Suryaa.co.in

Andhra Pradesh

పంచాయతీల నిధులపై ఎల్లో మీడియా దుష్ప్రచారం

  • ఆ నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం
  • ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షల పనులు
  • ఆ విధంగా రూ.3 వేల కోట్ల పనుల మంజూరు
  • గత ప్రభుత్వం ఏనాడైనా ఆ పని చేసిందా?
  • గ్రామాల్లో అందులో సగం అయినా ఖర్చు చేశారా?
  • టీడీపీ హయాంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం
  • జన్మభూమి కమిటీలకు అంతులేని అధికారాలు
  • పంచాయతీల కరెంటు బిల్లులు ఎగ్గొట్టిపోయారు
  • ఆ విధంగా డిస్కమ్‌లను పూర్తిగా ముంచేశారు
  • డిస్కమ్‌లు మునిగిపోకుండా బిల్లులు కడితే తప్పా?
  • ఇప్పుడు గ్రామాల్లో విప్లవాత్మక అభివృద్ధి
  • సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో మార్పులు
  • ప్రజల ఇంటి గడప వద్దకే ప్రభుత్వ పాలన
  • ఎక్కడా అవినీతి, కులం, మతం, వర్గం లేదు
  • పూర్తి పారదర్శకంగా అన్ని పథకాల అమలు
  • ఇది కాదా గ్రామాల్లో నిజమైన అభివృద్ధి
  • ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు

నిరాధార ఆరోపణలు.విమర్శలు:
పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయిలో పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. ఆ పార్టీని ఎలాగోలా మళ్ళీ బతికించుకోవాలని సర్పంచుల ఆందోళన అని, గ్రామాలకు నిధులు అందటం లేదని రెండు రకాల దుష్ప్రచారం మొదలుపెట్టారు. అందులో భాగంగానే పంచాయతీలకు మళ్ళీ షాక్, పీడీ ఖాతాల్లోకి ఆర్థిక సంఘం నిధులు… అంటూ తెలుగుదేశం పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.

గ్రామాన్ని ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు గొప్పవాడని… దేశ చరిత్రలోనే ఏనాడూ కనీవినీ ఎరుగని విధంగా ఈ మూడేళ్ళ మూడు నెలల కాలంలోనే విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చిన జగన్‌గారి ప్రభుత్వం గ్రామానికి అన్యాయం చేసిందంటూ.. దుష్ప్రచారం చేçస్తున్నాయి. ఆ నిరాధార ఆరోపణలు, విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

అసలు పంచాయతీలు అంటే?:
గ్రామ పంచాయతీలు అంటే కేవలం ఆర్థిక సంఘం ని«ధులకు సంబంధించినవి మాత్రమే కావు. స్థానిక ప్రజల అవసరాలు తీర్చడం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా పరిపాలనా విధానం.. ఆ దిశలో పలు కార్యక్రమాలు.. ఇవన్నీ కలిసి ఉండేవే గ్రామ పంచాయతీలు.

నాడు నిర్వీర్యం:
గత ప్రభుత్వం వాస్తవానికి పంచాయతీలన్నింటినీ నిర్వీర్యం చేసింది. ఆ విధంగా పాలనా వ్యవస్థను నాశనం చేసింది. గతంలో ఏనాడు లేని విధంగా జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి, సర్పంచ్‌ల అధికారాలు కూడా హరించారు. గ్రామంలో పనులు చేయాలంటే, సర్పంచ్‌కు కాకుండా, ఆ అధికారం జన్మభూమి కమిటీలకే ఇచ్చారు.

