– పార్టీలో చేరికలకు గ్రీన్‌సిగ్నల్
– ఇకపై వారంలో ఒకసారి పార్టీ ఆఫీసుకు
– మునుగోడులో పోటీకి దూరం?
– ముందు పార్టీపై దృష్టి పెట్టాలన్న బాబు
– తెలంగాణలో పర్యటనలకు గ్రీన్‌సిగ్నల్
– నోరున్న నేతలకు పదవులు
-గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్‌పై పూర్తి స్థాయి దృష్టి
– 13న తెలంగాణ నేతలతో కీలక భేటీ
– తెలంగాణలో మళ్లీ స్పీడు పెంచిన చంద్రబాబు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఇప్పటిదాకా తెలంగాణలో పార్టీని వదిలేసి ఏపీపైనే పూర్తి స్థాయి దృష్టి సారించిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు.. ఇక మళ్లీ తెలంగాణలో పార్టీ విస్తరణపై దృష్టి సారించనున్నారు. ఆ మేరకు ఆ పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలిచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా తొలి విడత తెలంగాణలోని కొన్ని కీలక జిల్లాలపై దృష్టి సారించాలని బాబు పార్టీ నేతలకు సూచించారు. అదే సమయంలో వివిధ కారణాలతో స్తబ్దతగా ఉన్న సీనియర్లతో మాట్లాడి, వారిని తిరిగి పార్టీలో బాధ్యతలు అప్పగించేలా చూడాలని తెలంగాణ నేతలను ఆదేశించారు.
తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మళ్లీ స్పీడు పెంచారు. ఇప్పటివరకూ తెలంగాణలో పార్టీని పట్టించుకోకుండా, స్థానిక నేతలకే పార్టీని వదిలేసిన చంద్రబాబునాయుడు, ఇకపై తానే స్వయంగా పర్యవేక్షించనున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్శింహులు పనితీరుపై ఇప్పటికే చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేతలను సమన్వయం చేసుకోవడంలో ఆయన విఫలమవుతున్నారని, ఆయనను తప్పిస్తే తప్ప పార్టీ బాగుపడదన్న వ్యాఖ్యలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఇవి పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికీ వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చడంతో, చంద్రబాబు వేగంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణలో పోగొట్టుకున్న బలాన్ని తిరిగి సంపాదించేందుకు, చంద్రబాబు నాయుడు తొలిసారి కసరత్తు ప్రారంభించారు.
ఆమేరకు ఆయన తాజాగా, తెలంగాణ నేతలతో సమావేశం నిర్వహించారు. ఇకపై తాను ప్రతి వారం పార్టీ ఆఫీసుకు వచ్చి, కార్తకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. తెలంగాణలో పార్టీకి మళ్లీ పునరజ్జీవం ఇచ్చేందుకు కార్యక్రమాలు రూపొందించాలని, ఆయన తెలంగాణ నాయకత్వానికి సూచించారు. తొలుత పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి, ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడాలని సూచించారు. ‘మనం బలంగా ఉంటే మన దగ్గరకు అంతా వస్తారు. మీరు మీ పని చేయండి. నేను నా పనిచేస్తా. పార్టీని మీకే వదిలేశా. ఇప్పుడు రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కాబట్టి మనం ఆ మేరకు ముందుండాలి’ అని దిశానిర్దేశం చేశారు.
కాగా తొలి దశలో గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఆ మేరకు అనుసరించాల్సిన వ్యూహంపై, ఈనెల 13న జరిగే సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా త్వరలో తెలంగాణలో జిల్లా పర్యటనలకు వెళ్లేందుకు, చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
మునుగోడులో పోటీ లేనట్టే!
ఇదిలా ఉండగా మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేసే అంశంపై, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతల అభిప్రాయం తెలుసుకున్నారు. ప్రస్తుతం బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారినే నిలిపినందున, బీసీ అభ్యర్ధిని రంగంలోకి దింపితే బాగుంటుందని కొందరు నేతలు సూచించారు. మరికొందరు మాత్రం.. ముందు సంస్థాగతంగా పార్టీపై దృష్టి పెట్టి, బలం పెంచుకునేందుకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. గత ఎన్నికల తర్వాత చాలామంది సీనియర్లు స్తబ్దతగా ఉన్నారని, వారితో మాట్లాడి వారికి బాధ్యతలు అప్పగించాలని తెలంగాణ నాయకత్వానికి చంద్రబాబు సూచించారు.
‘మనం పార్టీని మళ్లీ బలోపేతం చేసేందుకు వేస్తున్న అడుగులు, లక్ష్యం ముందు ఒక ఉప ఎన్నిక చాలా చిన్నది. అలాంటి ఉప ఎన్నికలో విజయం సాధించకపోతే క్యాడర్లో నిరాశ వస్తుంది. అయినా ఒక్క సీటు గెలిచి చేసేది ఏమీ లేదు. కాబట్టి ఉప ఎన్నికలో పోటీ చేయకుండా, ముందు పార్టీ విస్తరణపై దృష్టి సారిస్తే మంచిద’ని ఓ నాయకుడు సూచించినట్లు తెలిసింది. అందుకు చంద్రబాబునాయుడు కూడా, సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. 13న జరిగే సమావేశంలో మునుగోడులో పోటీ చేసే అంశాన్ని ఖరారు చేస్తారని ఓ సీనియర్ నేత వెల్లడించారు.