Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి వాళ్ల ఆడపిల్లల ఫోటోలు తీస్తారా?

– జగన్ రెడ్డి పాలన గాలికొదిలి ప్రతిపక్ష నేతలపై కక్ష్యసాధిస్తున్నారు
– సిఐడి సునీల్ కి అయినా బుద్థి, ఆలోచన శక్తి ఉండాలి కదా
– ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించే అధికారం సీఐడీ పోలీసులకు ఎవరిచ్చారు?
– జగన్ రెడ్డి బెదిరింపులకు భయపడం, పార్టీ కోసం ఎంతకైనా తెగిస్తాం
– మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు

తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలన గాలకొదిలి ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల మీద కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. శనివారం నాడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…..ప్రభుత్వ వైఫల్యాల్ని, జగన్ రెడ్డి అవినీతిని ప్రశ్నించిన వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు దౌర్జన్యంగా అర్ధరాత్రి ఇళ్ళకు మీదకొచ్చి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు.

సిఐడి డిపార్టమెంటు ఎవరి కోసం పని చేస్తుందో అర్ధం కాని పరిస్థితి. శనివారం, ఆదివారం కోర్టులు ఉండవు కాబట్టి బెయిల్ దొరకదన్న ఉద్ధేశంతో శుక్రవారం వస్తే చాలు ఎవరో ఒకరి మీద అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి ఏ పని చేబితే ఆ పని చేయడం తప్ప పోలీసులకు వేరే పని లేదు. గతంలో చింతకాయల విజయ్ పై సిఐడి పోలీసులు కేసు పెడితే హైకోర్టు స్టే తెచ్చుకున్నారు. కానీ మళ్ళీ అతన్ని ఎందుకు వేధిస్తున్నారు? హైదరాబాద్ లో సిఐడి పోలీసులు చింతకాయల విజయ్ ఇంటి దగ్గర రాత్రి నుంచి ఉన్నారు. ఉదయాన్నే అతని డ్రైవర్ ని కొట్టి అపార్టమెంటులోకి దౌర్జన్యంగా ప్రవేశించారు.

వాళ్లు విజయ్ లేరని చెప్పినా వినకుండా దురుసుగా ప్రవర్తిస్తూ ఇంట్లోకి వెళ్లారు. ఇంటి యజమానులు లేకుండా లోపలికి వెళ్లే అధికారం సీఐడీ పోలీసులకు ఎవరిచ్చారు? ఇళ్లంతా సోదాలు చేశారు. డ్రైవర్ ని కొట్టడం, అక్కడున్న మహిళల్ని బెదిరించడం, చిన్న పిల్లలని కూడా చూడకుండా తమ తండ్రి ఎక్కడ ఉన్నాడో చెప్పాలని బెదిరించడం జగన్ రెడ్డి రాక్షసత్వానికి అద్దం పడుతోంది. జగన్ రెడ్డి ప్రతాపం ఏమైనా ఉంటే మా మీద చూపించాలి తప్ప చిన్న పిల్లల్ని ఫోటోలు తీసి బయపెట్టడమేంటి. ఫోటోలు తీయడానికి అనుమతి ఎవరు ఇచ్చారు.

ఇంటిని సోదా చేయాలంటే నోటీసు ఇవ్వాలి. అవేవి లేకుండా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి సోదాలు ఎలా చేస్తారు? సిఐడి సునీల్ కి అయిన బుద్థి, ఆలోచన శక్తి ఉండాలి కదా. ముఖ్యమంత్రి ఏది చెబితే అది చేసేయడమేనా? రాష్ట్రంలో అనేక మంది దోపిడి దారులు ఉన్నారు. అందులో మీ ముఖ్యమంత్రే పెద్ద దోపిడి దారుడు, మంత్రులు చాలా మంది ఉన్నారు. దమ్ముంటే వాళ్ల మీద మీ సీఐడీ ప్రతాపం చూపండి. మాకు టీడీపీ ప్రాణం, ఎన్టీఆర్ అంటే అభిమానం. ఆ పార్టీలో ఉన్నందున ప్రతిపక్షంగా ప్రశ్నించే హక్కు మాకుంటుంది. విజయ్ పిల్లల్ని ఫోటోలు తీసినట్టే ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్లి వాళ్ల ఆడపిల్లల ఫోటోలు తీస్తారా?

ముఖ్యమంత్రిలా మేం ఏమి జైళ్లో లేం. ఏం తప్పు చేశామని అరెస్ట్ లు చేస్తారు? ఒక వేళ అరెస్ట్ చేయాల్సి వచ్చినా ఏ సెక్షన్ కింద యఫ్.ఐ.ఆర్ నమోదు చేశారో నోటీసు ఇవ్వాలి. అంతేగాని మీరు బెదిరింపులకు పాల్పడితే బెదిరిపోతాం అనుకున్నారా. పార్టీ కోసం, మా కార్యకర్తల కోసం ఎంతకైనా తెగిస్తాం. పోలీసులు, సిఐడికి బయపడే ప్రసక్తే లేదు. రాష్ట్రంలోని ప్రజలంతా జగన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడూ పోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇసుక, మద్యం దోపిడి చేస్తున్నారు. రాష్ట్రంలోని సహజవనరుల్నీ దోచేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. చదువుకునే పిల్లల భవిష్యత్తు అధ్వానం చేశారని అయ్యన్న పాత్రుడు అన్నారు.

LEAVE A RESPONSE