ఇప్పుడు విప్లవాత్మక మార్పులు:
రాష్ట్రంలో  వైయస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత గ్రామస్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పరిపాలన వికేంద్రీకరణ చేశారు. ప్రజల ముంగిటే ప్రభుత్వ పాలన అందిస్తున్నారు. ఇంటి గడప వద్దనే పథకాలు అందిస్తున్నారు.
ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించారు. ప్రతి సచివాలయంలో 12 మంది సిబ్బంది. వారు అన్ని విధాలుగా సేవలందిస్తున్నారు. ఏ సర్టిఫికెట్‌ కోసం అయినా మండలానికి వెళ్లకుండా, గ్రామంలోనే అన్నీ పొందే విధంగా సేవలందిస్తున్నారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా సచివాలయాలు సేవలందిస్తున్నాయి. అర్హతే ప్రధాన అర్హతగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.
అలాగే విత్తనం మొదలు పంటల అమ్మకం వరకు అడుగడుగునా రైతులకు అండగా ఉండేలా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ప్రతి ఒక్క పథకం, కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో శాచురేషన్‌ పద్ధతిలో, అర్హులైన ఏ ఒక్కరు కూడా మిస్‌ కాకుండా అమలు చేస్తున్నాం. గతంలో ఆనాడు వైయస్సార్‌గారు, ఇప్పుడు జగన్‌గారు ఆ పని చేస్తున్నారు.

బిల్లులు ఎగ్గొట్టిపోయారు:
తెలుగుదేశం ప్రభుత్వం తన అయిదేళ్ల పాలనలో పంచాయతీలు కరెంటు బిల్లులు ఎగ్గొట్టి డిస్కమ్‌లను ముంచేసి దిగిపోయింది. డిస్కమ్‌లకు కట్టాల్సిన బకాయిలు కట్టని పక్షంలో అవి పూర్తిగా మునిగిపోతే పరిస్థితి ఏమిటి?
డిస్కమ్‌లు మునిగిపోకుండా కరెంటు బిల్లులు కడితే తప్పా? గతంలో ఇవే పత్రికల్లో ఏం రాశారు? పీడీ ఖాతాల్లో డబ్బులు ప్రభుత్వం తీసేసుకుంది అని రాశారు. ఇప్పుడు ఏం రాస్తున్నారు? పీడీ ఖాతాల్లో డబ్బులు వేయటం తప్పు అన్నట్టు రాస్తున్నారు.

అలా ఎందుకంటే..?:
ఇదంతా ఎందుకంటే… ఇదంతా చంద్రబాబు గ్రామాలకు ఏమీ చేయలేదన్న విషయాన్ని మరుగు పరిచేందుకు. ఇంకా చెప్పాలంటే టీడీపీకి 10 శాతం సర్పంచులు కూడా లేరన్న నిజాన్ని మరుగు పరిచేందుకు. వాస్తవాలు ఇలా ఉంటే.. టీడీపీ అనుకూల మీడియా ఏకపక్షంగా విమర్శలు చేస్తోంది. అదే విధంగా ఒక పంచాయతీ డబ్బును మరోచోట వ్యయం చేయడం లేదు. ఎక్కడి నిధులు అక్కడే, సంబంధిత పంచాయతీలోనే ఖర్చు చేస్తోంది. ఆ మేరకు పెండింగ్‌ కరెంటు బిల్లులు చెల్లిస్తోంది.

ఈ అభివృద్ధి కనిపించడం లేదా?:
ఈరోజు గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ఇంటింటికీ వెళ్తున్నాం. ఆ ఇంటికి ప్రభుత్వం నుంచి ఏమేం అందాయన్నది చెబుతున్నాం. వాటిని స్పష్టంగా చూపుతున్నాం.ఇవన్నీ గ్రామ పంచాయతీల అభివృద్ధి కాదా? పంచాయతీల అభివృద్ధిలో ఇవన్నీ భాగం కాదా? ఇవన్నీ ఆ ఎల్లో మీడియాకు కనిపించడం లేదా?.
సచివాలయాలు, నాడు–నేడు కింద స్కూళ్లు, ఆస్పత్రుల్లో సమూల మార్పులు, విలేజ్‌ క్లినిక్స్, డిజిటల్‌ లైబ్రరీలు, ఆర్బీకేలు, 108, 104 సర్వీసులు.. ఇవన్నీ గ్రామాల స్వరూపాన్ని మారుస్తున్నాయి. ప్రతి ఒక్క గ్రామ సచివాలయ పరిధిలోనూ రూ.20 లక్షల వంతున వర్క్స్‌ శాంక్షన్‌ చేస్తున్న ప్రభుత్వం ఎవరిది? ఇలా చేస్తున్న ఖర్చు రూ.3,000 కోట్లు. ఇందులో సగం అయినా చంద్రబాబు ప్రభుత్వం ఏనాడైనా గ్రామం కోసం ఖర్చు చేసిందా?

