Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర విభజనకు జగన్ మద్దతిచ్చిన విషయం గుర్తుందా?

– ట్విటర్‌లో విజయసాయికి బదులిచ్చిన జైరాం రమేశ్‌

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు మద్దతిచ్చారని, దీనిపై అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాశారని కాంగ్రెస్‌ నాయకుడు జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.తాను బళ్లారిలో ఉన్నానని, ప్రస్తుతం ఆ లేఖ తన వద్ద లేదని, పుస్తకంలో ఉందని వివరించారు. భారత్‌ జోడో యాత్ర ఏపీలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ లేదని, ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టిన విషయాన్ని ప్రజలు రాహుల్‌ గాంధీకి గుర్తు చేయాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. దీనిపై జైరాం రమేశ్‌ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

ఇది చూసిన కొందరు 2012 డిసెంబరు 28న కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేకు అప్పటి వైకాపా రాజకీయ వ్యవహారాల కమిటీ నేత ఎంవీ మైసురారెడ్డి, సెంట్రల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డి రాసిన లేఖను పోస్టు చేశారు. ”2011 జులై 8, 9వ తేదీల్లో జరిగిన పార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. తెలంగాణ ప్రజల మనోభావాలను తమ పార్టీ గౌరవిస్తుందని పునరుద్ఘాటిస్తున్నాం. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం, లేదా విభజించడంపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంది.అయినా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమే మేము కోరుతున్నాం’ అని అందులో ఉంది. ఆ లేఖను జైరాం రమేశ్‌ మళ్లీ రీపోస్టు చేస్తూ.. ‘జగన్‌ ఆమోదించాకే వైకాపాకు చెందిన సీనియర్‌ నాయకులు ఈ లేఖను పంపారు. గుర్తుందా? ఇంకా ఏమైనా చెప్పాలా?’ అని ప్రశ్నించారు.

LEAVE A RESPONSE