లైంట్స్. వేలాది సివిల్ కేసుల్లో ఘన విజయాలు సాధించిన కొండూరి, ప్రభుత్వాలు సేకరించే భూసేకరణ కేసుల్లో తనదైన ముద్ర వేసేవారు. కొంతకాలంగా చిన్న కుమారుని వద్ద ఉంటున్న కొండూరి గురువారం హైదరాబాద్ అపోలో లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన న్యాయవాద శిష్యుడు ఎస్ ఏడుకొండలు, కేసానుపల్లి శ్రీరామ్ వెల్లడించారు.

శుక్రవారం హైదరాబాదులోనే అంత్యక్రియలు జరుగుతాయని ఏడుకొండలు, శ్రీరామ్ తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సోమసాని బ్రహ్మానంద రెడ్డి, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, రోళ్ళ మాధవి రెడ్డి, గుంటూరు బార్ అధ్యక్షులు పాలడుగు వెంకటేశ్వర్లు, కార్యవర్గంతో పాటు పలువురు న్యాయవాదులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం గుంటూరు బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదులు, కొండూరి మృతికి నివాళిగా తమ విధులకు గైర్హాజరుకానున్నట్లు వెల్లడించారు. వారి మృతికి బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ సంతాపం తెలియజేస్తూ వారికి ఆ భగవంతుడు మంచి సద్గతిని ప్రసాదించాలని ప్రార్ధించారు.

LEAVE A RESPONSE