ఇది నిజం:
ఈ డబ్బుకు సంబంధించిన నిజం ఏమిటంటే… ఇది ఫైనాన్స్‌ కమిషన్‌ నిబంధనల మేరకు గ్రామాలకు బదలాయించే డబ్బు కాదు. ఇది ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా ఇచ్చే డబ్బు కూడా కాదు. వాటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా ఖర్చు చేస్తున్న డబ్బు.
నీరు–చెట్టు ద్వారా గ్రామాన్ని అడ్డంపెట్టుకుని డబ్బు దోచుకు తిన్న తెలుగుదేశం నాయకుల మాదిరిగా ఈ ప్రభుత్వంలో జరగటం లేదని టీడీపీ, ఎల్లో మీడియా బాధపడుతున్నట్టుంది. కానీ దురుద్దేశంతో, అభివృద్ధిని చూపకపోగా, ఎక్కడైనా, ఏదైనా చిన్న ఘటన జరిగితే దాన్ని చాలా పెద్దగా చూపుతున్నారు.

ఆనాడంతా అవినీతిమయం:
గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో జన్మభూమి కమిటీలు మొత్తం వ్యవస్థలను నాశనం చేశాయి. నీరు–చెట్టు కార్యక్రమం కింద అంతులేని అవినీతికి పాల్పడ్డారు. ఉపాధి హామీ పథకంలో కూడా పనులు దక్కనివ్వలేదు. లంచం ఇస్తే తప్ప, ఒక్క పని కూడా అయ్యేది కాదు. ప్రతి పనికి లంచం తీసుకున్నారు. ఇల్లు, పెన్షన్‌.. ఏది కావాలన్నా లంచం ఇవ్వాల్సి వచ్చేది.
30 ఏళ్లు ప్రాతినిథ్యం వహించినా, చంద్రబాబు ఏనాడూ కుప్పంను అభివృద్ధి చేయలేదు. ఇది వాస్తవం.

మళ్లీ చెబుతున్నాం:
కానీ మేము అన్నీ చేసి చూపుతున్నాం. గ్రామ పంచాయతీల నిధులను ఎక్కడా దారి మళ్లించడం లేదు. ఎక్కడి నిధులను అక్కడే వ్యయం చేస్తున్నాం. ముఖ్యంగా విద్యుత్‌ బిల్లుల బకాయిలు చెల్లిస్తున్నాం. అందువల్ల మళ్లీ చెబుతున్నాం. ఎక్కడా నిధుల మళ్లింపు ఉండదు.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
వికేంద్రీకరణతోనే అభివృద్ధి:
వికేంద్రీకరణ గురించి మాట్లాడాలంటే.. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చూశాం. అన్ని నిధులను హైదరాబాద్‌లోనే వ్యయం చేశారు. ఆ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. దీంతో మిగిలిన ప్రాంతాలు వెనకబడి పోయాయి. చివరకు అది రాష్ట్ర విభజనకు దారి తీసింది. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా, పరిపాలన వికేంద్రీకరణ కోరుతున్నాం.

ఒక్క అమరావతిలోనే లక్షల కోట్ల వ్యయం కన్నా, ఇప్పటికే అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన విశాఖలో కేవలం రూ.10 వేల కోట్లు వ్యయం చేస్తే, రాజధానిగా మరింత అభివృద్ధి చెందుతుంది.
అమరావతిలో కేవలం కొన్ని గ్రామాల్లో భూములపై పెట్టుబడులు పెట్టిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఇవాళ తమ స్వార్థం కోసం పాదయాత్ర చేస్తున్నారు.

వారి దురాలోచనను తిప్పి కొట్టే విధంగా, ఇక్కడ కూడా కార్యాచరణ మొదలు కాబోతున్నది. దీనికి ఉత్తరాంధ్రతో పాటు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధిని కోరుతున్న వారంతా ఏకమవుతున్నారు. జేఏసీ కూడా ఏర్పాటు చేశారు.

LEAVE A RESPONSE